ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌కు బుమ్రా దూరం!

ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌కు బుమ్రా దూరం!

సిడ్నీ:  టీమిండియా స్టార్ పేసర్ జస్‌‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌‌తో సొంతగడ్డపై జరిగే టీ20, వన్డే సిరీస్‌‌లకు దూరంగా ఉండనున్నాడు. వచ్చే నెలలో  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌లకు అతనికి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.  ఇండియా ఈ నెల 22 నుంచి ఇంగ్లిష్ టీమ్‌‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌‌ల్లో పోటీ పడనుంది.  ఆస్ట్రేలియాతో చివరి టెస్టు సందర్భంగా వెన్నుగాయానికి గురైన బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. 

బుమ్రా గాయం తీవ్రత ఎంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ గ్రేడ్‌‌–1 కేటగిరీ గాయం అయితే తిరిగి మ్యాచ్‌‌లో బరిలోకి దిగేందుకు రెండు నుంచి మూడు వారాలు అవసరం అవుతుంది. కాగా,  ఐదు టెస్టుల సిరీస్‌‌లో పని భారం కారణంగానే అతనికి వెన్నునొప్పి ఏర్పడిందని తెలుస్తోంది. చాంపియన్స్‌‌ ట్రోఫీలో అతని సేవలు కీలకం కానున్నాయి. దాంతో ఇంగ్లండ్‌‌తో టీ20 సిరీస్‌‌లో ఆడించకూదని బోర్డు వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ ముంగిట టచ్‌‌లోకి వచ్చేందుకు చివరి వన్డేలో బరిలోకి దింపొచ్చు.