జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య

జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్​ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ..సీఎం రేవంత్​రెడ్డిని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గ్రూప్​1 పరీక్షల్లో తీసుకొచ్చిన జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిని ఎత్తివేయాలన్నారు. ఈ విషయంపై15 రోజులుగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. పరీక్షల విషయంలో నెలల క్రితమే సీఎంకు విజ్ఞప్తి చేశామని, కానీ స్పందించలేదన్నారు.

జీవో 29 తప్పని దేశమంతా గగ్గోలు పెడుతుంటే, సీఎం, అధికారులు వితండవాదం చేస్తున్నారన్నారు. 29 జీవో రద్దు చేయకపోతే జాతీయ బీసీ, ఎస్సీ కమిషన్​కు  ఫిర్యాదు చేస్తామన్నారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయకపోతే, పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నీల వెంకటేశ్ హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేముల రామకృష్ణ, సి. రాజేందర్, జి. అనంతయ్య, నందా గోల్, ఉదయ్ నేత, మోదీ రాందేవ్, ఋషి కుమార్, ఉమా మహేశ్వర రావు, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.