కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక నుంచి కేంద్ర నిధులు పంచాయతీలకు నేరుగా అందనున్నాయి. నిజానికి స్వయం పరిపాలన స్ఫూర్తి ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకే వెళ్లాలి. కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు. గ్రామ పంచాయతీల సాధికారతను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే నిధుల్లో కొంత భాగం కరెంట్, తాగునీరు ఖర్చుల కింద వాడుకుంటున్నాయి. ఫలితంగా గ్రామ పంచాయతీలకు అరకొర నిధులే అందుతున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక, సొంత నిధులతో కార్యక్రమాలు చేపట్టినా.. బిల్లులు రాక స్థానిక పాలన అస్తవ్యస్తంగా మారుతోంది.
ఆర్థిక కమిషన్ రిపోర్టు ఏది?
పల్లె ప్రగతి పేరుతో గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ పనులు చేశామని, పెండింగ్ బిల్లులను క్లియర్చేయాలని తెలంగాణలో కొన్ని రోజులుగా సర్పంచ్‌లు డిమాండ్చేస్తున్నారు. బిల్లులు ఏమీ పెండింగ్‌లో లేవని సర్కారు పెద్దలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు చట్టబద్ధంగా నిధులు, విధులను బదలాయించడం లేదు. వాటిపై సవితి తల్లి ప్రేమ చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రామాలను అభివృద్ధ బాట పట్టించామని గొప్పలు చెబుతున్న సర్కారు.. రాష్ట్ర బడ్జెట్‌నుంచి పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం గమనించాలి. రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, అది ఇప్పటి వరకు రిపోర్టు సమర్పించిన దాఖలాలు లేవు. కమిషన్‌ను ఏర్పాటు చేసి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్ర ఆర్థిక కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటి? దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోదా?
ఆస్తి పన్నుతో అభివృద్ధి సాధ్యమా?
గత ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెద్దగా నిధులు ఇవ్వకపోగా 2018 పంచాయతీ రాజ్‌చట్టం ద్వారా పలు సవరణలు చేసి సర్పంచ్‌లను నామ మాత్రపు వ్యక్తులుగా చూపడం శోచనీయం. పైగా ఆస్తిపన్ను వసూలు చేసి ఆర్థిక పరిపుష్టికి ప్రయత్నించాలని పేర్కొనడం గమనించాల్సిన విషయం. ఆస్తి పన్నుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల కనీస అవసరాలు కల్పించడం సాధ్యం కాదన్న విషయం తెలిసిందే. ఇదిపోను గౌరవ వేతనాలు పెంచి వాటిని పంచాయతీల రాబడి నుంచే ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేక అప్పులు చేస్తున్నారు. సరిపోను సిబ్బంది లేని చోట్ల పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా ఉండటం లేదు. తాగునీరు కూడా పూర్తి స్థాయిలో అందక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో గ్రామాల్లో ఇప్పటికీ బాలవికాస లాంటి సంస్థలు తాగునీరు అందిస్తున్నాయి. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ఏర్పాటు చేశామని సర్కారు చెప్పినా.. ఇంకా తాగునీరు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
బడ్జెట్ లో నిధులు కేటాయించాలి
రాష్ట్ర జాబితాలో 5వ అంశం స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటు, అధికారాలకు సంబంధించినది. ఈ అంశాన్ని రాష్ట్ర జాబితా నుంచి తీసేసి, కేంద్ర జాబితాలో లేదా కాన్క్యురెంట్జాబితాలో పొందుపర్చాలని చాలా మంది పంచాయతీ ప్రతినిధులు డిమాండ్చేస్తున్నారు. దాని వల్ల పంచాయతీల సాధికారత సాధ్యమవుతుందనేది వారి వాదన. కేరళ రాష్ట్రం మాదిరి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 25 శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయించి విడుదల చేస్తే అవి ఆర్థిక పరిపుష్టి సాధించగలుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఒక అవగాహనతో స్థానిక సంస్థలను త్వరితగతిన బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
2018 పంచాయతీరాజ్ చట్టం
73,74 రాజ్యాంగ సవరణల ద్వారా సాధికారతే ధ్యేయంగా సంక్రమించిన 29 విషయాలను రాష్ట్రాలు గ్రామ పంచాయతీలకు బదలాయించడం లేదు? పట్టణ పంచాయతీలకు కూడా18 అంశాలను బదలాయించాల్సి ఉన్నా.. జాప్యం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లో సవరించి, సెక్షన్37 ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైన సర్పంచ్ల చెక్‌పవర్‌ను జిల్లా కలెక్టర్ రద్దు చేయడం, వారిని డిస్మిస్‌చేయడం లాంటి మార్పులు చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి. పైగా రాజ్యాంగంలోని11వ షెడ్యూల్, ‘ఆర్టికల్243 జీ’ ప్రకారం పంచాయతీలకు అధికారాలను కట్ట బెట్టకుండా నామమాత్రపు జీవోలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు కానీ అధికార వికేంద్రీకరణపై దృష్టిపెట్టడం లేదు. ‘ఆర్టికల్243 జడ్డీ’ ప్రకారం జిల్లా ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా చేయడం లేదు. గిరిజన ప్రాంతాల్లో పెసా చట్టం1996 అమలుకు నోచుకోలేదు. మొన్నామధ్య ఒకరిద్దరు సర్పంచ్ లు గవర్నర్ముందు రాజీనామా సమర్పించడం ఆలోచించాల్సిన విషయం. - డా. టి. ప్రభాకర్‌రెడ్డి, ఆర్థిక శాస్త్రవేత్త