
- విద్యా వ్యవస్థ బలోపేతంపై సీఎంకు విద్యా కమిషన్ నివేదిక
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులతో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో శనివారం సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను సీఎంకు చైర్మన్ మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, చారగొండ వెంకటేశ్, జ్యోత్స్న శివారెడ్డి అందించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సీఎం దృష్టికి కమిషన్ తీసుకెళ్లింది. దీంతో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర విధానాలను రూపొందించాలని కమిషన్కు సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల సమస్యలను ప్రస్తావించగా.. అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.