హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్‎లో బొద్దింకలు, ఎలుకలు

హైదరాబాద్‎లో వరుస ఆహార కల్తీ ఘటనల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఆదివారం (నవంబర్ 10) ఉదయం హబ్సిగూడ, నాచారంలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‎లో తనిఖీలు చేసిన అధికారులు.. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్‎లో బొద్దింకలు, ఎలుకలు తిరగడం చూసి అధికారులు షాక్ అయ్యారు. కాలం చెల్లిన ఫుడ్ ఇంగ్రిడియెంట్స్‎తో వంటకాలు చేస్తున్నట్లు గుర్తించారు. 

నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్‎ల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. కుళ్ళిపోయిన టమాటో, పొటాటో, ఎక్స్పైర్ అయిన పన్నీర్, మష్రూమ్ ప్యాకెట్లను గుర్తించి.. హోటల్ యజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దని సూచించారు.