క్వాలిటీ లేని కల్తీ ఫుడ్ తినడం వల్లే మన దేశంలో ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని నమ్మిన ఒక యువరైతు ప్రజలకు క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తనకున్న పదెకరాల్లో రసాయనాలు లేకుండా పంటలు పండిస్తున్నాడు. తోటి రైతులకూ సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తున్నాడు.
ఈ పద్ధతిలో కూడా రైతులు లాభాలు పొందొచ్చని నిరూపించాడు. బీటెక్ చదివి తోటి రైతులకు సాగు పాఠాలు నేర్పుతున్న క్యాస మధు తన వ్యవసాయ భూమిలో పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. అంతేకాదు అలా పండిన పంటలను ‘రైతువారధి’ అనే సంస్థ ద్వారా అవసరం ఉన్న వాళ్లకు నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నాడు.
కొన్నేండ్ల నుంచి అధిక దిగుబడుల కోసం చాలామంది రైతులు విపరీతంగా రసాయనాలు వాడారు. ఇప్పటికీ వాడుతున్నారు. అలాంటి పంటలు తింటున్నవాళ్లు అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కానీ.. కరోనా వల్ల చాలామంది ఆరోగ్య పాఠాలు నేర్చుకున్నారు. మంచిఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటామని మళ్లీ పాత పద్ధతులకు మారారు.
ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన పద్ధతుల్లో పండించిన ఫుడ్ తినేందుకు ఇష్టపడుతున్నారు. కానీ.. అలాంటి ఆహార ధాన్యాలు మార్కెట్‌లో సరిగ్గా దొరకడం లేదు. కొందరు రైతులు కష్టపడి సేంద్రియ పద్దతుల్లో పండించినా అవి వినియోగదారుడి దగ్గరకు చేరేలోపే దళారుల చేతిలో కల్తీ అవుతున్నాయి. అందుకే కెమికల్స్ లేని పంటలు పండించి, వాటిని నేరుగా వినియోగదారులకు చేర్చాలి అని నిర్ణయించుకున్నాడు మధు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన మధు బీటెక్ పూర్తి కాగానే కొంతకాలం ఉద్యోగం చేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి సేంద్రియ సాగుపై రీసెర్చ్ చేశాడు. వ్యవసాయాధికారులు, రిటైర్డ్ ఉద్యోగుల సలహాలు, సూచనలతోపాటు యూట్యూబ్లో వీడియోల ద్వారా సేంద్రియ సాగులో మెళకువలు తెలుసుకున్నాడు.
తనకున్న వ్యవసాయ భూమిలో సేంద్రియ సాగు మొదలుపెట్టాడు. అలా పండిన పంటలను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా నేరుగా కస్టమర్లకు అమ్ముతున్నాడు. అందుకోసం ‘రైతు వారధి’ని ఏర్పాటు చేశాడు. దీని ద్వారా రైతులకు, కస్టమర్లకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాడు.
ఇతర జిల్లాలకు సరఫరా
ప్రస్తుతం దాదాపు70 శాతం మంది రైతులు దొడ్డు రకం బియ్యమే పండిస్తున్నారు. 30 శాతం మంది మాత్రమే సన్నరకాలు పండిస్తున్నారు. అయితే... సన్న రకాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే కొందరు రైతులు రసాయనాలు ఎక్కువగా వాడుతూ ఎక్కువ దిగుబడి సాధించి లాభాలు పొందుతున్నారు. కానీ.. అవి తినేవాళ్ల ఆరోగ్యం పాడవుతోంది. ఇదే విషయాన్ని మధు తన సహచర రైతులకు అర్థమయ్యేలా వివరిస్తూ సేంద్రియ సాగు వైపు అడుగులు వేయిస్తున్నాడు.
రైతులకు సేంద్రియ సాగులో మెళకువలు నేర్పుతూ అధిక దిగుబడి సాధించేలా సాయం చేస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో పండించిన పప్పుదినుసులు, పసుపు, కూరగాయలతోపాటు కారంపొడిని అమ్ముతున్నాడు. వీటితో పాటు గానుగ నూనె, పచ్చళ్లు కూడా హోమ్ డెలివరీ చేస్తున్నాడు. ప్రస్తుతం జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ సర్వీస్లు అందిస్తున్నాడు.
నష్టాలు ఉండవు
సేంద్రియ వ్యవసాయంలో ఖర్చు చాలా తక్కువ. కానీ.. లాభాలు ఎక్కువగా వస్తాయి. పైగా సరైన పద్ధతుల్లో పండిస్తే దిగుబడి కూడా బాగానే వస్తోంది. సేంద్రియ ఉత్పత్తుల వల్ల రైతుతో పాటు ప్రజలు కూడా ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఒక రైతుగా ఎంతోమంది ఆరోగ్యం కాపాడిన వాళ్లమవుతాం. ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేవాళ్లు కాస్త ధర ఎక్కువైనా సేంద్రియ ఉత్పత్తులను కొంటున్నారు.
సేంద్రియ వ్యవసాయంలో భూసారం దెబ్బతినదు. కాబట్టి భవిష్యత్తులో దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. విరివిగా రసాయనాలు వాడి పండించిన పంటలతో ప్రజలు హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు చేస్తున్నారు. దానికి బదులు ధర కాస్త ఎక్కువగా అనిపించినా సేంద్రియ ఉత్పత్తులని తినడం మంచిది. అందుకే నా వంతుగా ‘రైతు వారధి’ ద్వారా బియ్యం, మిర్చి, కారం పొడి, పసుపు, పప్పు దినుసులు, కూరగాయలు, గానుగ నూనె, పచ్చళ్లు హోమ్ డెలివరీ చేస్తున్న. ప్రజల నుంచి
మంచి స్పందన వస్తోంది.
::: రాజేష్, జగిత్యాల, వెలుగు