కేసీఆర్, హరీశ్ వల్లే రాష్ట్రానికి అన్యాయం

కేసీఆర్, హరీశ్ వల్లే రాష్ట్రానికి అన్యాయం
  • ఏపీ జలదోపిడీకి సహకరించింది గత బీఆర్ఎస్ ​ప్రభుత్వమే
  •  టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు: మంత్రి ఉత్తమ్ 
  • వాళ్ల హయాంలోనే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు 
  • ప్రగతిభవన్​లో జగన్​తో కేసీఆర్​అలయ్ ​బలయ్ చేసుకున్నరు
  • ఆనాడు అపెక్స్ కౌన్సిల్ ​మీటింగ్​కు వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారని ఫైర్

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కేసీఆర్, హరీశ్​రావు వల్లేనని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఆనాడు ఏపీ ప్రభుత్వ పెద్దలతో అలయ్​బలయ్ చేసుకున్నోళ్లే.. ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 

టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని విభజన చట్టంలో ఉన్నా.. ఏపీ పాలకులకు నీటి దోపిడీలో సహకరించేందుకే నాటి బీఆర్ఎస్​ప్రభుత్వం అమర్చలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సీఆర్​ పాటిల్​ను కోరినట్టు చెప్పారు.  గురువారం జలసౌధలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా  హరీశ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్​ఇచ్చారు. 

హరీశ్​ చేతగానితనం వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ‘కృష్ణా జలాలను తాకట్టు పెట్టి.. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిన మీరా మాట్లాడేది?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘రాష్ట్రంలోని అందరి జీవితాలను తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. లక్ష కోట్లు అప్పు తెచ్చి కడితే, వాళ్ల హయాంలోనే అది కూలిపోయింది. 

మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని వాళ్లే అన్నరు.. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క పిల్లరే కుంగిందని నిస్సిగ్గుగా చెబుతున్నరు.  బీఆర్ఎస్​ హయాంలోనే ప్రాజెక్టులకు అనుమతులు రాలేదు. నీటి కేటాయింపులు జరగలేదు. మేమే అనుమతులు తెస్తున్నం. కేటాయింపులు చేయిస్తున్నాం. బీఆర్ఎస్​ వాళ్లు నీళ్ల కోసం ప్రాజెక్టులను కట్టలేదు. జేబులు నింపుకునేందుకే వాటిని కట్టారు’’ అని విమర్శించారు. రూ.27,000 కోట్లు ఖర్చు పెట్టినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందన్నారు.  

రాష్ట్రంపై ఆర్థిక భారం.. 

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీకి ఎక్కువ కాలం పరిమితితో తెచ్చిన రుణాల వల్ల రాష్ట్రంపై పెను భారం పడిందని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. ‘‘పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌పై రూ. 27 వేల కోట్లు, సీతారామకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఎకరం భూమికి కూడా నీరందలేదు. సమ్మక్కసాగర్​బ్యారేజీకి 44 టీఎంసీల కేటాయింపులపై చర్చలు జరుపుతున్నాం. నేనే స్వయంగా చత్తీస్​గఢ్​ మంత్రికి ఫోన్​చేసి మాట్లాడాను.  

కృష్ణా ట్రిబ్యునల్​లో రాష్ట్రాల వాటా తేల్చేందుకు సెక్షన్​3పై వాదనలు వినేలా చేసింది కాంగ్రెస్​ ప్రభుత్వమే.  2015లో ఏపీ, తెలంగాణకు నీటి వాటాలుగా 512:299గా ఒప్పుకుని సంతకాలు చేసింది చంద్రబాబు, కేసీఆరే. 2017లో ఏపీ ముచ్చుమర్రి కెపాసిటీ 3,500 క్యూసెక్కుల నుంచి 6,500 క్యూసెక్కులకు పెంచింది బీఆర్‌‌ఎస్ హయాంలోనే. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి రోజూ 35 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేలా రాయలసీమ ప్రాజెక్ట్ చేపట్టింది బీఆర్ఎస్​హయాంలోనే. అక్కడ ఏపీ దొడ్డిదారిలో నీళ్లు తరలించుకుపోతుంటే.. ప్రగతి భవన్​లో కేసీఆర్, జగన్​దావత్​లు చేసుకుని అలయ్​బలయ్ చేసుకున్నారు. 

రాష్ట్రం రాకముందు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ రోజూ 4.2 టీఎంసీలను ఎత్తుకెళ్తే.. బీఆర్ఎస్​హయాంలో అది 9.6 టీఎంసీలకు పెరిగింది” అని చెప్పారు. అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​కు హాజరుకాకుండా కేసీఆర్​ డుమ్మా కొట్టారన్నారు. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2013లోనే జీవో ఇచ్చారని, దాన్ని పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. 

బీఆర్ఎస్​ హయాంలోనే జలదోపిడీ.. 

ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే బీఆర్ఎస్​ హయాంలోనే ఏపీ జల దోపిడీ ఎక్కువగా జరిగిందని మంత్రి ఉత్తమ్​చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో 1,200 టీఎంసీలను శ్రీశైలం నుంచి ఏపీ ఔట్​బేసిన్​కు తరలించిందన్నారు. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల్లో ఏనాడూ 190 టీఎంసీలకు మించి వాడుకోలేదని చెప్పారు. ఆన్‌‌గోయింగ్ ప్రాజెక్టులను బీఆర్‌‌ఎస్ పూర్తి చేసి ఉంటే.. 240 టీఎంసీలు వచ్చి 25 లక్షల కుటుంబాలకు మేలు జరిగి ఉండేదని చెప్పారు.  ఆన్​గోయింగ్​, నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు 730 టీఎంసీల జలాలను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.

ఫిబ్రవరి 21న  కేఆర్ఎంబీ మీటింగ్! 

కృష్ణా జలవివాదాలు, నీటి పంపిణీ అంశాలపై శుక్రవారం జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్​నిర్వ హించనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాలకు ఉన్న నీటి వాటాలపై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సెక్ర టరీ స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం కేఆర్ఎంబీ చైర్మన్, ఈఎన్సీ జనరల్, నల్గొండ సీఈ తదితరులను మంత్రి ఉత్తమ్​ పిలిపించుకుని మాట్లాడారు.

 ఏపీ ఇంతలా జలదోపిడీ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బోర్డుకు ఫిర్యాదు చేశామని అధికారులు చెప్పగా.. తనకెందుకు చెప్పలేదంటూ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక నీటి వాటాలపై ఏం చేయాలో చెప్పాలని బోర్డు చైర్మన్​అతుల్​జైన్​ను ఉత్తమ్ కోరారు. దీనిపై రెండు రాష్ట్రాల సెక్రటరీలతో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.