- రాష్ర్టంలో ఏకైక బీటెక్ డెయిరీ కాలేజీ
- ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి ఎదురు చూపులు
- పీజీ కోర్సులు ప్రవేశపెట్టడానికి అనుకూలం
- ప్రభుత్వం దృష్టిసారించాలన్న స్థానికులు
రాష్ర్టంలో ఉన్న ఏకైక డెయిరీ టెక్నాలజీ కాలేజీ సమస్యలతో సతమతమవుతోంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు, పీజీ కోర్సులు ప్రవేశపెడితే కాలేజీ మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపితే కాలేజీకి మరింత గుర్తింపు దక్కుతుంది.
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి డిగ్రీ కాలేజీలో మొదట బీఎస్సీ డెయిరీ కోర్సుగా ప్రారంభమై విద్యార్థుల ఆందోళన, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో ఉమ్మడి రాష్ర్టంలో బీటెక్ డెయిరీ టెక్నాలజీ కాలేజీగా ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పశువైద్య వెటర్నరీ కాలేజీ పరిధిలో కామారెడ్డి, తిరుపతిలో బీటెక్ డెయిరీ కాలేజీలు ఉండేవి. రాష్ర్ట విభజన తర్వాత కామారెడ్డి లోని డెయిరీ కాలేజీని పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో చేర్చారు. ఇంజినీరింగ్ లో మిగతా కోర్సులకు సమానంగా బీటెక్ డెయిరీ నాలుగేళ్ల కోర్సుగా కొనసాగుతోంది.
ఇందులో 40 సీట్లు ఉన్నాయి. 35 సీట్లు ఎంసెట్ కౌన్సిలింగ్ద్వారా, 5 సీట్లు ఐసీఆర్కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎంసెట్ కోటాలో రైతుల పిల్లలకు రిజర్వేషన్ ఉంది. గతంలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయినప్పటికీ ప్రస్తుతం 25 నుంచి 30 సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. బీటెక్ డెయిరీ చదివిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలలో ఉద్యోగాలు వస్తాయి. సొంతంగా డెయిరీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ చదివిన వారు దేశంలోని పలు డెయిరీల్లో వివిధ హోదాల్లో పని చేస్తుండగా, కొందరు సొంతంగా డెయిరీలు ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.
పీజీ కోర్సులు ప్రవేశపెడితే మరింత అభివృద్ధి
ప్రస్తుతం బీటెక్ డెయిరీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు పీజీ చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. కాలేజీలో మరిన్ని మౌలిక వసతులు కల్పించి, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించి పీజీ కోర్సులు ప్రవేశపెడితే కాలేజీతో పాటు విద్య పరంగా కామారెడ్డి అభివృద్ధి చెందుతుంది. డెయిరీతో పాటు, ఫుడ్ టెక్నాలజీ వంటి పీజీ కోర్సులు ప్రవేశ పెట్టొచ్చు. కాలేజీకి ఉన్న 50 ఎకరాల్లో కాలేజీ బిల్డింగ్, బాయిస్, గర్ల్స్ హాస్టల్స్ఉన్నాయి. రైతులకు పశు పోషణ, పాడి పరిశ్రమ అభివృద్ధికి శిక్షణ ఇవ్వొచ్చు.
ఐసీఎఆర్ గుర్తింపు కోసం
ప్రతీ ఐదేళ్లకోసారి ఐసీఎఆర్ గుర్తింపు పక్రియ నిర్వహిస్తోంది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలను ఐసీఎఆర్ టీమ్ పరిశీలించి గుర్తింపు ఇస్తుంది. ఈ గుర్తింపు ఉంటే విద్యార్థులు ఎక్కడైనా ఉన్నత చదువులు చదువుకోవచ్చు. 2019లో ఈ టీమ్ వచ్చింది. మళ్లీ ఈ ఏడాది వచ్చే అవకాశం
ఉంది.
ప్రొఫెసర్లు వస్తే మరింత మెరుగైన విద్య
కాలేజీలో 35 మంది టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ప్రస్తుతం పది మంది ఉన్నారు. ముగ్గురు రెగ్యులర్, మిగలినవారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, ఇతర రంగాల్లో రాణించేందుకు మరింత మెరుగైన బోధన కోసం పూర్తి స్థాయి టీచింగ్ స్టాఫ్ అవసరం. డిగ్రీ కాలేజీలో బీఎస్సీ డైయిరీ కోర్సు బోధించినవారే బీటెక్ డెయిరీగా మారినా వారే బోధిస్తున్నారు.
కాలేజీగా ఏర్పడినా పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ కాలేదు. నాన్ టీచింగ్‌లో ముగ్గురు మాత్రమే రెగ్యులర్, 12 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కాలేజీతో పాటు, డెయిరీ ఫామ్, హాస్టల్ కు రెగ్యులర్ స్టాఫ్కావాలి. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ పక్రియ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ఇవ్వటంతో పాటు, మంత్రి మండలి ఆమోదిస్తే పోస్టులు భర్తీ పక్రియ ముందుకెళ్తుంది.