ఖమ్మం కార్పొరేషన్​లో విజిలెన్స్ కలకలం!

  •     అంచనాలు పెంచి చేసిన పనులపై ఎంక్వైరీ  
  •     నిర్మాణ పనుల్లో నాణ్యత, రికార్డుల పరిశీలన 
  •     గోళ్లపాడు, బస్టాండ్, సివిల్​ వర్క్స్​ డాక్యుమెంట్ల సేకరణ
  •     సెలవుపై వెళ్లే ఆలోచనలో కొందరు​అధికారులు!

ఖమ్మం, వెలుగు : ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్​ బడ్జెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే మరోవైపు విజిలెన్స్​ ఆఫీసర్లు కార్పొరేషన్​ లోని వివిధ సెక్షన్లలో తనిఖీలు నిర్వహించారు. వరంగల్​ నుంచి వచ్చిన విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​ మెంట్ అడిషనల్​ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో 20 మంది సభ్యులు, నాలుగు టీమ్​లుగా విడిపోయి డాక్యుమెంట్లు, ఫైళ్లను పరిశీలించారు. పబ్లిక్​ హెల్త్, సివిల్ వర్క్స్​, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగాల్లో రికార్డులు తనిఖీ చేశారు.

ఖమ్మంలో కార్పొరేషన్​, సుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఫోకస్​ పెట్టారు. సీసీ రోడ్లు, సైడ్​ డ్రెయిన్లలో క్వాలిటీ పాటించడం లేదని గతంలోనే విపక్ష కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినా, అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వం మారడంతో తాజాగా అప్పటి ఫిర్యాదులపై ఎంక్వైరీ జరుగుతోందని తెలుస్తోంది. 

రూ.25 లక్షలకు మించిన పనులపై ఫోకస్​ 

ఖమ్మంలో మున్సిపల్​ కార్పొరేషన్​, ఎల్​ఆర్​ఎస్​ ఫండ్స్​, సీఎం అష్యూర్డ్ ఫండ్స్​, సుడా నిధులు, ఎస్డీఎఫ్​, ఇలా పలు గ్రాంట్లు, శాఖల ద్వారా వచ్చిన నిధుల ద్వారా జరిగిన పనులన్నింటిపై విజిలెన్స్​ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా రూ.25 లక్షలకు మించిన విలువతో చేపట్టిన పనులపై ఫోకస్​ పెట్టారు. ఇష్టం వచ్చినట్టుగా అంచనాలను పెంచి, అనుచరులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలున్నాయి. నాణ్యత లేకుండా పనులు చేపట్టి ఎస్టిమేట్లను పెంచారని, కార్పొరేషన్​ పరిధిలో డివైడర్లు, సెంట్రల్​లైటింగ్, రోడ్లు, డ్రెయిన్లు, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ల పనులు

ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మోడ్రన్​ ఫుట్​ పాత్ లు, సుడా పరిధిలో చేపట్టిన రోడ్ల పనులపై అధికారులు ఆరా తీస్తున్నారు. గోళ్లపాడు చానల్​ ఆధునికీకరణ పనులను ముందుగా రూ.70 కోట్లతో చేపట్టి, ఆ తర్వాత రూ.వంద కోట్లకు అంచనాలను పెంచడం, ఖమ్మం కొత్త బస్టాండ్​ నిర్మాణ పనులను రూ.36 కోట్లకు పెంచడం లాంటి వర్కులపై డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఒకటే కంపెనీ ఎక్కువ పనులను దక్కించుకోవడం, కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువ పనులు చేయడంపై కొందరు కార్పొరేటర్లతో పాటు, మాజీ కార్పొరేటర్లు కూడా విజిలెన్స్​ కు ఫిర్యాదు చేశారు.

ప్రధానంగా గత ఐదేళ్లలో జరిగిన పనులపై విజిలెన్స్​ అధికారులు దృష్టిసారించారు.  ఖమ్మం నగరంలో ఐదేళ్లలోనే 700 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు. ఇందుకోసం సుడా, ఎస్​డీఎఫ్​, సీఎం అష్యూరెన్స్, కార్పొరేషన్​ నిధులను కలిపి దాదాపు రూ.347 కోట్లు వినియోగించారు. మరో రూ.440 కోట్లతో సైడ్​డ్రెయిన్లు నిర్మించారు. ఆర్​ అండ్​ బీ, పీఆర్​ పనులను తనిఖీ చేసేందుకు ఆయా శాఖలకు క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్​ టీములున్నాయి. కార్పొరేషన్​ లో మాత్రం క్వాలిటీ కంట్రోల్​ (క్యూసీ) సిబ్బంది లేకపోవడంతో థర్డ్ పార్టీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

వాళ్లను కూడా మేనేజ్​ చేసి క్వాలిటీ తక్కువగా ఉన్న పనులను కూడా బిల్లులు చేయించుకున్నారని ఫిర్యాదులు అందాయి. టెండర్లు దక్కించుకున్న వారికి బదులు వేరొకరు పనులు చేసిన విషయాన్ని కూడా గత వారం విజిలెన్స్ ప్రాథమిక​ ఎంక్వైరీలో గుర్తించారు.  రెండు రోజుల పాటు ఖమ్మంలో ఉండి గత వారం ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన విజిలెన్స్​ అధికారులు, తాజాగా రికార్డులను తనిఖీ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఎంక్వైరీలకు సంబంధించి బాధ్యులైన మున్సిపల్​ అధికారులకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

అప్పటి అవకతవకలపై  ఇప్పుడు ఎంక్వైరీ..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుండడం కార్పొరేషన్​ ఆఫీసులో సంచలనంగా మారింది. కొందరు మున్సిపల్ అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సిబ్బందితో పాటు కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లలో కూడా ఈ తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.