కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో చనిపోయిన జెర్రి, పురుగులు కనిపించాయి. ఆదివారం హైదరాబాద్ కు చెందిన భక్తులు పులిహోర కొనుగోలు చేయగా అందులో చనిపోయిన జెర్రి, పురుగులు కనిపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తామని అలాంటి ప్రసాదంలో పురుగులు ఏంటని ప్రశ్నించారు. ఇరవై రూపాయల పులిహోర ప్యాకెట్లో 200 గ్రాముల ప్రసాదం అమ్మాల్సి ఉండగా అది 150 నుంచి 160 గ్రాములు మాత్రమే ఉంటుందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రసాదం క్వాంటిటీ, నాణ్యత తగ్గిందని భక్తులు మండిపడుతున్నారు. ఆలయంలోని మల్లన్న గుట్టపై గతేడాది కొబ్బరికాయలు అమ్ముకొనే హక్కును పొందిన బుడిగే రమేశ్ రూ.3 లక్షలు చెల్లించకపోవడంతో లాయర్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు ఈవో బాలాజీ తెలిపారు.