ఖోజీలు… సరిహద్దుల వెంట గస్తీ కాసే మనుషులు. పాత రోజుల నాటి ఇన్ఫార్మర్ వ్యవస్థకు గుర్తులుగా మిగిలారు. సరిహద్దులు దాటి ఎవరైనా మన భూభాగంలోకి ఎంటరైతే వెంటనే పసిగట్టేస్తారు. చీకటితోనే ఖోజీల వేట మొదలవుతుంది. ఇసుకలో బూట్ల ముద్రలు కనబడితే చాలు. వాళ్ల గుట్టుమట్లన్నీ కనిపెట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి అందజేస్తారు. కాలి గుర్తులు ఒంటెవా, మనిషివా అన్నది చిన్నప్పట్నుంచే ఎడారిలో తిరిగేవాళ్లకు తెలుస్తుంది. దేశానికి ఇంతగా సేవలు చేసే ఖోజీలు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు.
ఎడారి ప్రాంతం అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎటు చూసినా ఇసుక తిన్నెలే తప్ప మనిషి అనేవాడే కనిపించడు. అలాంటి ఎడారిలోకి పరాయి దేశం నుంచి అక్రమంగా ఎవరైనా ఎంటరైతే…? ఎడారి అంటే ఇసుకే కదా…అలాంటి ఇసుకలోకి బయటి దేశపోడు ఎంట్రీ ఇచ్చినా ఎవరూ పసిగట్టలేరని అనుకుంటాం. అయితే అది అపోహ మాత్రమే. ఇసుకలో బూట్ల ముద్రలను చూసి (కొన్ని సందర్భాల్లో పాదముద్రలుకూడా) వచ్చిన వాళ్ల జాడ కనిపెట్టడం ఒక విద్య. ఆ విద్య చాలా కొద్దిమందికే తెలుసు. వాళ్లే…ఖోజీలు! రాజస్థాన్ ఎడారుల్లో ఇండో–పాకిస్థాన్ సరిహద్దుల్లో గస్తీ కాస్తుంటారు వీళ్లు. ఖోజీ పని చేయడానికి మామూలు తెలివితేటలు సరిపోవు. హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. కేవలం బూట్ల ముద్రలు చూసి ఆ వ్యక్తి వయసు, బరువు వంటి అనేక విషయాలను నిర్థారించగల టాలెంట్ ఉండాలి. ఖోజీల పని అంతా పరిశీలన మీదే ఆధారపడి ఉంటుంది. ఖోజీలుగా ఉద్యోగంలో తీసుకున్నవారికి ఇందుకు సంబంధించి కొంతకాలం ట్రైనింగ్ ఇస్తారు. ఆ తరువాత రాజస్థాన్ ఎడారుల్లో పోస్టింగ్ ఇస్తారు. ‘బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్సెఫ్)’ కంట్రోల్లో ఈ ఖోజీలు పనిచేస్తుంటారు. ఇక్కడి ఇండో–పాకిస్థాన్ వెంట ఉన్న 471 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో వీళ్లు గస్తీ కాస్తుంటారు. తొలి రోజుల్లో ఈ పని చేయడానికి వందలాది మంది ఖోజీలు ఉండేవారు. అయితే ప్రస్తుతం వీళ్ల సంఖ్య పాతికకు మించడం లేదు.
తెల్లవారుజామునే డ్యూటీకి ‘ఖోజీ’
‘ఖోజీ’ల డ్యూటీ తెల్లవారుజామునే మొదలవుతుంది. తెలతెలవారుతుండగానే ఎడారి ఇసుకలో ఖోజీలు వేట మొదలెడతారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎడారి ఇసుకను పరిశీలిస్తూ ముందుకు సాగుతుంటారు. ఖోజీల నడక కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రెండున్నర గంటల్లో ఒక్కో ఖోజీ దాదాపు పది కిలోమీటర్లు శత్రువులకోసం ఇసుకలో వెయ్యి కళ్లు వేసి మరీ నడుస్తారు. అలా అని పరుగెత్తుకుంటూ పోరు. ఇసుక తిన్నెలను భూతద్దం పెట్టినట్టు అణువణువూ వెతుకుతారు. డేగ కళ్లతో ఆసాంతం పరిశీలిస్తారు. ఎక్కడైనా బూట్ల ముద్ర కనిపిస్తే టక్కున అక్కడ ఆగిపోతారు. బూట్ల ముద్ర ఆధారంగా ఆ వ్యక్తి వయసు ఎంతుంటుందో అంచనా వేస్తారు. బూట్ల ముద్రల వెంట నడుచుకుంటూ వెళ్తారు. వీలు చూసుకుని పై అధికారులకు బయటి దేశపోడు జొరబడ్డ విషయాన్ని చేరవేస్తారు.
చిన్నప్పటి నుంచే…
ఎడారులకు దగ్గర్లో ఉండే గ్రామాలకు చెందినవాళ్లే ఎక్కువగా ఖోజీలుగా పనిచేస్తుంటారు. ఎడారుల్లో ఒంటెలు ప్రయాణించే తీరును చిన్నప్పటి నుంచే పరిశీలిస్తుంటారు. దీంతో మనిషి బూటు మద్రకు, ఒంటె లేదా ఇతర జంతువు పాదముద్రకున్న తేడా ఇట్టే పట్టేస్తారు. ఈ విద్యలో మెజారిటీ ఖోజీలకు గులాబ్ సింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. గులాబ్ సింగ్ రెండేళ్ల కిందటి వరకు బీఎస్సెఫ్లో పనిచేసి రిటైరయ్యారు. బీఎస్సెఫ్కు ఖోజీలను ఒక ప్లస్ పాయింట్అని ఆయన అంటారు.
ఎంటరైతే పట్టుకోవడం ఈజీనే
సరిహద్దులు దాటి రాజస్థాన్ ఎడారుల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే పట్టుకోవడం ఈజీనే అంటున్నారు బీఎస్ఎఫ్ అధికారులు. ఎందుకంటే, సరిహద్దు ప్రాంతం నుంచి దగ్గరలోని పట్టణం దూరం కనీసం 50 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఎడారిలో నడుచుకుంటూ అక్కడి దగ్గర్లోని టౌన్‌కు చేరుకునేటప్పటికే బలగాలకు సమాచారం అందుతుంది. ఎటు నుంచి వచ్చినా వల పన్ని చొరబడ్డ వ్యక్తిని పట్టుకుంటారు.
సరిహద్దుల వెంట హై సెక్యూరిటీ
ఇండో–పాకిస్థాన్ సరిహద్దుల వెంట ఉన్న రాజస్థాన్ ఎడారులు మన దేశ భద్రతకు సంబంధించి కీలకమైన ప్రాంతం. రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగిన దాఖలాలు కూడా కొన్నేళ్లుగా లేవు. అయితే డిఫెన్స్ పరంగా కీలక ప్రాంతం కావడంతో రాజస్థాన్ ఎడారులపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సరిహద్దుల వెంట రాత్రిపూట ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసింది. ఫెన్సింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. రాత్రింబవళ్లు నిఘా పెట్టింది. దీంతో ఈ సరిహద్దుల నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య బాగా తగ్గింది. కొన్నేళ్ల కిందటి వరకు బంగారం, మత్తుపదార్థాల స్మగ్లింగ్ జరుగుతుండేది. అయితే సాయుధ బలగాలు పటిష్టమైన