ఉద్యోగం, సక్సెస్‌ల కోసం చాలామంది విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కానీ.. సమర్థత ఉంటే ఎక్కుడ ఉన్నా విజయం సాధించొచ్చు అని నిరూపించాడు శ్రీధర్ వెంబు. ప్రపంచంలోని చాలామంది పెద్ద నగరాల్లో నివసించాలి, విదేశాల్లో సెటిల్ కావాలి లేదా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తే.. అదృష్టవంతులని ఫీల్ అవుతుంటారు. కానీ.. అలాంటివన్నీ వదిలేసి.. అమెరికా నుంచి ఇండియాలోని ఓ పల్లెటూరికి వచ్చి కంపెనీ పెట్టాడు శ్రీధర్. ఇప్పుడు ఆ కంపెనీ విలువ తొమ్మిది వేల కోట్లకు పైమాటే.
శ్రీధర్ వెంబు తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగాడు. అక్కడే తమిళ మీడియంలో చదువుకున్నాడు.1989లో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరారు. ఆ తర్వాత ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో లెక్చరర్‌గా చేరాడు. కానీ.. ఆ ఉద్యోగం రెండు వారాలు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ 1994లో శాన్‌డియాగోలో ఉన్న ‘క్వాల్‌కాం’ కంపెనీలో ఉద్యోగం దొరికింది. వైర్‌లెస్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా రెండేండ్లు పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి ‘గుడ్‌బై’ చెప్పి, ఇండియా వచ్చేశాడు.
నలుగురు కలిసి..
శ్రీధర్ వెంబు దగ్గరి బంధువులు కుమార్ వెంబు, శేఖర్ వెంబు చెన్నయ్‌లో ఉండేవాళ్లు. చెన్నయ్ నుండి పని చేస్తున్న వీళ్లకు అమెరికాలో ఉంటున్న టోనీ థామస్ పరిచయం అయ్యాడు. వీళ్లు డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్స్‌ని టోనీ అమెరికాలో క్లయింట్లకి అమ్మేవాడు. ఈ క్రమంలో లాస్ వెగాస్ ట్రేడ్ షోలో ఒక సాఫ్ట్‌వేర్‌ని అమ్మడానికి ట్రై చేశాడు టోనీ. అందుకు అతనితో కలిసి పనిచేయమని శ్రీధర్‌ని అడిగాడు. కానీ.. అప్పటివరకు శ్రీధర్‌కు సేల్స్‌లో అనుభవం లేదు. ఆ రంగం గురించి అంతగా తెలియదు. అయినా.. ఒకసారి ట్రై చేద్దామని ఆ రంగంలోకి దిగాడు. బిజినెస్ కార్డులు ప్రింట్ చేయించి, ట్రేడ్ షోకి వెళ్లాడు. అతనికి మార్కెటింగ్ స్కిల్స్ లేకున్నా కొంతవరకు అమ్మకాలు చేయగలిగాడు. అలా శ్రీధర్ సేల్స్ పర్సన్‌గా మారాడు.
ఎవ్వరు చెప్పినా వినలేదు
శ్రీధర్‌కు సేల్స్‌లో వచ్చిన అనుభవంతో1996లో కుమార్, శేఖర్, టోనీలతో కలిసి ఒక కంపెనీ పెట్టాడు. దానికి ‘అడ్వెంట్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ ఇంక్’ అని పేరు పెట్టారు. ఇది ఒక నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్. దీనికి మొదట్లో టోనీ సీఈవో. కంపెనీ పెట్టిన కొత్తలో శ్రీధర్ ఉద్యోగం వదిలేసి ఇండియాకి రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. కుటుంబసభ్యులు శ్రీధర్‌కు నచ్చజెప్పి మళ్లీ అమెరికా పంపేందుకు ప్రయత్నించారు.
కానీ.. శ్రీధర్ ఎవరి మాటా వినలేదు. ఇండియాలోనే ఉండి వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాడు.1997 చివరి నాటికి కంపెనీ సేల్స్ బాగా పెరిగాయి. కంపెనీని డెవలప్ చేసేందుకు అప్పటివరకు వచ్చిన లాభాలను పెట్టుబడులుగా పెట్టారు. 1998 నాటికి వాళ్ల సేల్స్ విలువ పది లక్షల డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా 2000 సంవత్సరంలో టోనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నాడు. శ్రీధర్ వెంబు కంపెనీ సీఈవో అయ్యాడు. 2009 సంవత్సరంలో కంపెనీ పేరుని ‘జోహో కార్పొరేషన్’గా మార్చారు.
ఉద్యోగుల కోసం...
మామూలుగా అయితే కాలేజీల్లో మంచి ర్యాంక్‌తో పాసైన స్టూడెంట్స్‌ని ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకుంటాయి ఐటీ కంపెనీలు. కానీ.. వీళ్ల దగ్గర ఎక్కువ జీతాలు ఇచ్చే బడ్జెట్ లేదు. అందుకే కాలేజీ డ్రాపవుట్ స్టూడెంట్స్‌ని ఉద్యోగులుగా ఎంచుకున్నాడు. అలా రిక్రూట్ చేసినవాళ్లకు శ్రీధర్ స్వయంగా స్కిల్స్ నేర్పించి, కోడింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చి పని చేయించాడు. ఈ ప్లాన్ వల్ల పెట్టుబడి చాలావరకు తగ్గింది.
బయటి పెట్టుబడులు
కంపెనీ ఎదుగుతున్న క్రమంలో కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతోమంది ముందుకొచ్చారు. ముఖ్యంగా విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. కానీ.. శ్రీధర్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ చేసేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే.. అలా చేస్తే ఆ తర్వాత కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెట్టుబడిదారుల అనుమతి తీసుకోవాలి. కంపెనీ డెవలప్‌మెంట్ విషయంలో అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే ఉన్న డబ్బుతోనే కంపెనీని నడిపించాడు.
ఎన్నో దేశాలకు
జూన్ 2001 నాటికి జపాన్‌లో ఆపరేషన్స్ మొదలుపెట్టారు. కానీ.. తర్వాత కంపెనీ నష్టాలను చూడాల్సి వచ్చింది. 2002 నాటికి కస్టమర్ బేస్ చాలా తగ్గిపోయింది. అయినా ఎవరి సాయం లేకుండానే కంపెనీ బయటపడింది. 2005నాటికి మళ్లీ పాత రోజులు వచ్చేశాయి. దాంతో ‘జోహో రైటర్, జోహో షీట్స్, జోహో డాక్స్’ పేరుతో మరికొన్ని డిపార్ట్మెంట్స్ ఏర్పాటుచేశారు. 2015 నాటికి బిజినెస్25 రెట్లు పెరిగింది. ప్రస్తుతం కంపెనీకి 8 కోట్ల మంది కస్టమర్లు,12,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. అంతేకాదు.. కంపెనీ సేవలను150 కంటే ఎక్కువ దేశాల్లో అందిస్తున్నారు. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో 2,749 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది కంపెనీ. శ్రీధర్ వెంబు 2021లో భారతదేశంలోని సంపన్నుల్లో 55వ స్థానం దక్కించుకున్నాడు. జోహోలో అతనికి 88 శాతం వాటా ఉంది.
ఆఫీస్ కూడా ఊళ్లోనే ...
శ్రీధర్‌కు పల్లెలంటే చాలా ఇష్టం. గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే అతని కంపెనీని చెన్నయ్‌లో కాకుండా తమిళనాడులోని ‘తెన్‌కాసి జిల్లా మఠలంపరై’ అనే ఊళ్లో పెట్టాడు. దీనివల్ల ఉద్యోగులకు లివింగ్ కాస్ట్ తగ్గుతుంది. కంపెనీ ద్వారా ఆ గ్రామస్తులకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘కంపెనీని సిటీలో పెట్టి, ఉద్యోగులను మాత్రం గ్రామాల నుంచి రిక్రూట్ చేసుకుంటుంటారు. దానివల్ల వాళ్లంతా సిటీకి మకాం మార్చేస్తారు. అలా చేయడం వల్ల గ్రామాల నుండి నగరాలకు వలసలు పెంచినట్టు అవుతుంది. ఆ పరిస్థితిని మార్చాలనే గ్రామంలో కంపెనీ పెట్టాం. కాకపోతే.. కంపెనీ పెట్టే గ్రామంలో మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకున్నాం” అన్నాడు. తెన్‌కాసిలో మొదట చిన్న ఆఫీసుని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న మఠలంపరై ప్రాంతంలో ఒక పాత ఫ్యాక్టరీని కొని, దాన్ని కాంప్లెక్స్‌గా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ 500 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్
పిల్లలకు సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్‌ని పెట్టాలనేది శ్రీధర్ కల. అందుకోసం 2005లో ‘జోహో స్కూల్స్’ మొదలుపెట్టారు. ఇక్కడ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్‌కి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీధర్ మఠలంపరైలో ఉంటున్నాడు. అక్కడి హైస్కూల్, డిప్లొమా స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ‘జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్’ను ప్రారంభించాడు.
ఎలాంటి ఫీజు తీసుకోకుండా స్టూడెంట్స్‌కి స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు ఇక్కడ. ఇప్పటికే1,400 కంటే ఎక్కువ మంది జోహో స్కూల్స్‌లో చదువుకున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత.. శ్రీధర్ స్వయంగా ఈ స్కూల్‌లో పాఠాలు చెప్తాడు. ఇవే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్, మహిళా సాధికారత, సమాజాభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ కంపెనీ వ్యవసాయంలో కూడా పెట్టుబడి పెడుతోంది. దీంతోపాటు స్థానిక రైతుల్లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.
టెక్ ప్రపంచంలో..
టెక్ ప్రపంచంలో ఇండియా మేజర్ ప్లేయర్‌గా ఎదుగుతున్న టైంలో ‘జోహో’ లాంటి కంపెనీలు ఇండియాని నెంబర్‌వన్‌గా నిలబెట్టడంలో భాగం అవుతాయని శ్రీధర్ వెంబు అంటున్నాడు. మన దేశ సాంకేతిక ఎదుగుదల, అపారమైన సామర్థ్యాన్ని గుర్తించి, జోహోను వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. జోహో ఇప్పటికే ఇండియాలో చాలా డెవలప్ అయ్యింది. బిజినెస్ డిమాండ్లను తీర్చడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాకుండా దేశంలో మౌలిక సదుపాయాలపై చాలా పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటి ఎన్నో సేవలు చేయడం వల్లే 72వ గణతంత్ర దినోత్సవం (2021) సందర్భంగా శ్రీధర్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డు దక్కింది.
సింపుల్‌గా..
భారతీయ వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న శ్రీధర్ తను ఉండే ఊళ్లో ఇప్పటికీ అప్పుడప్పుడు సైకిల్ మీద తిరుగుతుంటాడు. చాలా సింపుల్‌గా బతుకుతాడు. తెల్లటి పంచె కట్టుకుని సరదగా పొలాల మధ్య గడిపేస్తుంటాడు. అంతేకాదు.. ఆయన ఈ మధ్య ఒక ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ కొన్నాడు. ‘మోంట్రా కంపెనీ’ తయారు చేసిన ఆ ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ బాగుందని దాన్ని నడుపుతున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనప్పటికీ ఆటో ఎందుకు కొన్నారని అడిగితే “ఎలక్ట్రిక్ ఆటో అనేది స్కూటర్ లేదా మోటార్‌సైకిల్‌తో పోలిస్తే సేఫెస్ట్ అప్‌గ్రేడ్. నేను దీన్ని ఫ్యామిలీ స్కూటర్‌గా భావిస్తున్నా. ఇరుకైన ప్రదేశాల్లో కూడా దీన్ని నడపడం, పార్కింగ్ చేయడం చాలా ఈజీ. అందుకే కొన్నా” అని చెప్పాడు. పది కిలోమీటర్ల లోపు దూరం ప్రయాణించాలంటే ఎలక్ట్రిక్ త్రీ–వీలర్‌ను వాడతాడు.