
- గత ప్రభుత్వ హయాంలో నర్సింగాపూర్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు
- ధరణిలో 90 ఎకరాలకు పట్టా
- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫిర్యాదుతో వెలుగులోకి..
- నాలుగు నెలలు గడిచినా ముందుకు సాగని ఎంక్వైరీ
జగిత్యాల, వెలుగు: గత సర్కార్ హయాంలో జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో సర్కార్, అసైన్డ్ భూములు పట్టాలు చేయించుకున్న ఘటనపై వేసిన ఎంక్వైరీ స్లోగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు లీడర్లు, వ్యాపారులు రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కై సర్కార్, అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో జరిగిన ఈ దందాపై గతేడాది నవంబర్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు ఎంక్వైరీ చేపట్టి నాలుగు నెలలు గడిచినా ముందుకు సాగకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు సర్వే నంబర్లలో 90 ఎకరాలకు పట్టాలు
నర్సింగాపూర్ గ్రామ శివారులోని 437, 251 సర్వే నంబర్లలోని సర్కార్ భూమిలో 90 ఎకరాలకు పైగా కొందరు పట్టాలు చేయించుకున్నారు. సర్వే నంబర్ 437లో 387.12 ఎకరాలు ఉండగా 71.11 ఎకరాలకు పట్టాలు చేసుకున్నారు. అలాగే సర్వే నంబర్251 లో 207 ఎకరాలుండగా 19.7 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. ఈ వ్యవసాయ భూముల్లో కొందరు అక్రమంగా సాగు చేస్తుండగా, మరికొందరు ఇటుక బట్టీల నిర్వహణకు లీజుకు ఇచ్చారు. ఈ లెక్కన 90 ఎకరాలకు గత సర్కార్ హయాంలో రైతుబంధు దాదాపు రూ. 57.60 లక్షలకు పైగా పొందినట్లు తెలుస్తోంది. కాగా మూడు ఎకరాలకు సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లను ఇద్దరు పట్టాదారులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమా..?
సర్కార్ భూములకు పట్టాలు ఇచ్చిన విషయంలో సర్వే నంబర్ 437, 251లోని సుమారు 90 ఎకరాలను అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు ఇతరుల పేరిట పాస్ బుక్స్ జారీ చేశారు. ఈ పట్టాల జారీ కోసం నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్‌లో అసైన్డ్ ల్యాండ్‌కు బదులు పట్టా ల్యాండ్ అని రికార్డుల్లో నమోదు చేసి మరీ పట్టాలు ఇచ్చారు. అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు, కొందరు రెవెన్యూ ఆఫీసర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఒక్కో ఎకరం పట్టాకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ప్రమేయమున్న ఆఫీసర్లు ఇప్పుడు కీలక ఆఫీసర్లుగా కొనసాగడం వల్లే ఎంక్వైరీ ముందుకు సాగడం లేదని విమర్శలున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఆఫీసర్లతో పాటు పట్టాదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
నర్సింగాపూర్ గ్రామం లోని 437, 251 లోని ప్రభుత్వ భూమిలో కొందరు పట్టాలు చేసుకున్నారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేప్టటాం. నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
శ్రీనివాస్, జగిత్యాల రూరల్ తహసీల్దార్