ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో లేఆప్స్ కలకలం రేపుతున్నాయి. శిక్షణ ఇచ్చినప్పటికీ, ఇంటర్నల్ అసెస్‌మెంట్స్(అర్హత పరీక్ష) క్లియర్ చేయడంలో విఫలమైన 700 మంది ఫ్రెషర్లను సంస్థ తొలగించినట్లు సమాచారం.
2023, 2024.. ఈ రెండేళ్లలో వీరిని రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ అనంతరం.. ఇంటర్నల్ అసెస్‌మెంట్స్ క్లియర్ చేయాలన్నది ఇన్ఫోసిస్ రూల్. 1000 మందిని రిక్రూట్ చేసుకోగా.. అందులో దాదాపు 700 మంది మూడు సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ అసెస్‌మెంట్‌లలో ఉత్తీర్ణులు కాలేకపోయారట. వీరిని కొనసాగిస్తే, జీతాలు దండగ అనుకున్నారో.. ఏమో.. బయటకు నూకేశారు. వెళ్లమని మొండికేసిన వారిని బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో బయటకు వెళ్లగొట్టించారని జాతీయ మీడియా పేర్కొంది.
ALSO READ | 140 మంది ఉద్యోగులకు.. రూ.14 కోట్ల బోనస్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న AI స్టార్టప్ కంపెనీ
ఈ చర్యలను ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. ఫ్రెషర్లు అసెస్‌మెంట్ క్లియర్ చేయడానికి మూడు ప్రయత్నాలు ఇస్తాం.. విఫలమైన వారు సంస్థలో కొనసాగలేరు. ఈ విషయం ఆఫర్ లెటర్లలో కూడా పొందుపరిచాం..గత రెండు దశాబ్దాలకు పైగా సంస్థ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.. అని చెప్పుకొచ్చింది.
ఉద్యోగాలు పోయిన వారిలో ఎక్కువ మంది 2022, 2023(BE/ Btech) బ్యాచ్‌లకు చెందినవారున్నారు. రూ. 3.2 నుండి 3.7 లక్షల వార్షిక ప్యాకేజీలతో వీరంతా ఉద్యోగాల్లో చేరారు. లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులు కంటతడి పెట్టుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏంటనేది ప్రశ్న.
అయితే, ఇన్ఫోసిస్ చర్యలను నస్సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) విమర్శించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి.. శిక్షణా సమయంలోనే వెళ్లగొట్టడం అనైతికమని పేర్కొంది.