బీఆర్ఎస్​ భూ సంతర్పణపై ఎంక్వైరీ షురూ

బీఆర్ఎస్​ భూ సంతర్పణపై ఎంక్వైరీ షురూ
  •     జర్నలిస్ట్​ కాలనీలోనూ అనర్హులున్నట్లు ఆరోపణలు
  •     విచారణకు ఆదేశించిన రాష్ట్ర సర్కార్
  •     ఫీల్డ్​ ఎంక్వైరీ మొదలు పెట్టిన స్పెషల్​ ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు : బీఆర్ఎస్​ భూ సంతర్పణపై ఎంక్వైరీ మొదలైంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు కాకుండా కార్లు, బంగ్లాలు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు, వారి బంధువులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ముసుగులో నాన్​ జర్నలిస్టులకు అడ్డగోలుగా డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పేషీకి కూడా ఇవే ఇష్యూలపై ఎక్కువగా కంప్లైంట్లు, దరఖాస్తులు వస్తుండడంతో సీరియస్​గా దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు విచారణకు ఆదేశించింది.

ఇండ్లు, ప్లాట్ల కేటాయింపులో.. 

మహబూబ్​నగర్​ నియోజవర్గంలోని దివిటిపల్లి, ఆదర్శనగర్​లో గత ప్రభుత్వ హయాంలో 1,334 డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు నిర్మించారు. ఇందులో ఒక్క దివిటిపల్లి వద్దే 1,024 ఇండ్లు కట్టారు. అయితే, ఎన్​హెచ్​-44కు పక్కనే ఈ నిర్మాణాలు ఉండడంతో వీటికి డిమాండ్​ బాగా ఉంది. ఈ ప్రాంతంలో గజం విలువ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పైమాటే. గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు ఇండ్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఇక్కడ కేటాయించిన ఇండ్లకు ఇప్పటి వరకు అధికారికంగా ఒక్కసారే లక్కీ డ్రా తీసి వంద మంది అర్హులకు పట్టాలు అందించారు.

మిగతావన్నీ అక్రమ కేటాయింపులే కావడం గమనార్హం. ప్రధానంగా మహబూబ్​నగర్​ మున్సిపాల్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు ఇక్కడి ఇండ్లను అమ్ముకున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ఇంటికి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు టాక్​.  అలాగే ఆ పార్టీ లీడర్లు, వారి అనుచరులు, కార్యకర్తలు, బంధువులు, లీడర్ల ఇండ్లల్లో పని చేసిన వారికి ఇండ్లను కట్టబెట్టినట్లు విమర్శలున్నాయి. వీరన్నపేట (కేటీఆర్​ కాలనీ)లో 640 ఇండ్లు కట్టించగా, ఇక్కడ కూడా అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొందరు బీఆర్​ఎస్ లీడర్లు, మున్సిపల్​ కౌన్సిలర్లు ఇండ్లను కొందరికి అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనర్హులకు ఇండ్లు కేటాయించారని గతంలో ప్రజావాణిలోనూ అర్హులు ఫిర్యాదులు కూడా చేశారు.

ఎంక్వైరీకి స్పెషల్  టీం..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు. ఇటీవల​ 18 మంది ఆఫీసర్లను ఎంక్వైరీ కోసం నియమించారు. డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వారిని ఆదేశించారు. ఈ  మేరకు వారు ఐదు రోజులుగా దివిటిపల్లి వద్ద ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారుల ఇండ్ల పట్టాలు పరిశీలిస్తున్నారు. ఇండ్లు కేంటాయించిన వారే అందులో నివాసం ఉంటున్నారా? వేరే వ్యక్తులకు అద్దెకు ఇచ్చారా? ఒకే వ్యక్తి పేరు మీద ఇండ్లు ఏమైనా ఉన్నాయా? కేటాయించిన ఇండ్లు తాళాలు వేసి ఉన్నాయా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో ఈ నివేదికను కలెక్టర్​కు అందజేయనున్నారు. ఇక్కడ విచారణ పూర్తయిన వెంటనే ఆఫీసర్లు జర్నలిస్ట్​ కాలనీలో కూడా ఎంక్వైరీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

అర్బన్​ తహసీల్​ ఆఫీస్​ కేంద్రంగా..

దివిటిపల్లి, జర్నలిస్ట్​ కాలనీల్లో డబుల్​ బెడ్రూమ్  ఇండ్ల కేటాయింపుపై పైరవీలు నడిచినట్లు ఆరోపణలున్నాయి. ప్రధానంగా అర్బన్​ తహసీల్దార్  ఆఫీసులో పని చేసిన కొందరు ఆఫీసర్లు ఇందులో కీ రోల్​ పోషించారనే టాక్​ ఉంది. సదరు ఉద్యోగుల వద్దకు వెళితే డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పని అయిపోతుందనే స్థాయికి వారి అవినీతి చేరిందనే ఆరోపణలున్నాయి. దీనికితోడు ‘సార్’ ఎవరి పేరు చెబితే వారికి అప్పనంగా పట్టాలు ఇచ్చేయడమే వీరి డ్యూటీగా సర్కారు నౌకరి వెలగబెట్టారనే విమర్శలున్నాయి. ‘సార్’ కాకుండా లీడర్ల పైవరీలతో వస్తే వారితో కొంత మొత్తంలో ఒప్పందం చేసుకొని పట్టాలు ఇచ్చారనే టాక్​ ఉంది.

ఆఫీసర్లు ఏమంటున్నారంటే..

ఇళ్ల కేటాయింపుపై మహబూబ్​నగర్​ అర్బన్​ తహసీల్దార్​ రాధాకృష్ణను వివరణ కోరే ప్రయత్నం చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు. రూరల్​ తహసీల్దార్​ సుందర్​రాజును వివరణ కోరగా దివిటిపల్లిలోని ఇండ్లు అర్బన్  రెవెన్యూ పరిధిలోకి వస్తాయని సమాధానమిచ్చారు. రూరల్​ మండలంలో డబుల్  బెడ్రూమ్​ ఇంటి పట్టాలు ఎవరికీ ఇవ్వలేదన్నారు. అప్లై చేసుకున్న వాళ్లు అర్హులా? కాదా? అని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు.

అర్హులైన జర్నలిస్టులకూ అన్యాయం..

జిల్లా కేంద్రంలోని ఎస్​వీఎస్​కు సమీపంలో ఉన్న సర్వే నంబర్​ 25లో జర్నలిస్ట్​ కాలనీని నిర్మిస్తున్నారు. ఈ కాలనీలో ప్లాట్ల కేటాయింపుల్లో కూడా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అర్హులైన జర్నలిస్టులకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలోని ఓ మాజీ మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు, ఆయనకు సహకరించిన జర్నలిస్టులకు, అడ్వర్​టైజ్​మెంట్​ డిపార్ట్​మెంట్​కు చెందిన వారికి, ఆయన వద్ద పని చేసిన ఫొటోగ్రాఫర్లకు, కొందరు కార్యకర్తలకు, మరికొందరు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు ఈ ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలున్నాయి.

అక్రిడిటేషన్​ కార్డుల ఆధారంగా కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మెజార్టీ ప్లాట్లు కట్టబెట్టారు. దీనికితోడు గత ప్రభుత్వ పనితీరుపై, లీడర్ల అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రజా సమస్యలపై కథనాలు రాసిన జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారు.