Infosys News: మరో 240 మంది ట్రైనీలను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్.. కానీ ఒక ఆఫర్..

Infosys News: మరో 240 మంది ట్రైనీలను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్.. కానీ ఒక ఆఫర్..

IT News: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నిన్న తన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం ఏడాది  ప్రాతిపదికన 12 శాతం క్షీణించి ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. అయితే ఒక్కో షేరుకు రూ.20 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ సగటున ఉద్యోగులకు 5-8 శాతం మధ్యలో వేతన పెంపులను అందించింది. ఇదే క్రమంలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన ఉద్యోగులకు మాత్రం 10-12 శాతం మధ్య వేదన పెంపులను ఆఫర్ చేసింది.

కంపెనీ ఇదే క్రమంలో కంపెనీ సీఎఫ్ఓ మాట్లాడుతూ దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20వేల మంది టెక్ ఫ్రెషర్లను హైర్ చేసుకోవాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఏడాది ప్రారంభంలో దాదాపు 400 మంది ట్రైనీలను లేఆఫ్ చేయటమే. 

తాజాగా మరోసారి కంపెనీ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ఫెయిల్ అయిన దాదాపు 240 మంది ట్రైనీలను ఇంటికి పంపేసిందనే వార్త బయటకు రావటం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ప్రభావితం అయిన ట్రైనీలు ఏప్రిల్ 18న మెయిల్స్ అందుకున్నట్లు వెల్లడైంది. ఇదే తరహా తొలగింపులు ఫిబ్రవరిలోనూ జరగగా ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడ ఒక శుభవార్త ఏమిటంటే పరీక్షలో ఫెయిల్ అయిన ట్రైనీలకు ప్రస్తుతం కంపెనీ ఉచితంగా అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. ఎన్ఐఐటీ, అప్ గ్రాండ్ ద్వారా ఉచితంగా ప్రోగ్రామ్స్ పొందేందుకు వీలు కల్పించింది. 

అలాగే మరో కెరీర్ మార్గాన్ని కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తన మెయిల్ లో వెల్లడించింది. బీపీఎం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అనుకుంటే అందుకు అవసరమైన ట్రైనింగ్ కోసం ఇన్ఫోసిస్ స్పాన్సర్ చేస్తుందని వెల్లడించింది. అలా ట్రైనింగ్ పూర్తయ్యాక ఇన్ఫోసిస్ బీపీఎల్ లిమిటెడ్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలకు వారు అప్లై చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే ట్రైనీలు మైసూరులోని తమ సెంటర్ నుండి బెంగళూరు లేదా వారి స్వగ్రామానికి వెళ్లడానికి ఒక నెల జీతంతో పాటు ట్రావెల్ అలవెన్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది. 

టెక్నాలజీ వైపుకు వెళ్లాలనుకునే వారికి ఎన్ఐఐటీ కింద, బీపీఎం వైపు వెళ్లాలనుకునే వ్యక్తులకు అప్ గ్రాండ్ కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఇన్ఫోసిస్ సపోర్ట్ చేస్తోంది.