తెలంగాణ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇది.. దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నది ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. తెలంగాణలోని పోచారంలో కొత్త ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయటంతోపాటు.. ఆ క్యాంపస్ లో 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఒప్పందం చేసుకున్నారు ఐటీ మంత్రి శ్రీథర్ బాబు. ఈ మేరకు దావోస్ లో ఇన్ఫోసిస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది తెలంగాణ ప్రభుత్వం.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్‌రాజ్ భేటీ తర్వాత ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని పోచారంలో ఏర్పాటు చేయనున్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17 వేల ఉద్యోగాలు రానున్నాయి. 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫేజ్ 1లో కొత్త ఐటి భవనాల నిర్మాణం చేయనున్నారు. ఈ భవనాన్ని రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి 10 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిభను పెంపొందించడం, అవకాశాలను సృష్టించడానికి , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి నిరంతరం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇన్ఫోసిస్ విస్తరణ తెలంగాణ ఐటీ అభివృద్ధికి గణనీయంగా దోహదపడనుంది. దేశంలోనే ప్రముఖ IT గమ్యస్థానంగా తెలంగాణ స్థితిని మరింత మెరుగుపరుస్తుంది. సాంకేతిక రంగంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడంలో తెలంగాణ మాకు సహకరిస్తుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ ఓ జయేష్ సంఘ్ రాజ్ అన్నారు.
విప్రో ఒప్పందంతో 5 వేల ఉద్యోగాలు
మరో వైపు హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తో సమావేశమయ్యారు. తర్వాత కీలక ప్రకటన విడుదల చేశారు.