నిజామాబాద్ జిల్లాలో అమానుషం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !

నిజామాబాద్ జిల్లాలో అమానుషం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !

మనిషి ఏఐ యుగంలోకి అడుగు పెట్టినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం, మతం అంటూ కట్టుబాట్లతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. కుల సంఘాలు పెట్టిన కట్టుబాట్లను అతిక్రమిస్తే సంఘ బహిష్కరణ, గ్రామ బహిష్కరణ అంటూ అమాయకులను ఒంటరి చేసి పైశాచికానందం పొందుతున్నారు ఆ సంఘాల పెద్దలు. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 

మూడేళ్ల క్రితం వృద్ధ దంపతులను సంఘ బహిష్కరణ చేశారు. వారితో ఎవరూ మాట్లాడవద్దని, వారికెవరైనా సహాయం చేస్తే వారికీ అదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. చివరికి కన్న కొడుకులకు కూడా మాట్లాడే హక్కు లేకుండా చేశారు. చివరికి ఆ తండ్రి వయసు మళ్లి, అనారోగ్యంతో మరణిస్తే అంత్య క్రియలకు వెళ్లకుండా ఫర్మానా జారీ చేయడం మానవత్వానికి మచ్చ తెచ్చిన ఘటనగా మిగిలిపోయింది. 

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకడలో లింగన్న అనే దంపతులను సంఘ బహిష్కరణ చేశారు యాదవ సంఘం సభ్యులు. తాజాగా లింగన్న చనిపోవడంతో అంత్య క్రియలకు వెళ్లకుండా కొడుకును కూడా బహిష్కరించారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 

Also Read :- ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే లవర్కు వీడియో కాల్

లింగన్న దంపతులు గత మూడేళ్లుగా సంఘ బహిష్కరణలో ఉన్నారు. కారణం.. లింగన్నకు ఇద్దరు కొడుకులు. ఆస్తుల పంపంలో సంఘ పెద్దలు చేసిన పంపకాలు న్యాయంగా లేవని లింగన్న వ్యతిరేకించాడు. సంఘం ఇచ్చిన తీర్పునే వ్యతిరేకిస్తావా.. అని లింగన్నను బహిష్కరించారు. 

గత మూడేళ్లుగా సంఘ బహిష్కరణలో ఉన్న లింగన్న గ్రామంలో ఒంటరిననే దిగ్ర్భాంతితో ఆవేదనతో అనారోగ్యానికి గురై ఇటీవలే మృతి చెందాడు. అయితే లింగన్న అంత్యక్రియలకు హాజరు కాకూడదని చిన్న కొడుకును హెచ్చరించారు సంఘం సభ్యులు. సంఘం నిబంధనలను ఒప్పుకుని, చెప్పిన జరిమానా కట్టినందుకు పెద్ద కొడుకుకు అంత్య క్రియలు చేసేందుకు అనుమతించారు. అయితే చిన్న కొడుకు వెళ్లడంతో సంఘం తీర్పును వ్యతిరేకించాడని అతడిని కూడా సంఘ బహిష్కరణ చేశారు. 

దీంతో బాధితుడు తన తల్లి, భార్యతో కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. గత మూడు రోజులుగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సంఘం నియమాలు తప్పినందుకు జరిమానా కింద 8 వేల రూపాయలు వసూలు చేశారని పోలీసులకు తెలిపాడు. ‘‘సంఘం నియమాలకు అనుగుణంగా మీ అన్న జరిమానా చెల్లించాడు. చెప్పినట్లు వింటున్నాడు.. అంత్య క్రియలు చేసేందుకు మీ అన్నకు హక్కు ఉంది నీకు లేదు’’ అని బెదిరించారని చెప్పాడు. 

 గతంలో కూడా జరిమాన పేరిట దాదాపు 50 వేల రూపాయలు వసూలు చేశారని తెలిపాడు. జరిమానా పేరిట వచ్చిన డబ్బులతో విందులు చేసుకుంటూ పెద్దరికం పేరిట అరాచకం సృష్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.