- ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమయ్యే చాన్స్
- జడేజా, రాహుల్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం సెలెక్టర్ల వెయిటింగ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గ్రౌండ్ లోపల, బయట ఇండియాకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల గాయాలు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో గెలిచి లెక్క సరి చేసిన టీమిండియా మరో కీలక ఆటగాడి సేవలు కోల్పోనుంది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను, గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.
దాంతో చివరి మూడు టెస్టులకు అతను జట్టుకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయ్యర్ తరచూ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది సర్జరీ చేయించుకున్నాడు. విశాఖలో రెండో టెస్టు ముగిసిన తర్వాత గాయం తిరగబెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అయ్యర్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడు. దాంతో చివరి మూడు మ్యాచ్‌లకు అతను బరిలోకి దిగడం కష్టమేనని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 29 ఏండ్ల అయ్యర్ తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాడు.
నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను 35, 13, 27, 29 స్కోర్లు మాత్రమే చేశాడు. శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు నుంచి అతడిని తప్పించాలన్న విమర్శలు మొదలయ్యాయి. అయితే, స్పిన్‌ను బాగా ఆడే సామర్థ్వం, మిడిల్, లోయర్ ఆర్డర్‌లో సీనియర్ ప్లేయర్ కావడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి సపోర్ట్ ఇస్తోంది.
ఈ లెక్కన అయ్యర్ చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ గాయం అతడిని దెబ్బ తీసింది. ఇప్పటికే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో రెండు మ్యాచ్‌ల్లో ఆడలేదు. మిగతా సిరీస్‌కూ అతను అందుబాటులోకి వచ్చే చాన్స్ లేదని తెలుస్తోంది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ రాజ్‌కోట్‌లో ఈ నెల 15న మొదలవనుంది. రెండో మ్యాచ్ తర్వాత తమ ఇండ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్లు మూడో టెస్టు కోసం ఆదివారం రాజ్‌కోట్ చేరుకోనున్నారు.
టీమ్ ఎంపిక ఆలస్యం...
వాస్తవానికి ఆలిండియా సెలెక్షన్ కమిటీ చివరి మూడు టెస్టులకు గురువారమే టీమ్‌ను ఎంపిక చేయాలని భావించింది. కానీ, సెలెక్షన్‌కు హారజయ్యే ఒకరిద్దరు కీలక వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ శుక్రవారం నిర్వహించాలని అనుకుంది. ఈలోపు అయ్యర్ వెన్ను గాయం తిరగబెట్టిన విషయం తెలియడంతో కమిటీ మీటింగ్, టీమ్ ఎంపిక మరింత ఆలస్యం అవుతోంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై స్పష్టత కోసం సెలెక్టర్లు ఎదురు చూస్తున్నారు.
కండరాల గాయాల కారణంగా జడేజా, కేఎల్ రాహుల్ ఇద్దరూ ప్రస్తుతం ఎన్‌సీఏలో కోలుకుంటున్నారు. వీళ్లు తిరిగి టీమ్‌లోకి రావాలంటే ఫిట్‌నెస్ విషయంలో ఎన్‌సీఏ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. కేఎల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినా.. జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఇక, వర్క్‌లోడ్ దృష్ట్యా మూడో టెస్టులో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావించిన టీమ్ మేనేజ్‌మెంట్ ఆ ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. రెండు, మూడో టెస్టుకు మధ్య పది రోజుల గ్యాప్ రావడంతో బుమ్రాను రాజ్‌కోట్‌లోనూ ఆడించాలని నిర్ణయించినట్టు సమాచారం. అవసరం అయితే చివరి రెండు టెస్టుల్లో అతనికి విశ్రాంతి ఇవ్వొచ్చని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.