AI గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది.. ఇదో పాత ప్రోగ్రాం: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

AI గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది.. ఇదో పాత ప్రోగ్రాం: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

AI.. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా ఇదే.. ప్రతి అంశంలోనూ ఏఐ గురించే మాట్లాడుతున్నారు.. గల్లీ కుర్రోడి నుంచి ప్రధాని వరకు అందరి నోటా ఇదే.. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది.. ప్రతి అంశంలోనూ ఏఐ.., ఏఐ అంటూ మాట్లాడుతున్నారు.. ఇది ఓ పనిమాలిన పాత ప్రోగ్రాం.. దీన్ని పట్టుకుని ఏదో అద్భుతం అంటున్నారంటూ చురకలు అంటించారాయన.

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ తెలివి తక్కువ పాత ప్రోగ్రామ్స్.. వీటినే ఏఐగా ప్రతిదాంట్లో తీసుకురావటం అనేది ఫ్యాషన్ అయిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఇది ఒక మామూలు విషయమని ఏఐ గురించి నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఓ టెక్ కార్యక్రమంలో తన మనస్సులోని మాటలను.. టెక్నాలజీలో తనకున్న అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.

మెషిన్ లెర్నింగ్ అనేది లోతైన అధ్యయనం అని.. పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించటానికి ఉపయోగించే టూల్ అంటూ చెప్పుకొచ్చారాయన. మన డేటాను మాత్రమే అంచనా వేస్తుందని.. AI ఇచ్చే సమాధానాలు మనం సృష్టించిన డేటా ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారాయన. మన డేటాను మరింత లోతుగా విశ్లేషించటానికి.. అందులోని కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావటానికి ఉపయోగపడుతుందన్నారు. ఐటీ రంగంలో ఇది ఎప్పటి నుంచో ఉందని.. కాకపోతే ఇటీవల ప్రతి సంస్థ AI.. ఆర్టిఫిషియల్ అంటూ ప్రచారం చేసుకోవటం వేలంవెర్రిగా మారిందని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

Also Read:-PhonePe, GPay లకు దడపుట్టిస్తున్న Flipkart సూపర్ మనీ యాప్..

AI ఉద్యోగాలను సృష్టిస్తుందా.. ఉద్యోగాలను తొలగిస్తుందా అనే అంశంపైనా తన అభిప్రాయం వ్యక్తం చేశారాయన. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ప్రతిసారీ కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని.. కొన్ని ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని.. ఇది సర్వసాధారణం అన్నారాయన. 

వైద్య రంగంలో, రవాణా రంగంలో సంస్కరణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐని ఉపయోగించటం వల్ల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చని వివరించారాయన. ఏఐపై ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు టెక్ నిపుణులు కొత్త చర్చకు దారి తీశాయి.