కరీంనగర్, వెలుగు: తమ జాబ్‌లు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు ఎండ, వానను సైతం లెక్క చేయకుండా కలెక్టర్ ఎదుట దీక్ష కొనసాగిస్తున్నారు. నాలుగేండ్లు దాటినా సర్వీస్ ను రెగ్యులరైజ్ చేయకపోవడం, ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను జేపీఎస్ లుగా గుర్తించకపోవడంతో వారు ఏప్రిల్ 28 నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1 నుంచి అన్ని కలెక్టరేట్ల ఎదుట దీక్షలకు కూర్చున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలు టెంట్ వేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వగా.. కరీంనగర్ లో మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. మొదటి రోజే టెంట్ వేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
పలుమార్లు ఏసీపీని, సీపీని కలిసినా ఫలితంగా లేకుండా పోయింది. దీంతో విధిలేక కలెక్టరేట్ ప్రహరీ వెంట సుమారు 200 మంది సెక్రటరీలు రోజూ మండుటెండలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉపశమనం కోసం కొందరు గొడుగులు పెట్టుకుంటున్నప్పటికీ ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్నారు. గురువారం వారి దీక్షను గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వారితో కొద్ది సేపు కూర్చుని సంఘీభావం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కొద్ది సేపు వర్షం కురవగా.. వర్షంలోనూ జేపీఎస్‌లు దీక్ష కొనసాగించారు. ఎండలో, వానలో సెక్రటరీలు చేస్తున్న దీక్షను చూసి అటుగా వెళ్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. పోలీస్ ఆఫీసర్లు మాత్రం కనీసం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి..