సెస్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. సెస్ లలో తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాను కేంద్రం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణకు సెస్ కేటాయింపులో అన్యాయం చేస్తూ.. రూ.2 లక్షల కోట్లను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పిన దాంట్లో నిజం లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే నిజమైతే అమిత్ షా తెలంగాణకు వచ్చి ముక్కు నేలకు రాయాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘‘ బండి సంజయ్ మసీదులు తవ్వాలంటున్నారు..మేం సాగునీటి కోసం కాలువలు తవ్విస్తున్నాం. పేదల ఇళ్ల కోసం పునాదులు వేస్తున్నం. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ (శనివారం) రూ.119 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు.

దేవరకద్ర ను మున్సిపాలిటీగా మారుస్తాం

నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్ర ను మున్సిపాలిటీగా మారుస్తామని కేటీఆర్ వెల్లడించారు. కొత్తకోట,దేవరకద్ర లలో 100 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం మోసగించిందన్నారు. అయినా బీజేపీ నాయకులు రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.కృష్ణానదిలో తెలంగాణకు ఉన్న 575 టీఎంసీల నీటివాటాను ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని చెప్పారు. 

మరిన్ని వార్తలు..

మహారాష్ట్రలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

దాహం తీర్చుకునేందుకు వెళ్లిన 40 బర్రెలు గల్లంతు