బాల్కొండ, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బాల్కొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అండతో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు చెందిన రైస్ మిల్ పై రైడ్ చేయగా రూ.72 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు వెల్లడైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొసైటీలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకిచ్చిన రుణమాఫీ, ఎకరానికి రూ.15,000 తదితర హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అనంతరం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు అంబటి నవీన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, లీడర్లు ఆరెపల్లి నర్సయ్య, కడ్తల్ రాజేశ్వర్, కొత్తింటి రాకేశ్, పోశెట్టి, రాము చిన్నయ్య, రమేశ్, శివానంద్, లింగం, రాజేశ్వర్ పాల్గొన్నారు.