పిటిషనర్లకు సమయం ఇవ్వండి

పిటిషనర్లకు సమయం ఇవ్వండి
  • ఆధారాలతో వివరణ ఇచ్చేందుకు చాన్స్ ఇవ్వండి 
  • దుర్గం చెరువు ఆక్రమణలపై హైకోర్టులో విచారణ ముగింపు
  • పిటిషనర్ల వివరణను పరిశీలించాక చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ ప్రాంతంతోపాటు కావూరిహిల్స్‌‌‌‌ లేఔట్‌‌‌‌లో దుర్గం చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో నిర్మాణాలను తొలగించాలన్న నోటీసులపై ఆధారాలు సమర్పించడానికి పిటిషనర్లకు సమయం ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దుర్గం చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ ప్రాంతంలోని ఆక్రమణలను 30 రోజుల్లోగా తొలగించాలంటూ వాల్టా చట్టంలోని సెక్షన్‌‌‌‌ 23 కింద జారీ చేసిన నోటీసులనే షోకాజ్‌‌‌‌ నోటీసులుగా పరిగణించాలని చెప్పింది. ఈ నోటీసులపై పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించాక చట్టప్రకారం ముందుకెళ్లాలని సూచించింది. 

పిటిషన్‌‌‌‌లోని పూర్వాపరాల్లోకి తాము వెళ్లడంలేదని తెలిపింది. గుట్టల బేగంపేటలో ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మించుకున్న ఇళ్లను తొలగించాలంటూ వా డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్‌‌‌‌ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో 7 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై చీఫ్ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు వాదిస్తూ గుట్టల బేగంపేటలో 58.08 ఎకరాల్లో 280 ప్లాట్లతో వేసిన లేఔట్‌‌‌‌లో1998లో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

అన్ని అనుమతులతో ఇళ్లను, అపార్ట్‌‌‌‌మెంట్లను నిర్మించుకున్నామన్నారు. ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండా తొలగించాలని నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.సుదర్శన్‌‌‌‌రెడ్డి వాదిస్తూ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలోని నిర్మాణాలను తొలగించాలంటూ ఇచ్చిన నోటీసులను షోకాజ్‌‌‌‌ గా పరిగణిస్తామని, నిర్దిష్ట గడువులోగా ఆధారాలు సమర్పించడానికి అవకాశం ఇస్తామన్నారు. దీంతో ఇదివరకు జారీ చేసిన నోటీసులను షోకాజ్ గా పరిగణించాలని అధికారులను, అన్ని ఆధారాలతో వివరణ ఇవ్వాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ముగించింది.