
సిబి మణివణ్ణన్. చెక్క గానుగ నూనెల బిజినెస్ చేస్తున్నాడు. ఈ మధ్య ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయిలే అనుకుంటుంటే కనుక మీ ఆలోచనకు అక్కడితో ఫుల్స్టాప్ పెట్టేయాలి. ఎందుకంటే తను ఉంటున్న కాలనీలో ఒక మూల చెక్కగానుగ షాప్ పెట్టుకుని కూర్చోలేదు. ఇండియన్ కిచెన్స్లోకి మళ్లీ ఆ పాత నూనెల రుచులను చేర్చాడు. అంతేనా ప్రపంచమంతా చెక్కగానుగ నూనెల సరఫరా చేస్తున్నాడు.
తమిళనాడులోని త్రిచ్చీకి చెందిన మణివణ్ణన్ చిన్నప్పుడు అమ్మ వేసిపెట్టే దోసెలు ఎంతో ఇష్టంగా తినేవాడు. చిన్నప్పుడెప్పుడో అమ్మ వేసిన దోసెల్ని తిన్న విషయం గుర్తుకొస్తే ఆ రుచి, వాసన మనసును తడుముతాయి. 30 ఏండ్ల తర్వాత కూడా అదే పిండి, అదే దోసె... కానీ అంత రుచిగా ఎందుకు ఉండట్లేదు? ఇదే ప్రశ్న అతన్ని చెక్కగానుగ నూనెల తయారీ వైపు మళ్లించింది. రోబోటిక్ ఇంజినీర్ అయిన సిబి నాలుగేండ్లలో ఎనిమిది కోట్ల విలువ చేసే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బిజినెస్‌ను విస్తరించగలిగాడు. ఆ జర్నీ గురించి తన మాటల్లోనే...
నా బిజినెస్ గురించి చెప్పేముందు మా తాత గురించి చెప్పాలి. మా తాత 1960–70ల మధ్యలో చెక్క గానుగ నూనెను తయారుచేసి మా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మేవాడు. గానుగలో పల్లీ, కొబ్బరి, పొద్దుతిరుగుడు గింజల్ని నలగ్గొట్టి నూనె తీసేవారు. ఆ నూనెను వేడిచేయకుండానే ప్యాక్ చేసి అమ్మేవారు.1990 చివర్లో కమర్షియల్ బ్రాండ్ నూనెలు మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడ్డాయి. దాంతో ట్రెడిషనల్ నూనె తయారుచేసేవాళ్ల పనిమీద దాని ఎఫెక్ట్ పడింది. అలా వాళ్లంతా వేరే బిజినెస్‌ల్లోకి మారిపోయారు.
మా నాన్న ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ బిజినెస్ వైపు మళ్లాడు. మా కుటుంబం మాత్రం ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లకి గానుగ నూనె తయారుచేసి ఇస్తూనే ఉంది. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్‌లో నా గ్రాడ్యుయేషన్ 2015లో పూర్తయింది. ఆ తరువాత ఫ్యామిలీ బిజినెస్ అయిన ఆటోమొబైల్ డీలర్షిప్స్, రెస్టారెంట్ నడిపే పనులు చేయడం మొదలుపెట్టా. రెస్టారెంట్ కోసం బల్క్‌లో నూనెలు కొనడానికి ఒకసారి మార్కెట్‌కి వెళ్లా. అప్పుడు ఆ నూనెల్లో కెమికల్ సాల్వెంట్స్‌ను ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు, కల్తీ జరుగుతున్నట్టు గమనించా. తక్కువ రేటుకు దొరికే పామాయిల్, పత్తి నూనెలను వంటనూనెల్లో కలిపి ఎలా కల్తీ చేస్తున్నారో స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా పల్లీ నూనెలో 80 శాతం కాటన్ సీడ్ ఆయిల్ లేదా రైస్ బ్రాన్ ఆయిల్ కలుపుతున్నారు.
వామ్మో! ఇలాంటి నూనెలతో వండుకుని తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాక ఏమొస్తాయి? అనిపించింది. అప్పుడు నాకు మా తాత మంచి వంటనూనెను స్టోన్ మిల్‌తో తయారుచేసే విషయం గుర్తుకొచ్చింది. రెండు తరాల క్రితమే లోకల్‌గా స్టోన్ మిల్స్, మినిమల్ ప్రాసెస్‌లో ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఆరోగ్యకరమైన నూనె తయారుచేశారు. ఆ నూనెలను ప్రాసెస్ చేయడం తక్కువే. అలాగే నిల్వ ఉండడం కోసం ఏ పదార్థాలు కలిపేవారు కాదు. అందుకే ఆ నూనెలతో వండిన వంటకాలు రుచిగా ఉండేవి. ఆ రుచులు ఒక జ్ఞాపకంగా ఉండకూడదు. వాటికి జీవం పోయాలి అనుకున్నా. మా తాతకు జ్ఞాపకంగా, రిఫైన్డ్ ఆయిల్స్‌కి ఆల్టర్నేటివ్గా ‘ గ్రామియా’ను 2017లో నా కాలేజీ ఫ్రెండ్స్ మొహమ్మద్ యాసీన్, నవీన్ రాజంరన్తో కలిసి మొదలుపెట్టా.
ట్రెడిషనల్ ఆయిల్ మేకింగ్‌కు మోడర్న్ టచ్
గానుగ నూనెల తయారీకి ఆటోమేషన్ తోడవడం వల్ల తయారీలో వేగం, శుభ్రత పెరిగాయి. ఆటోమేటెడ్ ఆయిల్ మేకింగ్ మెషిన్‌ను ట్రయల్ అండ్ ఎర్రర్‌గా తయారుచేశా. రెండేండ్లు రీసెర్చ్ చేసి మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్‌ను ఫైనలైజ్చేశా. నూనె తీయడానికి వాడే రాళ్లను సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్అప్రూవల్ తీసుకున్నాక క్వారీల నుంచి తెప్పించా. 2018లో దుబాయిలో ‘గల్ఫుడ్’ ఎగ్జిబిషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ యుఎస్‌కి చెందిన ఒకతనితో పరిచయం అయింది. అతను జ్యూస్, డెయిరీ బాక్స్‌లు, క్లీనింగ్ సొల్యూషన్స్ ప్యాకేజింగ్ మెటీరియల్స్‌లో స్పెషలైజేషన్ చేశాడు. ఆయన తయారుచేసిన కార్టన్స్‌లో గ్రామియాలో తయారుచేసిన నూనెలు పోయొచ్చని శాంపిల్‌గా కొన్ని కార్టన్స్ తెచ్చి వాటిలో నూనెలు నింపాడు.
అయితే అది పేపర్ ప్యాకేజింగ్ కావడం వల్ల పేపర్ నూనెలు పీల్చుకుంది. వాటితో లాభం లేదనిపించింది. ఆ తరువాత జర్మనీకి చెందిన పేపర్ మాన్యుఫాక్చర్ నుంచి మెటీరియల్ తెప్పించా. ఆయన రెండు నెలలపాటు ఎకో ఫ్రెండ్లీ, డ్యూరబుల్ డిజైన్ కోసం శ్రమపడ్డాడు. టేబుల్‌టాప్ ప్యాకింగ్ మెషిన్స్ను యుఎస్ నుంచి తెప్పించి చివరకు ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాకేజ్ కార్టన్స్‌ను ఫైనల్ చేశాం. ఇప్పుడు ఈ ఆయిల్ డబ్బాను రీసైకిలింగ్ యూనిట్‌కి మీరు ఇచ్చేయొచ్చు. వాళ్లు కార్టన్ బయటి పేపర్ ప్యాకేజింగ్‌ను తీసి, లోపల ఉన్న అల్యూమినియంను తిరిగి వాడతారు. క్యాప్ ఒక్కటే ప్లాస్టిక్ మెటీరియల్.
అందుకే అక్కడ మొదలుపెట్టాం
త్రిచ్చీలో అయితే అగ్రికల్చర్‌కి దగ్గరగా ఉంటుంది. ఫ్రెష్, రా మెటీరియల్స్ దొరుకుతాయి అనుకున్నాం. అంతేకాకుండా అక్కడి వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది. అది మా ప్రాసెస్‌కు చాలా అవసరం. గింజల నుండి నూనె తీసేముందు వాటిని ఎండపెట్టడానికి బాగుంటుంది. తమిళనాడు, రాజస్తాన్, కేరళ నుంచి తక్కువ తేమ ఉన్న గింజలు తీసుకొస్తాం. నిజానికి చాలా ఆయిల్ కంపెనీలు తక్కువ ధరకు తేమ తీయని గింజలు కొని వాడుతుంటాయి. రేటు ఎక్కువైనా మేం మాత్రం తక్కువ తేమ ఉన్న గింజలనే తెస్తాం. వాటిని ఒక రోజంతా ఎండపెడతాం. మా ప్రాసెస్ చెప్పేముందు రిఫైన్డ్ నూనెలు ఎలా తయారుచేస్తారో మీకు తెలియాలి.
రిఫైన్డ్ నూనెలు తయారీకి రెండు పద్ధతులు వాడతారు. అవి ఎక్స్పెల్లర్ అండ్ సాల్వెంట్ ఎక్స్ ట్రాక్షన్ అని రెండు పద్ధతులు. ఎక్స్పెల్లర్ పద్ధతిలో గింజలను వేగించి, హై స్పీడ్ మెషిన్లో నలగ్గొడతారు. నూనె బయటకు వచ్చేప్పటికి దాని టెంపరేచర్ 120 డిగ్రీలు ఉంటుంది. అంత టెంపరేచర్లో ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలుచేసే వాల్యూస్ అన్నీ పోతాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో కెమికల్ సాల్వెంట్స్‌ను కలిపి గింజల్లో ఫ్యాట్స్ తీసేస్తారు. నూనె టెంపరేచర్ ఎందుకు పెంచుతారంటే నూనె క్వాంటిటీ పెంచుకునేందుకు. ఎక్కువ వేడిచేస్తే నూనెలోని ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ విడిపోయి క్వాంటిటీ పెరుగుతుంది. ఇలాంటి నూనె కార్డియోవాస్కులార్ రిస్క్‌ను పెంచుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ వాళ్లు 2022 లో చేసిన ఒక స్టడీ ప్రకారం ఇలాంటి ప్రాసెస్ వల్ల గింజల్లో ఉన్న సహజ సిద్ధమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పోతాయి. ఫైనల్‌గా వచ్చిన ప్రొడక్ట్‌లో ఫ్లేవర్ ఉండదు. ఆరోగ్యానికి ఎటువంటి లాభం లేదని చెప్పింది.
గ్రామియాలో ఇలా...
అదే కోల్డ్ ప్రెస్డ్లో అయితే రాయి, చెక్క రోకలి వాడతారు. ఇదివరకు రోజుల్లో ఎద్దుకి కాడె వేసి తిప్పే నూనె మిల్లుల మెథడ్ మేం వాడేది. ఈ పద్ధతిలో చెక్క రోకలి నిమిషానికి 19–20 సార్లు చాలా నెమ్మదిగా తిరుగుతుంది. దీనివల్ల నూనె టెంపరేచర్ 50 డిగ్రీలకు మించదు. అందుకే పోషకాలు, సువాసన, సాంద్రత ఎక్కడికీ పోవు. ఈ ప్రాసెస్ అంతా ఆటోమేషన్ చేయడం వల్ల ఒక్కో వ్యక్తి 20 కేజీల గింజలను ముప్పావుగంటలో నలగ్గొట్టగలుగుతున్నాడు. నూనె బయటకు వచ్చిన తరువాత దానిలో ఉండే చెత్తను వడకట్టేందుకు కాటన్ ఫిల్టర్ ఉంటుంది.
శుభ్రమైన ఆ నూనె ట్యాంక్‌లోకి పంపి, ఆ తరువాత ప్యాకేజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ ప్రాసెస్‌లో స్టీల్ గ్రైండర్స్, స్టీం బాయిలర్స్ వాడతాం. నూనె తీశాక మిగిలే ఆయిల్ కేక్స్‌ను గోలీల్లా మార్చి తమిళనాడులో ఉన్న డెయిరీ ఫామ్స్‌కు పంపిస్తాం. అక్కడ పశువులకు పెడతారు. అలాగే పౌల్ట్రీ ఫామ్స్‌లో ఆహారంగా కూడా వాడుతున్నారు. ఆయిల్ కేక్స్‌ను నలగ్గొట్టి ఆర్గానిక్ ఫార్మర్స్‌కి ఇస్తే... వాళ్లు ఫెర్టిలైజర్‌గా వాడుతున్నారు.
పల్లీ, నువ్వుల నూనెల షెల్ఫ్ లైఫ్ ఒక ఏడాది ఉంటుంది. కొబ్బరి నూనె అయితే ఆరు నెలలలోపు వాడాలి. మేం తయారుచేసే నూనెలు చిక్కగా ఉంటాయి. దానివల్ల వంటకాల్లో తక్కువ నూనె పడుతుంది. వేపుళ్లు చేసేటప్పుడు ఈ విషయం మీకు బాగా తెలుస్తుంది. ఐదు లీటర్ల రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ కంటే ఎక్కువ రోజులు మా బ్రాండ్ నాలుగు లీటర్ల కాంబో వస్తుంది. ప్రస్తుతానికి మా బ్రాండ్‌లో నుండి పల్లీ నూనె బెస్ట్ సెల్లర్. లీటర్ 410 రూపాయలు. కొబ్బరి, నువ్వుల నూనెలు 440 నుంచి 620 రూపాయల వరకు ఉన్నాయి. కనగయం జాతి ఆవుల నుంచి తీసిన ఎ2 నెయ్యిని 500 మిల్లీ లీటర్లు 990 రూపాయలకు అమ్ముతున్నాం.
మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ కంటే మా ప్రొడక్ట్స్ రేటు ఎక్కువనే విషయం మేం కూడా అంగీకరిస్తాం. అందుకు కారణం లేకపోలేదు. ఎక్స్పెల్లర్ పద్ధతిలో ఒక కేజీ రా మెటీరియల్‌కి 500 మిల్లిలీటర్ల నూనె తీయొచ్చు. కానీ మా ట్రెడిషనల్ పద్ధతిలో అదే మోతాదు రా మెటీరియల్‌కి 300 మిల్లీ లీటర్ల నూనె మాత్రమే వస్తుంది. అందుకే మా ప్రొడక్ట్స్ రేట్లు కాస్త ఎక్కువ. అయితే కమర్షియల్‌గా తయారవుతున్న మిగతా నూనెలతో పోలిస్తే మా నూనెలు హెల్దీ. నూనె వాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకే నూనెని ఎక్కువ కాలం వాడకూడదు. ఒక నూనె వాడాక మరొక నూనె వాడడం అనేది మంచి పద్ధతి.
సక్సెస్ హైవే
చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీల్లో మైక్రో వేర్‌హౌజ్‌లను తెరిచాక లాభాలు పెరిగాయి. మామూలుగా అయితే ఇతర బ్రాండ్లకు ఒకటే వేర్‌హౌజ్ ఉండి, పాపులర్ డెలివరీ పార్ట్‌నర్స్‌తో కలిసి ప్రొడక్ట్‌ను డెలివరీ చేస్తాయి. మైక్రో వేర్‌హౌజ్‌ల వల్ల ఆర్డర్ వచ్చిన మరుసటి రోజు డెలివరీ చేయగలుగుతున్నాం. అదికూడా లోకల్ డెలివరీ కంపెనీల సాయం తీసుకుని. ఎక్కువమంది కస్టమర్లు ప్రొడక్ట్ కొనడంతో డెలివరీ కాస్ట్ కూడా తగ్గిపోయింది. మా పొడ్రక్ట్కి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ)22000, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) ఆమోదం 2020లో వచ్చింది.
యుఎస్‌లో దక్షిణాది వాళ్లు ఎక్కువగా ఉండే న్యూ జెర్సీ, మిడిల్ ఈస్ట్‌లో లులు మార్కెట్స్‌లో ప్రొడక్ట్ సేల్ బాగుంది. ప్రతి నెలా యుఎస్‌కి పాతికవేల లీటర్లు పంపిస్తున్నాం. దాదాపు 50 లక్షల రూపాయలు నెలకి ఎక్స్‌పోర్ట్స్ ద్వారానే వస్తుంది. మిగతా సగం ఇక్కడి అమ్మకాల్లో వస్తుంది. కెనడా, యుకె, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేసియాల్లో ఉన్న ఎన్ఆర్ఐల కోసంమార్కెట్ విస్తరించే ఆలోచనలో ఉన్నాం. ఏడాది కాలంగా స్టార్ హోటల్స్, ఆయుర్వేద హాస్పిటల్స్ క్యాంటీన్స్ వాళ్లు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అడయార్ ఆనంద భవన్ వాళ్లు కూడా ఒక్కో అవుట్ లెట్‌కు వంద లీటర్ల ఆయిల్ తీసుకుంటున్నారు. అమెజాన్, జియోమార్ట్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి ఇ–కామర్స్ వెబ్‌సైట్స్‌లో కూడా మా ప్రొడక్ట్ ఉంది.
ప్రస్తుతం రెండింట మూడో వంతు ఆదాయం మా వెబ్సైట్ నుంచి వస్తుంది. మా కీ– డెలివరీ పార్ట్నర్ డున్జో. కొవిడ్–19 ప్యాండెమిక్ అప్పుడు ఆఫ్‌లైన్ స్టోర్‌లో కొనే మా పాత కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకు డున్జో చాలా బాగా పనిచేసింది. చెన్నయ్‌లో అమ్మా నాన్న సూపర్మార్కెట్లో, బెంగళూరులోని కొన్ని స్టోర్స్‌లో మా ప్రొడక్ట్స్ ఉంచాలనుకుంటున్నాం. దక్షిణాదిన సక్సెస్ అయింది. ఇక ఉత్తర భారత్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆముదం నూనె తయారీని లాంచ్ చేస్తున్నాం. ఇవేకాకుండా సెకండరీ ఆయిల్స్ అయిన వేప, అవిసె, మునగ నూనెలు తయారుచేసే ఆలోచనలో ఉన్నాం” అని చెప్పాడు సిబి.