దేశంలో అపూర్వమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి వేదికను నిర్దేశిస్తుంది. స్వర్ణ యుగం ఆశయ సాధనలో భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి విస్మయాన్ని కలిగిస్తున్నది. బయట అడుగు పెడితే, పరిసరాల్లో గణనీయంగా వచ్చిన మార్పును మనం గ్రహించవచ్చు. బుల్‌డోజర్‌ల గర్జన, లోహపు గణగణ ధ్వనులు, జాక్‌హామర్‌ల శబ్దం, చుట్టూ జరుగుతున్న నిర్మాణం, పురోగతి సుమధుర సంగీతాన్ని ధ్వనింపజేస్తుంది. ఇప్పుడు, భారతీయ నేల అత్యాధునిక హైవేలు, హై-స్పీడ్ రైళ్లు, అధునాతన విమానాశ్రయాలతో అలరారుతున్నది. ఇంత భారీ స్థాయిలో వేగంగా అపూర్వమైన మౌలిక సదుపాయాల వృద్ధి భారతదేశం స్వర్ణ యుగానికి పునాది వేస్తున్నది. రైలు, రోడ్డు, వాయు మార్గాల ప్రయాణ సామర్థ్యంలో భారతదేశం పరివర్తనను చూస్తున్నది. తద్వారా, వేగవంతమైన ఆర్థిక వృద్ధి మార్గంలో ఉన్న అతిపెద్ద అడ్డంకిని అధిగమించి, ఒకదానితో ఒకటి అనుసంధానం పెరిగింది. వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇవాళ 3.5 ట్రిలియన్ల డాలర్లుగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2025-–26 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు మారాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో మౌలిక వసతులు ఎంతో సహాయపడతాయి. ఆ దిశగా, భారతదేశం ఈ ఏడాది తన జీడీపీలో 1.7 శాతంను రవాణా వ్యవస్థాపన కోసం ఖర్చు చేస్తున్నది. ఇది అమెరికా, చాలా ఐరోపా దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే కూడా ఎక్కువ. 2014-–15 లో కేంద్ర-ప్రభుత్వ రోడ్డు, రైలు రవాణా మూలధన వ్యయం కేటాయింపులు 2.75 శాతం నుంచి ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దాదాపు11 శాతం పెరగనున్నాయి. ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖల తర్వాత రవాణా శాఖ మూడో అతిపెద్ద బడ్జెట్ శాఖగా ఉంది. భారత జీడీపీలో14 శాతంగా ఉండే రవాణా ఖర్చును 2030 నాటికి 8 శాతానికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మౌలిక సదుపాయాలపై వ్యయం పెంచడంతో పాటు కేంద్రం బ్యూరోక్రాటిక్ సంస్కరణలు చేపట్టింది. రోడ్ల మంత్రిత్వ శాఖ మొదటి సమీక్షలో, ట్రెజరీ నుంచి ఆమోదం పొందకుండానే ఒక సివిల్ సర్వెంట్ మొత్తం రెండింతలు ఎక్కువ ఖర్చు చేయగల వెసులుబాటు ఇచ్చింది.
రైలు రవాణా వ్యవస్థలో మార్పులు
దేశంలో వృద్ధి, నిర్మాణ వేగం కొన్ని నూతన అభివృద్ధి నమూనాలను ఆవిష్కరించింది.160 కేఎంపీహెచ్ మెరుపు వేగంతో పరుగెత్తే మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన నిర్మించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 2019లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత, నాలుగేళ్ల కంటే తక్కువ వ్యవధిలో మరో ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మొదలయ్యాయి. వేగవంతమైన కొత్త రైళ్లను దేశీయ అవసరాలకు వాడటంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనే ఆశయంతో వచ్చే మూడేండ్లలో మరో 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇదే కాలంలో అమెరికాకు చెందిన అసెలా సర్వీస్ కంటే అత్యధిక వేగంతో కూడిన నిజమైన హై-స్పీడ్ లైన్ జపాన్ సాయంతో పశ్చిమ రాష్ట్రాల్లోని ఆర్థిక నగరాలైన ముంబయి– అహ్మదాబాద్ మధ్య నిర్మించబోతున్నది. ఇది రెండు ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు నుంచి రెండు గంటలకు తగ్గిస్తుంది. ముంబయి– ఢిల్లీ మధ్య, పంజాబ్– పశ్చిమ బెంగాల్ మధ్య, రెండు కొత్త ‘సరుకు రవాణా కారిడార్ల’ నిర్మాణం సగం పూర్తి అయింది. వచ్చే ఏడాది నాటికి పూర్తి అయ్యే చాన్స్ఉంది. మరో నాలుగింటి నిర్మాణానికి ప్రణాళికలు ఉన్నాయి. కొత్త కారిడార్లు 2030 నాటికి రైల్వే సరుకు రవాణాను 27 శాతం నుంచి 45 శాతానికి పెంచుతాయి. మొత్తం సరకు రవాణా పరిమాణంలో రైల్వేల వాటా గతంతో పోలిస్తే బాగా పెరిగింది. పాలు, మాంసం, చేపలు సహా పాడైపోయే పదార్థాల రవాణా కోసం 2020లో కొత్త ‘కిసాన్ రైలు’ ప్రారంభమైంది. ఈ పరిణామాలన్నీ దేశ గ్రీన్‌హౌస్- వాయు ఉద్గారాలను, అలాగే దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
విద్యుత్సామర్థ్యం, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
భారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 22 శాతం పెరిగింది. పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఐదేండ్లలో 2022 నాటికి దాదాపు రెండింతలు పెరిగింది. వ్యవస్థాపక సామర్థ్యంలో దేశ పునరుత్పాదక శక్తి సామర్థ్యం ప్రపంచంలోనే 4వ అతిపెద్దది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లు 2014లో 61 మిలియన్లు ఉండగా, గతేడాది 816 మిలియన్లకు పెరిగాయి. 2016లో ప్రారంభమైన మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ డిజిటల్ లావాదేవీల్లో విప్లవం సృష్టించింది. 2021లో, ప్రభుత్వం 16 మంత్రిత్వ శాఖల్లో ప్రతిష్టాత్మకమైన డేటా-షేరింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వృథాను తగ్గించడం, డజన్ల కొద్దీ డేటా లేయర్‌లతో అధిక-నాణ్యతతో డిజిటల్ మ్యాప్‌లను రూపొందించడం ద్వారా సమూల మార్పులొచ్చాయి. పోర్ట్‌లు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వేలతో పారిశ్రామిక వాడలను అనుసంధానించడం ద్వారా రవాణా నెట్‌వర్క్ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. స్వర్ణ చతుర్భుజి వంటి వాటిపై చేసిన అధ్యయనాలు రహదారి నెట్‌వర్క్ ఆర్థిక కార్యకలాపాలను పెంచాయని, రవాణా ఖర్చులను తగ్గించాయని, వాణిజ్యం నుంచి లాభాలను పెంచాయని, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కార్మికులకు వేతనాలను పెంచాయని సూచిస్తున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్మికులను వ్యవసాయం నుంచి మరింత ఉత్పాదక ఉపాధి ఉద్యోగాల వైపు తరలించడంలో సహాయపడింది. భారతదేశాన్ని నాణ్యమైన మెరుగైన రవాణా డిజిటల్ విద్యుత్‌శక్తి నెట్‌వర్క్ తో అనుసంధానించడం ద్వారా, దేశీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయడం, బయటి ప్రపంచానికి కనెక్టివిటీని పెంచడం, వృద్ధిని వ్యాప్తి చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హైవేలు, ఎయిర్‌పోర్టులు పెరిగాయ్
దేశంలో నేషనల్ హైవేల నిర్మాణం, విస్తరణ వేగంగా పెరుగుతున్నది. సగటున ఏడాదికి10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అందబాటులోకి వస్తున్నాయి. పొడవును అదనంగా కలుపుతోంది. గత ఎనిమిదేండ్లలో దేశంలో 50 వేల కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ జరిగింది. గతంతో పోలిస్తే ఈ పెరుగుదల దాదాపు రెండు రెట్లు ఉంటుంది. గ్రామీణ రహదారి నెట్‌వర్క్ పొడవు 2014లో 3,81,000 కిలోమీటర్లు ఉంటే, 2023లో 7,29,000 కిలోమీటర్లను పెరిగింది. ఇదే కాలంలో భారత విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. పౌర విమానాలు ఉన్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా, ఈ ఏడాది148కి పెరిగింది. 2.26 లక్షల ఉడాన్ విమానాల్లో 1.13 కోట్ల మంది ప్రయాణీకులు జర్నీ చేశారు. ఉడాన్ పథకం కింద 73 కొత్త విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారికి ముందు దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2013లో 60 మిలియన్ల నుంచి 2019లో గరిష్టంగా141మిలియన్లకి పెరిగింది. మొత్తం ప్రయాణీకుల సంఖ్య కరోనా ముందు నాటి గరిష్టాలను త్వరలో రెట్టింపు చేయగలదని, రాబోయే పదేళ్లలో 400 మిలియన్లకు పెరుగుతుందని విమానయాన మంత్రి అంచనా వేస్తున్నారు.
- రీసెర్చ్వింగ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), ఢిల్లీ