సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియ వాదినః ‘
అప్రియస్య చ పథస్య వక్తా స్తోత్ర చ దుర్లభః ‘‘
(రామాయణం, అరణ్య కాండ,37వ సర్గ, 2 వ శ్లోకం)
రాజా, ప్రియముగా మాటలాడేవాళ్లు ఎల్లప్పుడూ అనాయాసంగా లభించుదురు. ప్రియము కాని, హితకరము అయిన విషయము చెప్పేవారూ, వినేవారు కూడా చాలా అరుదు... అని మారీచుడు రావణునికి హితవు పలికిన సందర్భం. తండ్రిౖయెన దశరథుని ఆజ్ఞ మేరకు రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యాలకు వచ్చాడు. ఒకనాడు శూర్పణఖ అక్కడకు వచ్చింది. రాముడిని చేరి తనను వివాహమాడమని కోరుతుంది. రాముడు నిరాకరించడంతో, లక్ష్మణుడిని అడిగింది.
ఆయన శూర్పణఖను పరిహాసమాడుతూ నిరాకరించాడు. అప్పుడు కోపంతో మృత్యుపాశం లాగ శూర్పణఖ సీత మీదకు పరుగెత్తింది. అప్పుడు రాముడు, ‘లక్ష్మణా! క్రూరులైన చెడ్డవారితోఎన్నడూ పరిహాసం చేయకూడదు. ఈమె చెడ్డ స్వభావం కలది. పెద్ద ఉదరంతో చాలా మదించి ఉన్నది. అందుచే ఈమె ఆకారమును అంగవిహీనమై వికృతంగా ఉండేటట్లు చెయ్యి’ అని ఆదేశించాడు. రాముని అనుజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసి పంపాడు. కోపంతో ఏడుస్తూ శూర్పణఖ జనస్థానంలో ఉన్న ఖరుని సమీపించింది. ఖరుడు పదునాలుగు మంది రాక్షసులను పంపగా, వారిని సంహరించాడు రాముడు.
ఆ తరవాత ఖరుడు వచ్చి, రాముని చేతిలో నిహతుడయ్యాడు. దూషణుడు, పదునాలుగు వేల మంది రాక్షసులు కూడా రాముని చేతిలో హతులయ్యారు. అప్పుడు అకంపనుడనే రాక్షసుడు రావణుడి దగ్గరకు వెళ్లి విషయం అంతా వివరించాడు. రావణుడు సహాయం కోసం మారీచుడి దగ్గరకు వెళ్లాడు. అప్పుడు మారీచుడు రావణునికి హితబోధ చేశాడు. ఆ మాటలతో రావణుడు వెనుకకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న శూర్పణఖ రావణుని దగ్గరకు వచ్చి, ఏ విధంగానైనా రాముడిని సంహరించి సీతను అపహరించి తెచ్చుకోమని పలికింది. రావణుడు మళ్లీ మారీచుడి దగ్గరకు చేరుకున్నాడు. సీతను అపహరించటం కోసం సహాయం చేయమని అర్థించాడు. ఆ సందర్భంలో రావణాసురుడికి మారీచుడు హితబోధ చేశాడు.
రావణుడు తగినదీ, యుక్తిసమ్మతమూ అయిన మారీచుని మాటను మరణించనున్నవాడు ఔషధమును నిరాకరించినట్లు నిరాకరించాడు. కాలము చేత ప్రేరేపింపబడినవాడై, క్షేమకరములైన హితవాక్యములు చెప్పిన ఆ మారీచునితో పరుషములు, అయుక్తములు అయిన మాటలు పలికాడు. అందుకే ‘పోయేకాలం వస్తే ఎవ్వరిమాటలు చెవికి ఎక్కవు’ అని పెద్దలు చెబుతారు.
రామాయణంలోనే...
కైకేయి దశరథుడిని రెండు వరాలు కోరింది. ఒకటి రాముడు అరణ్యాలకు వెళ్లాలని, రెండు తన కుమారుడు భరతుడు పట్టాభిషిక్తుడు కావాలని. ఇటువంటి కోరికల వలన చేటు జరుగుతుందని ఎందరు చెప్పినా కైకేయికి వినపడలేదు. తన పంతం నెగ్గాలనుకుంది. రాముడు అరణ్యాలకు వెళ్లాడు. వెంటనే దశరథుడు మరణించాడు, భరతుడు పట్టాభిషేకానికి నిరాకరించాడు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు’ అన్న చందాన, కైకేయి కోరిక వలన సరిచేసుకోలేని నష్టం వాటిల్లింది.
ఇక మహాభారతంలోకి ప్రవేశిస్తే...
కుంతీదేవికి ధర్మరాజు పుట్టిన వార్త వినగానే, ఈర్ష్యతో గాంధారి తన గర్భం మీద గట్టిగా తాడనం చేసింది. దానితో పిండం బయట పడిపోయింది. వ్యాసుడు ఆ పిండాన్ని నూటొక్క కుండలలో భద్రపరిచాడు. మొదటి కుండ నుంచి దుర్యోధనుడు ఉద్భవించాడు. వెంటనే దుశ్శకునాలు ఎదురయ్యాయి. పెద్దలంతా వచ్చి, ‘తల్లీ, ఈ కుమారుడి కారణంగా వంశనాశనం జరుగుతుంది, కాబట్టి ఇతడిని విడిచిపెట్టేయండి’ అని చెప్పారు. కాని పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు, గాంధారి అందుకు అంగీకరించలేదు. ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అని పెద్దలు చెప్పినట్లుగా, ఆ మాటలు వారి చెవులకు ఎక్కలేదు. అలా కురువంశ వినాశనానికి దుర్యోధనుడు కారకుడయ్యాడు.
థామస్ హార్డీ ‘డాక్టర్ ఫాస్టస్’ అనే నవల రచించాడు. అందులో ప్రధాన పాత్ర అయిన డాక్టర్ ఫాస్టస్, తాంత్రిక విద్య అభ్యసించాలనుకున్నాడు. ఆ విద్యలను నేర్పే దుష్ట శక్తిని కలిసి, తనకు ఆ విద్య నేర్పితే తన ఆత్మను సమర్పించుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. కాలం గడుస్తుండగా, తాను ఏం తప్పు చేశాడో తెలుసుకున్నాడు. చివరలో ఎన్నోసార్లు అతడిని ఆ ఒప్పందం నుంచి తప్పించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. మృత్యువు తరుముకొస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. తన మనసును మళ్లించుకోలేకపోయాడు. చివరకు మరణించాడు.
రావణాసురుడు కూడా మారీచుడు బోధించిన మంచి మాటలను స్వీకరించలేకపోయాడు. తనకు ప్రభువైన రావణాసురుడి మాటలను కాదనలేక మారీచుడు బంగారు లేడి రూపంలో సీత ఉంటున్న ఆశ్రమం దగ్గర తిరుగాడాడు. ఆ లేడిని రాముడు వెంటాడాడు. లేడి రూపంలో ఉన్న మారీచుడు మరణించాడు. సీతను అపహరించిన రావణుడు లంక నాశనానికి కారకుడయ్యాడు. చివరకు తాను కూడా మరణించాడు.
అందుకే ప్రియముగా మాటలాడేవాళ్లు మనకు లభించినప్పుడు వారి మాటలను అనుసరించాలని ఈ కథ బోధిస్తోంది. మంచిని బోధించే వారు నిరంతరం అందుబాటులోనే ఉంటారు. అదే సమయంలో మనము ఆచరించటానికి ప్రియకరము కాని మాటలను చెప్పేవారు, అలాగే హితకరము అయిన విషయాలను చెప్పేవారూ, వినేవారు కూడా చాల అరుదుగా ఉంటారని రాక్షసుడైన మారీచుడు బోధిస్తున్నాడు.