- 2024–25 లో 3.75–4.50 శాతం గ్రోత్ నమోదవుతుందని వెల్లడి
- క్యూ2 లో కంపెనీ నికర లాభం రూ.6.506 కోట్లు
న్యూఢిల్లీ : ఇండియాలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ అంచనాలను పెంచింది. గతంలో వేసిన రెవెన్యూ గ్రోత్ రేట్ అంచనా 3–4 శాతాన్ని 3.75–4.5 శాతానికి పెంచింది. క్లయింట్లు చేసే ఐటీ ఖర్చులు పెరుగుతాయని దీనర్ధం. ఇన్ఫోసిస్ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ ( క్యూ2) లో రూ. 6,506 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 4.7 శాతం వృద్ధి నమోదు చేసింది. కంపెనీ రెవెన్యూ 5.1 శాతం పెరిగి రూ.40,986 కోట్లకు ఎగిసింది.
ఈ ఏడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 4.2 శాతం ఎక్కువ. ఇన్ఫోసిస్ రెవెన్యూ నెంబర్లు బ్లూమ్‌బర్గ్ వేసిన రూ.40,820 కోట్ల అంచనాను అధిగమించగా, ప్రాఫిట్ మాత్రం ఎనలిస్టుల అంచనా రూ.6,831.4 కోట్లకు దిగువన నమోదయ్యింది. ‘నిలకడైన కరెన్సీ వద్ద కంపెనీ రెవెన్యూ క్వార్టర్ ప్రాతిపదికన క్యూ2 లో 3.1 శాతం వృద్ధి చెందింది. కోబాల్ట్ క్లౌడ్, టోపజ్‌తో జనరేటివ్ ఏఐ సెగ్మెంట్లలో తమకున్న బలం వలన మంచి రిజల్ట్స్ నమోదు చేయగలిగాం. క్లయింట్లు మాతో పనిచేయడానికి ముందుకొస్తున్నారు’ అని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు.
క్యూ2 లో 2.4 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ సాధించామని అన్నారు. కానీ కంపెనీ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ (టీసీవీ) ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 4.1 బిలియన్ డాలర్లు ఉంటే, సెప్టెంబర్ క్వార్టర్‌లో 2.4 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. మార్జిన్స్ మెరుగుపరుచుకుంటూనే రెవెన్యూ పెంచుకోవడంపై ఫోకస్ పెడతామని ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ జయేష్ సంఘ్రజ్కా అన్నారు. కంపెనీ బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను షేరుపై రూ.21 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇన్ఫోసిస్ షేర్లు గురువారం సెషన్‌లో 2.84 శాతం పెరిగి రూ.1,975 వద్ద సెటిలయ్యాయి.
విప్రో లాభం రూ. 3,208 కోట్లు
1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు
ఐటీ కంపెనీ విప్రో నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్‌లో 21.2 శాతం పెరిగి రూ. 3,208.8 కోట్లకు చేరుకుంది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.2,646.3 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రెవెన్యూ రూ. 22,515.9 కోట్ల నుంచి రూ. 22,301.6 కోట్లకు తగ్గింది. విప్రో సీఈఓ ఎండీ శ్రీని పల్లియా మాట్లాడుతూ తమ పెద్ద డీల్ బుకింగ్‌లు మరోసారి బిలియన్ డాలర్ల విలువను అధిగమించాయని చెప్పారు. కంపెనీ బోర్డు 1:1 రేషియోలో బోనస్ షేర్లను ఇష్యూ చేయడానికి ఆమోదం తెలిపింది. విప్రో షేర్లు గురువారం బీఎస్‌ఈలో 0.65 శాతం నష్టపోయి రూ. 528.80 వద్ద స్థిరపడ్డాయి.