పైసలు మావి.. పనులు వేరొకరికా!

పైసలు మావి.. పనులు వేరొకరికా!
  • ఎకో టూరిజం అభివృద్ది పనుల్లో  గిరిజనులకు అన్యాయం
  •  పులిగుండాల ఎకో టూరిజం అధికారులపై వీఎస్ఎస్ ల ఆగ్రహం
  • పేర్లు తీసుకుని పనులు ఇవ్వకుండా స్థానిక గిరిజనులకు మొండిచేయి
  • జేసీబీల వాడకం, ఆంధ్ర కూలీలతో హట్ ల  నిర్మాణాలు
  •  తల్లాడ ఫారెస్ట్ రేంజ్ నిధులు వాడుకుంటున్న ఆఫీసర్లు

ఖమ్మం/పెనుబల్లి, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా కనకగిరి అడవుల్లో పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధికి తమ నిధులను వాడుకుంటూ.. పనులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని గిరిజనులు, వన సంరక్షణ సమితి(వీఎస్ఎస్) సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు నెలలుగా పనులు కొనసాగిస్తున్నారు. 

ఏపీలోని విజయనగరం నుంచి కూలీలను రప్పించి నిర్మాణాలు చేయిస్తున్నారు. ఎకో టూరిజం డెవలప్ మెంట్ కు రాష్ట్ర సర్కార్ రూ.7 కోట్లు కేటాయించగా ఇంకా మంజూరు కాలేదు. దీంతో తల్లాడ ఫారెస్ట్ రేంజ్ కు చెందిన వన సంరక్షణ సమితి నిధులు రూ.50 లక్షలు టూరిజం పనులకు వినియోగిస్తున్నారని గిరిజనులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సఫారి ట్రాక్ నిర్మాణం, హట్ లు, వ్యూ పాయింట్ పనులు స్పీడ్ గా చేస్తున్నారు.  

కనీసం తమతో జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించకుండా జేసీబీలతో పూర్తి చేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులిగుండాల పనుల్లో ఉపాధి కల్పిస్తామని స్థానిక వన సంరక్షణ సమితిల నుంచి గత నెలలో అధికారులు పేర్లు తీసుకున్నారు. తీరా ఏపీ నుంచి కూలీలను తీసుకొచ్చి చేయిస్తున్నారంటున్నారు. అధికారులను అడిగితే పనులు పూర్తయ్యాక స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని  చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అడవులను కాపాడేందుకు స్థానికంగా ఉండే గిరిజనులతో వన సంరక్షణ సమితిలను 1990లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో నాబార్డ్, ఐటీడీఏల నుంచి నిధులు మంజూరు చేసి అటవీ అభివృద్ధికి ఖర్చు చేస్తూ గిరిజనులకు ఉపాధి కల్పించారు. అయితే.. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కాగా.. అటవీ ఏరియాలో జామాయిల్, టేకు, వెదురు, జామ వంటి తోటలను పెంచి సంరక్షణ బాధ్యతను వీఎస్ఎస్​లకు అప్పగిస్తారు. 

ఉపాధి కల్పిస్తూనే, మరోవైపు పంట అమ్మగా వచ్చే ఆదాయంలో 50 శాతం నిధులను వీఎస్ఎస్​లకు అందిస్తారు. ఆ నిధులతో స్థానిక గిరిజన గూడేల్లో అభివృద్ధి పనులు చేయగా..  మిగిలిన సొమ్మును వీఎస్ఎస్​ ఫండ్​గా అటవీ శాఖ వద్ద ఉంటుంది. ఇలా తల్లాడ రేంజ్ లో అటవీ భూముల్లోని జామాయిలు చెట్లను నరికి, వేలం వేయగా రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో 50 శాతం గిరిజన కూలీలకు ఇవ్వగా, మిగిలిన డబ్బులతో  ప్రస్తుతం ఎకో టూరిజం పనులు చేస్తున్నారని వీఎస్ఎస్​సభ్యులు చెబుతున్నారు. 

తాటిచెట్లు, వెదురు బొంగులు, కొండగడ్డితో పెద్ద హట్ లు నిర్మించేందుకు స్థానికంగా స్కిల్డ్ లేబర్​లేకపోవడంతోనే ఏపీ నుంచి రప్పించామని అధికారులు  పేర్కొంటున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్​ నిర్మాణానికి వేగంగా పనులు పూర్తి చేసేందుకు జేసీబీలను వినియోగిస్తున్నామన్నారు. 

పేర్లు తీసుకుని పని ఇవ్వలేదు 

ఎకో టూరిజం పనుల్లో ఉపాధి కల్పిస్తామని ఫారెస్ట్ అధికారులు వీఎస్ఎస్​ సభ్యుల పేర్లు తీసుకున్నారు. ఇంతవరకు పిలవలేదు. జామాయిలు నరుక్కునేందుకు పర్మిషన్ కోసం రెండేళ్లుగా అధికారులను అడుగుతున్నా స్పందించడం లేదు. దీంతో వీఎస్​ఎస్​ లో నిధులు జమ కాలేదు. ఇప్పటికైనా గిరిజనులకు పనులు కల్పించాలి.  

- పద్ధం పుల్లయ్య, గుట్టగూడెం వీఎస్ఎస్​ అధ్యక్షుడు -

వెంగంపేట వీఎస్ఎస్​ నిధులతోనే పనులు 

కనకగిరి అటవీలో ఎకో టూరిజం పనులకు వెంగంపేట వీఎస్ఎస్​ నిధులను ఖర్చు చేస్తున్నాం.  పనుల్లో అవసరమైన చోట స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పిస్తాం. బ్రహ్మళ్ల కుంట, తాళ్లపెంట, గుట్టగూడెం వీఎస్​ఎస్​లో నిధులు లేవు. టూరిజం ప్రారంభించాక  విద్యార్హతను బట్టి స్థానిక గిరిజన యువతకు ఉపాధి కలిస్తాం.
  
- ఉమ, తల్లాడ ఎఫ్ఆర్ఓ -