- ‘దళితబంధు’పై నిలదీస్తారని ముందస్తు అరెస్టు
- పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
- ఉదయం తీసుకెళ్లి, సాయంత్రం విడుదల
కరీంనగర్/ కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‍లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి భారీ పోలీస్ పహారా మధ్య జరిగింది. దళిత బంధు పథకం అమలు కావడం లేదంటూ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వందల మంది బాధితులు గత సోమవారం ప్రజావాణికి వచ్చారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆఫీసర్ల ముందు నిరసన తెలిపారు. దీంతో మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజావాణికి వచ్చే వారిని స్క్రీనింగ్ చేసేలా అధికారులు మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులను మొహరించారు. జిల్లా నుంచి వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చిన వారందరి వినతిపత్రాలు చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు.
ప్రజావాణికి వస్తే.. తనిఖీలా?
దరఖాస్తుదారులు వెంట తెచ్చుకున్న ప్రతీ సంచినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. సమస్యను చెప్పుకుందామని వస్తే.. ఈ తనిఖీలేంటని అధికారులను ప్రశ్నించారు. కాగా దళిత బంధు కోసం విన్నవించేందుకు వచ్చిన వారి వినతిపత్రాలు చూసిన సిబ్బంది ఆడిటోరియం తలుపు దగ్గరే వారిని నిలిపేశారు. దీంతో అధికారులకు, బాధితులకు వాగ్వాదం జరిగింది. అందరి వినతిపత్రాలు పూర్తయిన తర్వాతే దళిత బందు బాధితులను లోనికి అనుమంతించారు. ప్రజావాణికి మొత్తం 366 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిలో ఎస్సీ కార్పొరేషన్ కు చెందినవి 125, మున్సిపల్ కార్పొరేషన్ కు 29, ఇతర శాఖలకు సంబంధించి 212 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు.
ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి..
సిరిసిల్ల కలెక్టరేట్: -ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సంబందిత ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం వివిధ సమస్యలపై 42 ఫిర్యాదులు అందాయన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజాదివాస్ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 11 దరఖాస్తులను వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆయా కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ సత్య ప్రసాద్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి.శ్రీనివాస రావు, జిల్లా అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
బీసీల సమస్యలను పరిష్కరించాలి
జగిత్యాల: బీసీల సమస్యలను పరిష్కరించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ సంబారి మహేశ్కోరారు. సోమవారం జగిత్యాల ఐఎంఏహాల్ ఎదుట నిరసన తెలిపి ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రం బీసీ కుల లెక్కలు తీయమంటే కుంటిసాకులు, సాంకేతిక లోపాలు వెతుకుతోందని వాపోయారు. రాష్ట్రంలో 4 ఏళ్ల క్రితం బీసీ రుణాల కింద 5 లక్షల 45 వేల మంది దరఖాస్తు చేసుకుంటే అంతవరకు ఇవ్వలేదని అరోపించారు. కార్యక్రమం లో సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్, సీపీఐ నాయకులు రాములు, శాంత, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో బాధితులు..
గత వారం కలెక్టరేట్‍లో పురుగుల మందు డబ్బాలతో దళితబంధు బాధితులు నిరసన తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన రామంచ రాకేశ్, ఇల్లందకుంటకు చెందిన మారుముళ్ల ప్రశాంత్, సిరిసేడు గ్రామానికి చెందిన రేణికుంట్ల రాజశేఖర్ ను సోమవారం తెల్లవారుజామునే వారి ఇళ్లకువెళ్లి అరెస్టు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు పంపించారు. ప్రజావాణికి వెళ్లి సమస్యలు, గోడు చెప్పుకందామంటే అరెస్టు చేయడమేంటని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు ఇవ్వాలని అధికారులను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని వాపోయారు.