
- భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అరేబియా సముద్రంలో మోహరింపు
ముంబై: పహల్గాం దాడి వల్ల భారత్-, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత నౌకాదళం.. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను అరేబియా సముద్రంలో మోహరించింది. కర్నాటకలోని కర్వార్ తీరంలో ఈ నౌక పహారా కాస్తున్నట్లు రక్షణ వర్గాలు శుక్రవారం ధ్రువీకరించాయి. పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిసైల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా.. భారత్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను కర్వార్ తీరం వద్ద మోహరించింది. ఈ నౌక 262 మీటర్ల పొడవు, 45 వేల టన్నుల బరువు కలిగి ఉండి.. 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు.
పాకిస్తాన్‌లోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవులను సులభంగా టార్గెట్ చేసుకోగలదని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మిగ్-29కే యుద్ధ విమానాలు, బరాక్ ఎన్జీ ఉపరితల~-గగన క్షిపణులు ఉన్నాయని వివరించారు. ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాలను 60% వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తున్నారు.