సింగరేణి సీఎండీపై విచారణ చేపట్టండి : హైకోర్టు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగరేణి సీఎండీ శ్రీధర్​పై విచారణ చేపట్టాలని కొత్తగూడెం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గెస్ట్​హౌస్​ వినియోగానికి సంబంధించి సీఎండీ శ్రీధర్​​నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ  కొత్తగూడెంకు చెందిన టీబీజీకేఎస్​ మాజీ నేత సంపత్​కుమార్​ గతంలో కోర్టులో కేసు వేశారు. నిధుల దుర్వినియోగంపై 2020లో కోర్టు ఆదేశాల మేరకు కొత్తగూడెం వన్​టౌన్​ కోర్టులో సీఎండీపై కేసు నమోదైందని ఆయన తెలిపారు. 2015 సంవత్సరంలో శ్రీధర్​ సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్​లో గెస్ట్​హౌస్​ను నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారని ఆరోపించారు.

అందుకు సంబంధించి దాదాపు రూ.11లక్షల కంపెనీ నిధులను అక్రమంగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై తాను ఆర్టీఐ ద్వారా సమాచారం అడగగా అప్పటికప్పుడు తప్పుడు తేదీలతో ఆ డబ్బులను కంపెనీకి తిరిగి సీఎండీ చెల్లించారని పేర్కొన్నారు. ఈ నిధుల దుర్వినియోగంపై తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. 2020లో కోర్టు ఆదేశాల మేరకు కొత్తగూడెం వన్​టౌన్​ పీఎస్ లో  కేసు నమోదైందన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి తన వద్ద ఏమైనా డాక్యుమెంటేషన్​ ఆధారాలుంటే తమకు ఇవ్వాలని వన్ టౌన్​ సీఐ సత్యనారాయణ తనను బుధవారం రాత్రి అడిగారని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.