కొలంబో: ఆసియా కప్‌కు ముందు శ్రీలంక బౌలర్లను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా స్టార్ పేసర్ దిల్షాన్ మధుషనక కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతనికి ఈ గాయమైనట్లు తెలిపింది. అయితే ఫిట్‌నెస్ కోసం అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడని లంక బోర్డు చైర్మన్ అర్జునా డిసిల్వా వెల్లడించాడు.
ఇప్పటికే లాహిరు కుమరా, దుష్మంత చమీరా, వానిందు హసరంగ కూడా గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. జూన్, జులైలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో చమీరా, హసరంగ, మధుషనక కీలక పాత్ర పోషించి లంకకు మెగా ఈవెంట్ బెర్త్‌ను అందించారు. ఈ ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో కుశాన్ రజిత, ప్రమోద్ మధుషాన్, మతీషా పతిరణపై లంక టీమ్ భారీ ఆశలు పెట్టుకుంది. అలాగే ప్రత్యామ్నాయంగా దునిత్ వెల్లలాగే, దుషాన్ హేమంతను కూడా టీమ్‌లోకి తీసుకోవాలని యోచిస్తున్నది.