317 జీవోతో 40 వేల మందికి అన్యాయం

రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్ క్యాడర్లలో ఉద్యోగుల విభజన వివాదాస్పదంగా మారింది. సీనియార్టీ ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో ఉద్యోగుల కేటాయింపు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 317 తీవ్ర అలజడికి కారణమైంది. ఏ స్థానికత సెంటిమెంట్ తో తెలంగాణ ఉద్యమం చేశామో.. ఆ స్థానికత పునాదులనే ధ్వంసం చేసే వైఖరిపై టీచర్లు, ఉద్యోగులు మండిపడుతున్నారు. బలవంతపు బదిలీలతో సొంతూరు, అయినవాళ్లకూ దూరమై.. పొరుగు జిల్లాలో పరాయివాళ్లలాగా రిటైర్మెంట్ వరకూ బతకాల్సిందేనా అని మదనపడుతున్నారు. ఉద్యోగులు, టీచర్లలో ఆందోళనలకు కారణమవుతున్న 317 జీవోలోని లోపాలను సవరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016లో 10 జిల్లాలను 31 జిల్లాలుగా పునర్విభజించి, జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటును అందరూ స్వాగతించినా జోనల్ వ్యవస్థ రద్దును పలు సంఘాలు, మేధావులు వ్యతిరేకించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయని, విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు సరైన అవకాశాలు కల్పించటానికి వీలుగా ఏర్పాటైన జోనల్ వ్యవస్థను రద్దు చేయటం మంచిది కాదని ఆనాడే స్పష్టం చేశారు. ఆర్టికల్ 371(డి)కి సవరణ చేయకుండా జోనల్ వ్యవస్థ రద్దు అసాధ్యమని, రెండు జోన్లను ఆరు లేదా అంతకంటే ఎక్కువ చేయాలని ప్రతిపాదించారు. సరిగ్గా సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా చేస్తామని ప్రకటించింది. జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలికంగా కొత్త జిల్లాలకు కేటాయించారు. టీచర్లు, ఇతర ఉద్యోగులు వారు పనిచేస్తున్న స్కూల్/ఆఫీస్​ ఏ జిల్లా పరిధిలోకి వస్తే ఆ జిల్లా ఉద్యోగులుగా పరిగణించారు.

స్థానికత ఊసే లేకుండా..
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్  ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్) ఆర్డర్, 2018 (పీవో 2018) ఆగస్టు 29న వెలువడగా రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 30న జీవో 124 ద్వారా అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత మరో రెండు జిల్లాలను చేర్చి రాష్ట్ర ప్రభుత్వం 2021  జూన్ 30న జీవో 128ని అమలులోకి తెచ్చింది. మూడేండ్లలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను స్థానిక(జిల్లా, జోనల్, మల్టీజోనల్) కేడర్లుగా వర్గీకరించాలనే నిబంధన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనే ఉన్నది. తుది గడువు సమీపిస్తున్న తరుణంలో ఆగస్టులో ప్రభుత్వం హడావుడిగా శాఖల వారీ పోస్టుల లోకల్ కేడర్ క్లాసిఫికేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. స్థానికత ఆధారంగా సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తారని అంతా భావించారు. ఉద్యోగ, టీచర్​ సంఘాలతో విస్తృత చర్చలు జరుపుతారని భావించినా.. అందుకు భిన్నంగా ఒకట్రెండు సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకపక్షంగా జీవో 317ను విడుదల చేసింది.

కేటాయింపులు ఇట్లజేయాలె
లోకల్ కేడర్లలో ఉద్యోగుల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేయాలో పీవో 1975లోనూ, పీవో 2018లోనూ ఒకేలా పేర్కొన్నారు. స్థానిక కేడర్లలో పాలనావసరాలు, వ్యక్తుల వయసు, సీనియార్టీ సమతుల్యత, ఆ లోకల్ ఏరియాలో చేసిన సర్వీసు, ఆయా ప్రాంతంలోని భాష, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం అనే అంశాల్లో అన్నీ లేదా కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత వ్యక్తుల ప్రాధాన్యతల ఆధారంగా కేటాయించాలని స్పష్టంగా ఉంది. ఖాళీలను దామాషాలో పంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఆ దామాషాలో కేటాయించాలి. 70%పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లల తల్లిదండ్రులు, కారుణ్య నియామకం ద్వారా నియమితులైన వితంతువులు, కేన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కేటాయింపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ల్లో పని చేస్తున్న ఉద్యోగ దంపతులు వేర్వేరు కేడర్లకు అలాటైతే కేడర్ మార్పు ఆప్షన్ అవకాశం ఇవ్వాలి. పరిపాలనా అవసరాలు, ఖాళీల లభ్యత మేరకు ఆచరణ సాధ్యమైన రీతిలో భార్యాభర్తలను ఒకే లోకల్ కేడర్ లో సర్దుబాటు చేయాలి. ఉద్యోగుల కేటాయింపు కోసం జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయాలి.

40 వేల మందికి అన్యాయం
ప్రాథమిక సమాచారాన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో దాదాపు 40 వేల మంది, విద్యా శాఖలోనే 22,500 మంది ఇతర జిల్లాలకు అలాట్​అయినట్లు తెలుస్తోంది. పది వేలమంది టీచర్లు తమ ఆప్షన్ కు విరుద్ధంగా వేరొక జిల్లాకు అలాటై స్థానిక జిల్లాకు శాశ్వతంగా దూరమయ్యారు. అన్యాయం ఒకరికి జరిగినా అన్యాయమే. కొన్ని శాఖల్లో ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై సంఘాలు నోరు విప్పంటం లేదని, తమ గోడు పట్టించుకొనే వారే లేరని ఉద్యోగులు కుమిలి పోతున్నారు. ప్రస్తుత పోస్టింగ్స్ అన్నీ తాత్కాలికంగా(అడ్​హక్ గా) ప్రకటించి సాధారణ బదిలీల్లో స్టేషన్ సీనియార్టీ, సర్వీసు సీనియార్టీకి పాయింట్లు కేటాయించి బదిలీ కోరుకునే అవకాశం కల్పించాలని వారంతా కోరుకుంటున్నారు. ప్రధానంగా సీనియర్లు ఎక్కువగా పట్టణ జిల్లాలకు, జూనియర్లు ఎక్కువగా గ్రామీణ జిల్లాలకు అలాట్​ అయ్యారు. దీని వల్ల పీవో 2018లో పేర్కొన్న వయసు సమతుల్యతకు భంగం కలుగుతోంది. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. పీవో 2018 ప్రకారం 95% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేశారు. అయితే నియామకాలు జరగాలంటే ఖాళీలుండాలి కదా. రెండేండ్ల తర్వాత రిటైర్మెంట్లు ప్రారంభమైతే.. పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు ఏర్పడతాయి. జూనియర్లు అలాటైన జిల్లాల్లో పదిహేను, ఇరవై ఏండ్ల వరకు రిటైర్మెంట్లు ఉండే అవకాశమే లేదు.

ఇప్పటికైనా సమస్యను గుర్తించాలె
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను గమనించైనా ప్రభుత్వం అన్ని ఉద్యోగ, టీచర్​ సంఘాలతో చర్చించి క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తించాలి. దానికి అనుగుణంగా జీవో 317ను సవరించాలి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. స్పౌజ్, పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలి. స్థానిక జిల్లాలకు దూరమైన ఉద్యోగులు, టీచర్లను అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేసి సొంత జిల్లాలకు తిరిగి పంపించాలి. లేదా భవిష్యత్తులో ఏర్పడే రిటైర్మెంట్ ఖాళీల్లో వారిని తాము కోరుకున్న సొంత జిల్లాకు బదిలీ చేస్తామనే అంశాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనాలి. 

జీవోలో ఎన్నో లోపాలు
1. స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం, 2. దివ్యాంగుల వైకల్యం పర్సంటేజీని 70%గా నిర్ణయించటం, 3. ఆ ఏరియాలో చేసిన మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవటం, 4. కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల స్పౌజ్ ల ప్రస్తావన లేకపోవటం, 5. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, 6. దీర్ఘకాలిక జబ్బులను పరిగణనలోకి తీసుకోకపోవటం. 317 జీవో విడుదలైన వెంటనే ఈ లోపాలను ఎత్తిచూపుతూ సవరించాలని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. టీచర్లలో ఆందోళన వెల్లువెత్తడాన్ని గమనించిన ప్రభుత్వం డిసెంబర్13న విద్యా శాఖ మంత్రి ఆధ్వర్యంలో టీచర్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆరుగంటలపాటు జరిగిన సమావేశంలో సంఘాల అభిప్రాయాలను, వినతిపత్రాలను తీసుకున్నారు. కానీ, ఒక్క సూచనను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. టీచర్ల నుంచి ఒక్కరోజులో ఆప్షన్లు తీసుకున్నారు. టీచర్ల బేసిక్ సీనియార్టీ జాబితాలు డీఈవో కార్యాలయాల్లో కూడా లేవు. స్కూళ్ల నుంచి వివరాలు తెప్పించి హడావుడిగా డ్రాఫ్ట్ లిస్టులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో సీనియార్టీపై వచ్చిన అభ్యంతరాలను సవరించకుండానే ఫైనల్ చేసి అలొకేషన్ చేసేశారు. మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సీనియార్టీ నిర్ణయం, జిల్లాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి.

అప్పీల్స్​ను పట్టించుకోలే..
సీనియార్టీ లిస్ట్​లు సమగ్రంగా రూపొందించాలని, ఫైనల్ సీనియార్టీ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఆప్షన్స్ రివైజ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ సరిగా పరిశీలించలేదు. ఎస్సీ, ఎస్టీ దామాషా పాటించలేదు. స్థానిక భాషలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంత ఉద్యోగులను వారి ఆప్షన్లకు భిన్నంగా మైదాన ప్రాంతమైన నిర్మల్, మంచిర్యాలకు, ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాకు మహబూబాబాద్ నుంచి మైదాన ప్రాంత గిరిజనులను, మైదాన ప్రాంత గిరిజనులు ఉన్న మహబూబాబాద్ జిల్లాకు ములుగు జిల్లా ఆదివాసీలను కేటాయించారు. అలోకేషన్ తర్వాత స్పౌజ్, సీనియార్టీ, జిల్లాల కేటాయింపుపై కుప్పలు తెప్పలుగా అప్పీల్స్ వచ్చాయి. పీవో 2018 ప్రకారం అప్పీల్స్ కు 60 రోజుల సమయం ఉంటుంది. కానీ జీవో 317లో నిర్దిష్టమైన గడువు ఇవ్వలేదు. అప్పీల్స్ ఏవి పరిష్కరించారో, ఏవి తిరస్కరించారో, కారణాలేమిటో చెప్పలేదు.

- చావ రవి, ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్