పసికందు నడుముకు బండకట్టి రిజర్వాయర్​లో  పడేసిన్రు

  • మూడు రోజుల పసికందు మృతి
  • జనగామ జిల్లాలో  అమానవీయ ఘటన 

స్టేషన్​ ఘన్​పూర్, వెలుగు: తల్లి ఒడిలో సేదదీరాల్సిన 3 రోజుల పసికందు నడుముకు బండరాయి కట్టి నీటిలో పడేసి చంపేశారు. ఈ అమానవీయ ఘటన జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..స్టేషన్​ఘన్​పూర్ ​శివారు తాటికొండ రోడ్డులోని దేవాదుల రిజర్వాయర్​లో బుధవారం ఓ పసికందు డెడ్​బాడి తేలియాడుతుండడంతో అటువైపు వెళ్లిన స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆదేశాల మేరకు ఎస్సై శ్రావణ్​కుమార్ తన సిబ్బందితో రిజర్వాయర్​ దగ్గరకు చేరుకున్నారు.

 కొందరు ఈతగాళ్లను పిలిపించి వారి సాయంతో నీళ్లలో తేలుతున్న పసికందు మృతదేహాన్ని రిజర్వాయర్ ​నుంచి బయటికి తీయించారు. అయితే, డెడ్​బాడీ నడుముకు  తాడు కట్టి ఉండడం..దానికి బండరాయి ఉండడంతో  షాక్​ తిన్నారు.  విషయం బయటకు రావొద్దని బతికి ఉన్నప్పుడే బండ కట్టి పడేసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎస్​ఐ మాట్లాడుతూ పసికందు మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం వరంగల్​ ఎంజీఎం దవాఖానకు తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాఘవేందర్​  తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు.