టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే

టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే

తెలంగాణ సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ రెండు దశాబ్దాల ప్రస్థానంలో తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఆ పార్టీ ఎదుగుదలకు తోడ్పడిన కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు లాంటి వారిని మరణానంతరం విస్మరిస్తూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఉద్యమ ఆకాంక్షలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు. అనేక ఆశలతో, ఆశయాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం పాలయింది. నీళ్లు, నియామకాలు, నిధులు నినాదాలతో రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ మూడింటినీ ఒకే కుటుంబం స్వాహా చేసి, ప్రజలకు మొండిచేయి చూపించింది. రాష్ట్ర అభివృద్ధిని మూలకు నెట్టేసింది. కేసీఆర్ ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తూ.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.


తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కేసీఆర్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో లక్షా ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు 34 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులను వంచిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగి అంటేనే శ్రమ దోపిడీ, రాష్ట్రంలో ఆ పదమే లేకుండా చేస్తానని చెప్పిన కేసీఆర్.. వివిధ శాఖల్లోని 25 వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని చేసిన వాగ్దానం కలగానే మిగిలింది.

ఉద్యోగులను అవమానిస్తున్నరు

స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యోగులను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారు. 30 శాతం ఫిట్‌‌మెంట్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఉద్యోగులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. కేసీఆర్ పీఆర్సీ ప్రకటన ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర నిరాశ మిగిల్చింది. పీఆర్సీ కోసం మూడేండ్లు కాలయాపన చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోయారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వ ఉద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రగతిభవన్​లో పన్నాగాలు పన్ని ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అద్భుతమైన పీఆర్సీ ఇప్పిస్తామని చెప్పి, ఎన్నికల కోడ్​ను సైతం ఉల్లంఘించారు. కనీసం 44 శాతం ఇచ్చినట్లయితే గౌరవ ప్రదంగానైనా ఉండేది. రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ 61 ఏండ్లకు పెంచిన మీరు నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తే బాగుండేది.

అమరుల కుటుంబాలను మోసగించిన్రు

రాష్ట్ర సాధన కోసం 1200 మంది వరకు ప్రాణాలర్పిస్తే.. 450 మంది కుటుంబాలకే సాయాన్ని పరిమితం చేశారు. మిగిలిన అమరుల కుటుంబాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి కొందరికి మాత్రమే ఇచ్చి, మిగిలిన వారిని గాలికొదిలేశారు. 

నిరసన తెలిపే హక్కులేదా?

టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపే హక్కు లేకుండా పోయింది. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతల్ని ఇంట్లో నుంచి లాక్కెళ్లి అరెస్టులు చేస్తున్నారు. రోడ్డెక్కిన కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్​ చేయిస్తున్నారు. ఉద్యమాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణలో ధర్నా చౌక్ ఎత్తేసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుతో సాక్షాత్తు పోలీసులే బారికేడ్లు పెట్టి రాస్తారోకోలు చేయించారు. మంత్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. కానీ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కితే పోలీసులతో దారుణంగా కొట్టిస్తున్నారు.

రైతుల్ని తప్పుదోవ పట్టించిన్రు..

షరతుల సాగు పేరుతో రైతులను తప్పుదోవ పట్టించిన సీఎం కేసీఆర్.. వారిని కనీసం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సీఎం సూచనలతో సన్నాలను వేసిన రైతులు చివరికి వాటిని అర్ధకు పావు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మక్కరైతుల పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ, కమీషన్, గోనె సంచి, తరుగు, తేమ, రవాణా పేరుతో 20 శాతం ఎంఎస్పీలో కోతవిధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యూరియా అవసరాలను అంచనా కట్టడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు పంపకపోవడంతో దేశంలో ఎక్కడా లేని యూరియా కొరత ఒక్క తెలంగాణలోనే తలెత్తింది. ఓ రైతు క్యూ లైన్లలో నిల్చొని మృత్యువాత పడిన దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక రైతు రుణాల మాఫీ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు.

ఆహార భద్రతా కార్డులు అందలే

రాష్ట్రంలో నిరుపేదలు ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కార్డుల కోసం దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఉన్న కార్డుల్లో సభ్యులను చేర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోగా వాటికి సైతం ఆమోదం తెలపడం లేదు. కొత్త రేషన్ కార్డులు, మార్పుల, చేర్పుల వల్ల వచ్చిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్ లో పెట్టి నెలల తరబడి ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే

2016, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కానీ..2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ.. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న హామీపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. నమ్మి ఓట్లు వేసి ఆ పార్టీని గెలిపించారు. కానీ అధికారం చేతిలోకొచ్చేసరికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం హామీని విస్మరించింది. రాష్ట్రంలో 2 లక్షల ఇండ్లు, జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్లు, నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు.. అంటూ ప్రకటనలు గుప్పించి.. శిలాఫలకాలతో హడావుడి చేసి.. ఇప్పుడు మొండిచేయి చూపించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట లాంటి కొన్ని చోట్ల తప్పిస్తే ఎక్కడా ఇండ్లు పూర్తి కాలేదు. సొంతింటిపై పేదల ఆశలను టీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి వమ్ము చేసింది.

మోసపోయిన ముస్లింలు

కేసీఆర్ ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతానని హామీ ఇచ్చి తాను హిందూ వ్యతిరేకినని చాటుకున్నారు. రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని, న్యాయ పరీక్షకు ఈ అంశం నిలబడదని తెలిసి కూడా ఈ హామీ ఇవ్వడం ముస్లింలనూ వంచించడమే.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన్రు

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కేసీఆర్ అప్పులు చేయడం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. విభజన సమయంలో రాష్ట్రం అప్పులు 63వేల కోట్లు ఉంటే ఇప్పుడవి 4 లక్షల కోట్లకు పెరిగింది. మిషన్ భగీరథ, విద్యుత్ రంగం, సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పుల సంగతి ఆ దేవుడికే తెలుసు. ఏడేండ్లలో ఏనాడూ సెక్రటేరియట్​కు వెళ్లని కేసీఆర్.. రాత్రికి రాత్రే సెక్రటేరియట్​ను కూలగొట్టడం దుర్మార్గమైన చర్య. మతిలేని నిర్ణయంతో 500 కోట్ల ప్రజా ధనం వృథా చేశారు. ఇప్పటికే వాస్తు పేరు మీద క్యాంప్ ఆఫీస్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. వాస్తు పేరు చెప్పి ఉన్న బిల్డింగులు కూలగొట్టి కొత్తది కట్టించిన నాయకులు దేశంలో ఎవరూ లేరు.

సామాజిక న్యాయం అందుతలేదు

టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళకు  కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. దళితులను వంచించారు, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లని మైనార్టీలతో కలిపి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేశారు. ఎస్టీలను మోసం చేసి లంబాడీలు, గోండులకు మధ్య పంచాయితీలు పెట్టారు. బీసీలను వంచించారు. ఎంబీసీలన్నారు, వెయ్యి కోట్లన్నారు రూపాయి ఖర్చు పెట్టలేదు. సంచార జాతుల ప్రస్తావనే లేదు. కుల వృత్తులను మొత్తం నాశనం చేశారు. కులాల వారీగా భవనాలు కట్టిస్తామని చెప్పి మోసం చేశారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు లేవు. బీసీ ఫెడరేషన్లకు నిధులన్నారు, బడ్జెట్ లో మొండిచేయి చూపారు. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 34 శాతం ఉంటే 24 శాతానికి కుదించి బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేశారు. టీఆర్ఎస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల పూర్తి వివక్ష చూపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తండ్రి అధ్యక్షుడు, కొడుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఇదీ వారి సామాజిక న్యాయం.

టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, జహీరాబాద్ నుంచి భద్రాచలం దాకా టీఆర్ఎస్​కు వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు నియోజకవర్గాల మధ్యలో ఉన్న దుబ్బాకలో ప్రజలు వాళ్లకు కర్రుకాల్చి వాత పెట్టారు. హైదరాబాద్​ ప్రజలు టీఆర్ఎస్ కు చావుదెబ్బ చూపించారు. ఏ ప్రజాస్వామ్య దేశంలో లేనట్లుగా సెక్రటేరియట్​కు రాకుండానే పాలిస్తానన్న సీఎం కేసీఆర్ అహంకారాన్ని రాష్ట్ర ప్రజలు బద్దలు కొడుతున్నారు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సమస్యల సుడిగుండంలో పడిపోయింది. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్​కే పరిమితమై ప్రజా సమస్యల్ని గాలికొదిలేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరికి రాష్ట్ర మంత్రులకు కూడా ఆయన అపాయింట్ మెంట్ లేదు. తన కోటరీ ఇచ్చే సమాచారం తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయట్లేదు.
                                                              - డాక్టర్​ కె.లక్ష్మణ్,నేషనల్​ ప్రెసిడెంట్, బీజేపీ ఓబీసీ మోర్చా

దళితులను దగా చేసిన్రు

దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తానని.. లేకుంటే తల నరుక్కుంటానని అన్న కేసీఆర్.. ఎన్నికల్లో గెలిచాక తానే సీఎం గద్దెపై కూర్చొని దళితులను దగా చేశారు. తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా సాగిన దళిత ఉద్యమంలో అవసరమొచ్చినప్పుడు అనేక  హామీలిచ్చి, అవసరం తీరాక దళితులను వంచిస్తున్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు 15,000 ఎకరాల భూమిని 5,216 మంది ఎస్సీలకు మాత్రమే పంపిణీ చేశారు. తెలంగాణలో 7 లక్షలకు పైగా ఎస్సీ కుటుంబాలకు భూమి లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​125 అడుగుల విగ్రహానికి 2016లో శంకుస్థాపన చేశాక ఇంత వరకు దిక్కులేదు. ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర 15 అంతస్తుల అంబేద్కర్ భవన్​కు నా సమక్షంలోనే శంకుస్థాపన చేశారు. దీనికి ఇప్పటి వరకు దిక్కులేదు.

విద్యపై నిర్లక్ష్యం

కేసీఆర్ వైఫల్యాలపై ఉద్యమిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ప్రభుత్వం ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఓయూ శతాబ్ది ఉత్సవాల కోసం ఆర్భాటంగా రూ.400 కోట్ల గ్రాంటు ప్రకటించి, రూ.50 కోట్లే విడుదల చేసింది. ఉద్యమ సందర్భంగా స్టూడెంట్లకు ఇచ్చిన హామీలు వేటినీ కేసీఆర్ నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ప్రతి మండలానికి ఒక ఐటీఐ ఏర్పాటు చేస్తానన్న హామీ అమలులో  ఫెయిల్ అయ్యారు. పేద విద్యార్థులకు చేదోడుగా ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని నీరుగార్చారు. బీసీ స్టూడెంట్లకు ఆంక్షలు విధించి పూర్తి ఫీజు మినహాయింపుకు నోచుకోకుండా చేసి, మైనార్టీ స్టూడెంట్లకు మాత్రం ఎటువంటి ఆంక్షలు విధించకుండా పూర్తి ఫీజు మినహాయింపు ఇచ్చారు.