
న్యూఢిల్లీ: ఉచితాలు పేదరికాన్ని నిర్మూలించవని, ఉద్యోగాల కల్పనతోనే పేదరికం పోతుందని ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. ముంబైలో జరిగిన ఎంటర్ ప్రెన్యూర్ల కార్యక్రమంలో మూర్తి మాట్లాడారు. ఎంటర్ ప్రెన్యూర్లు కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తే.. పేదరికం ఉదయపు ఎండలో పొగమంచులా మాయమవుతుందన్నారు. ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారా ఏ దేశం కూడా విజయం సాధించలేదని పేర్కొన్నారు.
‘‘ఇక్కడున్న ఎంటర్ ప్రెన్యూర్లు కొన్ని వందల ఉద్యోగాలు సృష్టిస్తారన్న నమ్మకం నాకు ఉంది. అందులో సందేహం లేదు. పేదరికాన్ని తొలగించాలంటే ఉద్యోగాల కల్పనే మార్గం. అంతేతప్ప ఉచితాలు కాదు” అని మూర్తి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పార్టీలు ప్రజలకు ఉచితాలపై ఇష్టమొస్తున్నట్లు హామీలు ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.