నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: మూతికి ప్లాస్టర్ వేసుకుని.. బ్యాటింగ్ చేసిన ఇంద్రజిత్

నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: మూతికి ప్లాస్టర్ వేసుకుని.. బ్యాటింగ్ చేసిన ఇంద్రజిత్

కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడానికి గాయంలోనూ బ్యాటింగ్ చేసిన ఆటగాళ్ళు ఇప్పటివరకు చాలా మందిని మనం చూసే ఉంటాం. శరీరంలో ఏ భాగానికి గాయమైనా తట్టుకొని ఆడినవారిని చూసాం గాని.. మూతికి తీవ్ర గాయమైనా పట్టుదలగా బ్యాటింగ్ చేసిన ఆటగాడిని నిన్నే(డిసెంబర్ 13) చూసాం. తమిళనాడు బ్యాటర్ బాబా ఇంద్రజిత్ మూతికి ప్లాస్టర్ వేసుకుని బ్యాటింగ్ చేసి తమ జట్టు కోసం పోరాడిన విధానం అద్బుతమనే చెప్పాలి. 
 
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం(డిసెంబర్ 13) నిన్న హర్యానా, తమిళనాడు జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 294 పరుగుల ఛేదనలో తమిళనాడు 14 ఓవర్లలో 53 పరుగుల వద్ద మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన బాబా ఇంద్రజిత్ మూతికి ప్లాస్టర్ వేసుకొని బ్యాటింగ్ కు వచ్చాడు. ఇన్నింగ్స్ విరామ సమయంలో బాత్రూమ్ లో కాలు జారిపడిన ఈ యువ ఆటగాడికి మూతి కింద తీవ్ర గాయమైంది. దీంతో గాయంతోనే చాలాసేపు బ్యాటింగ్ చేసి జట్టు విజయం కోసం పోరాడాడు. 

ఈ మ్యాచ్ లో 71 బంతుల్లో ఐదు ఫోర్లతో 64 పరుగులు చేసినప్పటికీ ఇంద్రజిత్ తన జట్టును ఫైనల్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. పలు మార్లు చికిత్స తీసుకొని బ్యాటింగ్ కొనసాగించిన ఈ తమిళనాడు స్టార్ బ్యాటర్ కు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. ముంబైపై క్వార్టర్స్ ఫైనల్స్ లో ఇంద్రజిత్ అజేయంగా 103 పరుగులు చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. 

ఈ సెమీ ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. హర్షిత్ రానా 116 పరుగులు చేస్తే.. ఓపెనర్ యువరాజ్ సింగ్ 65 పరుగులు చేసి రాణించాడు. లక్ష్య ఛేదనలో తమిళనాడు 230 పరుగులకు ఆలౌటైంది. 64 పరుగులు చేసిన బాబా ఇంద్రజిత్ టాప్ స్కోరర్. హర్యానా బౌలర్ కాంబూజ్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.