బిజినెస్ డెస్క్, వెలుగు: ఇప్పుడున్న స్టార్టప్‌లు బతకడానికే కష్టపడుతుంటే 40 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చిన టెక్ స్టార్టప్ ఒకటి దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదగగలిగింది. కేవలం రూ.10 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఏడుగురు టెకీలు ఏర్పాటు చేసిన ఈ కంపెనీ, ప్రస్తుతం రూ.6.65 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ టెక్ కంపెనీనే ఇన్ఫోసిస్. ఈ ఏడాది జులైతో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్ఫోసిస్ మంగళవారం, బుధవారం (డిసెంబర్ 13,14) నాడు మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో తన కీలకమైన టెక్నాలజీలను ప్రదర్శనకు ఉంచింది. ఇందులో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీస్‌లను అందించే క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ‘కోబాల్ట్’ కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్లాట్‌పామ్ ‘సైబర్ నెక్స్ట్’, డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘టెన్నిస్’, ఎంటర్‌ప్రైజ్‌ల కోసం తీసుకొచ్చిన డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘లీప్’ను ప్రదర్శనకు ఉంచింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న కోర్ టెక్నాలజీలపై ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని, సీఈఓ సలీల్ పరేఖ్‌లు మాట్లాడారు.
రికార్డ్‌లను క్రియేట్ చేస్తూ...
పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో పనిచేసిన ఎన్ ఆర్ నారాయణ మూర్తి, నందన్ నిలేకని, ఎన్‌ఎస్ రాఘవన్, ఎస్ గోపాలక్రిష్ణన్, ఎస్‌డీ షిబులాల్, కే దినేష్, అశోక్ అరోరాలు 1981 జులై 2 న రూ. 10 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ అనే స్టార్టప్ కంపెనీని నెలకొల్పారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ కూడా నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి నుంచి అప్పుగా తీసుకున్నదే. ఫండ్స్ తక్కువగా ఉన్నా, దేశంలో అవకాశాలు పెద్దగా లేకపోయినా ఇన్ఫోసిస్ విజయం సాధించగలిగింది. ఈ ఫౌండర్లు పనిచేసిన కంపెనీ పాట్ని కంప్యూటర్‌ను ఐగేట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీని 2011 లో క్యాప్‌జెమిని దక్కించుకుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇన్ఫోసిస్ రెవెన్యూ 16.3 బిలియన్ డాలర్ల (రూ.1.33 లక్షల కోట్ల) కు చేరుకుంది. 3,14,000 మంది ఉద్యోగులు ఈ కంపెనీ కింద పనిచేస్తున్నారు. తన జర్నీలో చాలా మైలు రాళ్లను ఇన్ఫోసిస్ అందుకుంది. 1999 లో యూఎస్ నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఈ కంపెనీ, ఈ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయిన మొదటి ఇండియన్ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కిందటేడాది జులైలో 100 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్ మార్క్‌ను క్రాస్ చేసి, ఈ ఫీట్‌ను అందుకున్న రెండో టెక్నాలజీ కంపెనీగా నిలిచింది. మొదటి ప్లేస్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది.
నిలేకని, సలీల్ పరేఖ్‌తో మరింత ముందుకు
ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ చరిత్రలో 2014 లో అతిపెద్ద మార్పు జరిగింది. అప్పటివరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేసిన నారాయణ మూర్తి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మొదటి సారిగా ఒక బయట వ్యక్తికి కంపెనీ సీఈఓ పదవిని అప్పజెప్పారు. ఆయనే విశాల్ సిక్కా. ఈయనకు శాలరీ ఎక్కువ ఆఫర్ చేశారని అప్పటిలో నారాయణ మూర్తి ఆరోపించారు కూడా. మూడేళ్ల పాటు సీఈఓగా పనిచేసిన సిక్కా ప్లేస్‌లోకి ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ వచ్చారు. ఈ టైమ్‌లోనే నందన్ నిలేకని తిరిగి కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అడుగు పెట్టారు. వీరిద్దరూ ఇన్ఫోసిస్‌ను తిరిగి గాడిలో పెట్టారు. వీరు ఇతర కంపెనీలను కొనుగోలు చేయడంపై ఎక్కువగానే ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ మొత్తం 21 కంపెనీలను తనలో కలుపుకోగా, ఇందులో 11 కంపెనీలను గత ఐదేళ్లలోనే కొనుగోలు చేసింది.
నలభై ఏళ్లు ఇలా..
1. ఇన్ఫోసిస్‌ను నారాయణ మూర్తి, మరో ఆరుగురు కలిసి 1981 జులై 2 న పూణెలో నెలకొల్పారు.
2. యూఎస్‌లో తమ మొదటి గ్లోబల్ ఆఫీస్‌ను 1987 లో కంపెనీ ఏర్పాటు చేసింది.
3. 1993 లో బీఎస్‌ఈలో లిస్టింగ్ అయ్యింది.
4. తమ మొదటి యురోపియన్ ఆఫీస్‌ను యూకేలో 1995 లో ఏర్పాటు చేసింది.
5. 1999 లో నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఈ కంపెనీ, అదే సంవత్సరం 100 మిలియన్ డాలర్ల రెవెన్యూ మార్క్‌ను టచ్ చేసింది.
6. 2002 లో 500 మిలియన్ డాలర్ల యాన్యువల్ రెవెన్యూ సంపాదించింది. 2004 లో బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించింది.
7. 2006 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 50 వేల మార్క్‌ను క్రాస్ చేసింది.
8.2007 లో మొదటిసారిగా క్వార్టర్లీ పరంగా బిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించింది.
9. 2009 లో కంపెనీ ఉద్యోగులు లక్ష మందిని దాటారు.
10. మొదటిసారిగా బయట వ్యక్తి అయిన విశాల్ సిక్కాను 2014 లో సీఈఓగా కంపెనీ నియమించింది.
11. 2017 లో సిక్కా ప్లేస్‌లో ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ బాధ్యతలు అందుకున్నారు. ఇదే సంవత్సరం నందన్ నిలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తిరిగొచ్చారు.