యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే పులిహోరలో ఎలుక వచ్చిందన్న వార్తలపై ఆఫీసర్లు విచారణ చేపట్టారు. ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి శనివారం యాదగిరిగుట్టకు వచ్చి ప్రసాదాలు, పులిహోర తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రసాదాల తయారీ ఎలా ఉంది, పులిహోరలో ఎలుకలు పడడానికి అవకాశం ఉందా ? అనే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పులిహోరలో ఎలుక వచ్చిందని సోషల్ ప్రచారం కావడంతో విచారణకు వచ్చామని, ఈ విషయంపై భక్తులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. పులిహోర తయారీ మొత్తాన్ని పరిశీలించామని, అందులో ఎలుక పడే అవకాశమే లేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో పులిహోర ప్యాకెట్, గడ్డిలో ఎలుక ఫొటో వేర్వేరుగా ఉన్నాయన్నారు. పులిహోర ప్యాకెట్ సేల్ అయిన తర్వాత ఈ ఇష్యూ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆమె వెంట ఆలయ ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ, సూపరింటెండెంట్ రాజన్ బాబు ఉన్నారు.