ఎస్డీఎఫ్​ పనులపై ఎంక్వైరీ.. ఎన్నికల ముందు గతేడాది అడ్డగోలుగా శాంక్షన్​

  • ఇష్టమున్నట్టు పనులు చేయించిన నాటి ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు
  • బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు
  • పనుల్లో క్వాలిటీపై కొత్త సర్కారు ఆరా తీస్తుండడంతో టెన్షన్

ఖమ్మం/యాదాద్రి, వెలుగు:  గతేడాది స్పెషల్ డెవలప్​మెంట్​ ఫండ్(ఎస్డీఎఫ్) కింద జిల్లాల్లో వేల కోట్లతో చేపట్టిన పనులపై ఎంక్వైరీ మొదలైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ తాను పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలకు ఎస్డీఎఫ్ నిధులు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం వాడాల్సిన ఈ ఫండ్స్​ను అప్పటి ఎమ్మెల్యేలు  కులాల వారీగా కమ్యూనిటీహాళ్లు, గుళ్లు, మసీదులు,  సీసీ రోడ్ల కోసం తమకు నచ్చిన చోట్ల కేటాయించారు. రూ.5 లక్షల వర్క్స్ వరకు టెండర్లు పిలవనవసరం లేకపోవడంతో పనులను ముక్కలు ముక్కలు చేసి అనుచరులకు నామినేషన్​పద్ధతిలో అప్పగించారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో పూర్తయిన పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్​ లీడర్లు ఎదురుచూస్తున్నారు. కానీ, పనుల తీరుపై ఫిర్యాదులు రావడంతో రూ.600 కోట్ల విలువైన చెక్కులను కొత్త సర్కారు పెండింగ్​లో పెట్టింది. ఎస్డీఎఫ్ పనుల్లో అవకతవకలపై ఫిర్యాదులు అందుతుండడంతో ఫీల్డ్​ లెవల్​లో ఎంక్వైరీ చేయించాకే వాటిని క్లియర్ చేసే అవకాశం కనిపిస్తున్నది.

రూ. 600 కోట్ల విలువైన చెక్కులు పెండింగ్​..

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్డీఎఫ్ కింద యాదాద్రి జిల్లాకు రూ.108.50 కోట్లతో 2,430 వర్క్స్ కేటాయించింది. పూర్తయిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల విలువైన 300కు పైగా చెక్కులను ఇ–కుబేర్​లో ఎంట్రీ చేయించగా, సెక్రటేరియెట్​లో పెండింగ్ పడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్డీఎఫ్ కింద రూ.300 కోట్లతో 4,218 వర్క్స్ మంజూరయ్యాయి. ఇందులో రూ.150 కోట్ల విలువైన 2వేల పనులు పూర్తికాగా, కేవలం రూ.40 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా గతేడాది జనవరి 18న జిల్లాలో పర్య టించిన అప్పటి సీఎం కేసీఆర్, ఎస్డీఎఫ్ కింద రూ.248.40 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పాత బిల్లులు క్లియర్​ చేయాలంటే ఈ కొత్త పనులు కూడా చేయాలని ఎమ్మెల్యేలు, అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చారు. వెంటపడి పనులను అప్పగించి హడావుడిగా చేయించారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్​ను కలిసి, తమకు రావాల్సిన ఎస్డీఎఫ్ బిల్లులను వెంటనే ఇప్పించాలని కోరారు. రాష్ట్రం మొత్తం ఇలా రూ. 600 కోట్ల విలువైన చెక్కులు సెక్రటేరియెట్​లో క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇష్టారాజ్యంగా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడంతో వాటిలో క్వాలిటీ లోపించింది. దీంతో కొత్త సర్కారు ఈ విషయంపై సీరియస్​గా ఉన్నట్లు తెలిసింది. వాటిని క్రాస్ వెరిఫికేషన్ చేసేదాకా చెక్కులు క్లియర్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్​ ఎస్డీఎఫ్ పనులపై ఆఫీసర్లను నివేదిక కోరినట్లు సమాచారం. పనులు ప్రారంభం అయ్యాయా? ఒకవేళ ప్రారంభమైతే ఎంత వరకు పూర్తయ్యాయి? ఎంత మేర బిల్లులు చెల్లించారు? వంటి వివరాలను తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. దీంతో తమ బిల్లులు క్లియర్​ అవుతాయో, లేదోనని కాంట్రాక్టర్లలో టెన్షన్ నెలకొంది.

ఎన్నికల్లో లబ్ధి కోసం..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం..రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డీఎఫ్ కింద నిధులు కేటాయించింది. దీనికి బడ్జెట్​లో రూ.10 వేల కోట్లు కేటాయించుకున్న ఆయన, ఏ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తే ఆ సెగ్మెంట్ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు.. రూ. 10 కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా ఫండ్స్​ శాంక్షన్ చేస్తూ పోయారు. ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి లోకల్ బాడీస్​లో తీర్మానాలు చేయించి సైడ్ డ్రెయిన్స్, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ తో పాటు గుళ్లు, మసీదులు, చర్చిల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

రూ.5 లక్షల వర్క్స్ ను నామినేషన్​ పద్ధతిలో కేటాయించే వెసులుబాటు ఉండడంతో పనులను ముక్కలుగా విభజించి, తమకు కావాల్సిన వారికి కేటాయించారు. ఎమ్మెల్యేలు ముందుగానే కమీషన్లు తీసుకోవడం, ఎన్నికల కోసం హడావుడిగా చేయడంతో పనుల్లో క్వాలిటీ పాటించలేదన్న ఆరోపణలున్నాయి. పనులు పూర్తయిన చోట్ల బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సెక్రటేరియెట్ వెళ్లిన చెక్కులు.. వెళ్లినట్టే అక్కడే ఆగిపోతున్నాయి.