అందాల ప్రపంచం వైపు అడుగులు వేయాలనుకుందామె. పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి మోడలింగ్ చేయాలనుకుంది. కానీ, పుట్టుకతో వచ్చిన డౌన్ సిండ్రోమ్ ఆమె కలలపై నీళ్లు చల్లింది. ఇరుగుపొరుగు హేళన చేశారు. అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లింది జైనికా జగాసియ. తన కలని చేరుకుని, ప్రొఫెషనల్ బేకర్‌గా కూడా రాణిస్తున్న ఈ పందొమ్మిదేండ్ల మోడల్ గురించి..
ముంబైలో పుట్టి, పెరిగిన జైనిక
పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ బారిన పడింది. దానివల్ల ఆమె బ్రెయిన్, బాడీ సరిగా డెవలప్ కాలేదు. మాటలు కూడా స్పష్టంగా పలకవు. దాంతో నెలల వయసు నుంచే పేరెంట్స్ ఫిజికల్, స్పీచ్, ఆక్యుపేషనల్.. థెరపీలు ఇప్పించారామెకి. తల్లిదండ్రుల సపోర్ట్‌తో స్కూల్, కాలేజీల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంది జైనిక. ప్రొఫెషనల్ బేకర్గానూ పేరు సంపాదించుకుంది. అయితే నిజానికి జైనికకి బేకింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. కేక్ మిక్స్ వల్ల చేతులు మురికి అవుతాయి అంటుండేది. కానీ, వాళ్ల అక్క గీతిక రకరకాల కేక్‌లు తయారుచేస్తుంటుంది. కరోనా లాక్డౌన్లో సరదాగా అక్కతో కలిసి ఒక కేక్ తయారుచేసింది జైనిక. ఆ కేకు అందరికీ నచ్చింది. అంతేకాకుండా ఆ బేకింగ్ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేసిందామె. దాంతో వాళ్ల అక్క తనకి మరిన్ని బేకింగ్ టెక్నిక్స్ నేర్పించింది. అప్పట్నించీ అక్కతో కలిసి ఇంట్లోనే కేకులు తయారుచేసి అమ్ముతోంది. కానీ, వీటన్నింటికీ మించి మోడలింగ్ ఎక్కువ సంతోషాన్నిచ్చేది ఆమెకి. చిన్నప్పట్నించీ మోడలింగ్ అంటే ఇష్టం కావడంతో ఆ రంగంలోకే వెళ్లాలనుకుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి ప్రమోటర్ కావాలనుకుంది. కానీ, ఆ కలలకి డౌన్ సిండ్రోమ్ సమస్య పెద్ద అడ్డంకిగా మారింది.
మోడల్‌గా అవకాశాలొచ్చాయి
గ్లామర్ మీదే మోడలింగ్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. పైగా వేల కళ్లు.. వందల కెమెరాల మధ్య ర్యాంప్ వ్యాక్ చేయడం అంటే కత్తిమీద సాము లాంటిది. డౌన్ సిండ్రోమ్‌తో ఇదంతా సాధ్యమయ్యే పనే కాదు. ఈ ఆలోచనతోనే చాలా రోజులు తన కల గురించి బయటకు ధైర్యంగా చెప్పలేకపోయింది జైనిక. చివరికి మోడలింగ్‌పై ఆమెకి ఉన్న ఆసక్తిని గమనించిన ఆమె పేరెంట్స్.. తనకి ఒక ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలు వైరల్ అవ్వడంతో పాటు వాటికొచ్చిన రెస్పాన్స్ చూశాక జైనికలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మోడలింగ్‌పై తనకున్న ఆసక్తిని ప్రొఫెషన్‌గా మార్చుకోవాలనుకుంది. సోషల్ మీడియాలో జైనిక ఫొటోలు చూసి కొన్ని మోడలింగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. మోడలింగ్ వల్ల జైనిక కమ్యూనికేషన్ కూడా పెరిగింది అంటున్నారు పేరెంట్స్. చాక్లెట్ కుకీస్ తయారుచేయడమంటే చాలా ఇష్టం అంటున్న జైనిక ఇప్పటికే మోడల్‌గా కొన్ని యాడ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మోడలింగ్ వైపు రావాలన్న ఆలోచనలో ఉందట. ‘‘గూచీ బ్రాండ్‌కి మోడల్‌గా చేయాలన్నదే నా డ్రీమ్’’ అంటోంది జైనిక. ‘‘ఎంత కష్టమైన దారి అయినా సరే.. మనల్ని ప్రేమించే వాళ్లు.. అండగా నిలిచేవాళ్లు ఉంటారు. అందుకే వెనక్కినెట్టే మాటల్ని పట్టించుకోకూడదు. ధైర్యంగా ముందుకెళ్లాలి. ఏదైతే మనకి సంతోషాన్నిస్తుందో అదే చేయాలి. ప్రతి కలని నెరవేర్చుకోవాలి’’ అంటోంది జైనిక.