వామ్మో హైదరాబాద్‎లో చాక్లెట్లు ఇలా తయారు చేస్తున్నారా..? తెలిస్తే తినరు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో కల్తీ ఫుడ్ తయారీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం నగరంలోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేస్తూ కల్తీ రాయుళ్ల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం (నవంబర్ 29) రాజేంద్రనగర్‎లోని స్కై ఫుడ్ ప్రొడక్ట్స్‎లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్లను అపరిశుభ్రంగా దుమ్ము ధూళి‎లోనే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 

మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ లేకుండానే ప్రొడక్ట్స్‎ను షాప్స్‎కు సప్లై చేస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 950 కిలోల కోకో పౌడర్, 75 కిలోల కలర్డ్ షుగర్ కోటెడ్ సోంపును అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్రొడక్ట్స్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‎కి పంపారు. అనంతరం నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.