మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ముగ్గులు

కామారెడ్డి/ జగిత్యాల: కామారెడ్డి, జగిత్యాల వాసులు తెలంగాణ ఉద్యమం నాటి రోజులను మళ్లీ గుర్తు చేశారు. భోగి వేళ ముగ్గుల రూపంలో తమ నిరసనలు తెలిపారు. ‘స్టాప్​ మాస్టర్​ ప్లాన్​’ అంటూ ముగ్గులు వేసి తమ ఆకాంక్షను చాటారు. ఇటీవల కొన్ని రోజులుగా కామారెడ్డి, జగిత్యాలలో మాస్టర్​ ప్లాన్​ కు వ్యతిరేకంగా  నిరసనలు, ఆందోళనలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ‘మా భూముల్లో ఇండస్ట్రియల్ జోన్లు చేసి ఎమ్మెల్యేలు మీరు మాత్రం పండగ చేసుకోండి’ అంటూ ముగ్గులతో రాశారు. జగిత్యాల మండలం మోతె, నర్సింగాపూర్ గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ రైతులు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.  ‘స్టాప్ రిక్రియేషన్ జోన్, స్టాప్ మాస్టర్ ప్లాన్’ అంటూ తమ ఇళ్ల ముందు ముగ్గుతో రాశారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.