స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : మాదిగల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలంటూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బాబుజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద బుధవారం ఎమ్మార్పీఎస్ నాయకులు దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే రాజయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడ్తామన్న హామీని మర్చిపోయిన బీజేపీ మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.
18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా మాదిగలకు ఇంకా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చాడ ఏలియా, నాయకులు గాదె శ్రీకాంత్, నలిమెల నాగరాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సింగపురం దయాకర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, నాయకులు మారెపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.