విశ్వాసం: అధర్మానికి ఫలితం..

విశ్వాసం: అధర్మానికి ఫలితం..

‘‘ధర్మమార్గంలో ఉన్న రాజు ఇతరుల భార్యలను స్పృశిస్తాడా? రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇతరుల భార్యలను విశేషించి ప్రత్యేకంగా రక్షించాలి. బుద్ధిమంతుడు ఇతరులు నిందించే ఏ పనీ చేయకూడదు. తన భార్యను పరపురుష స్పర్శ నుండి రక్షించుకొన్నట్లు ఇతరులను కూడా రక్షించాలి. అర్థం గురించి, కామం గురించి, ధర్మం గురించి సందేహం కలిగితే, ఆ సందేహం శాస్త్రాల ద్వారా నిర్ణయించటం సాధ్యం కానప్పుడు.. శిష్టులు ఆ విషయంలో రాజునే అనుసరిస్తుంటారు’’ అని జటాయువు రావణాసురుడికి హితబోధ చేస్తున్న సందర్భంలోనిది.

 
(వాల్మీకి రామాయణం,అరణ్యకాండ 52వ సర్గ నుండి)

రాజ్యాన్ని పరిపాలించే రాజు తన దేశ ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి. తాను ఆచరణపూర్వకంగా సత్కర్మలు చేస్తూ, ప్రజలంతా సన్మార్గంలో జీవించేలా ప్రవర్తించాలి. అటువంటి రాజైన రావణాసురుడు అధర్మానికి పాల్పడ్డాడు. రామలక్ష్మణులు ఆశ్రమంలో లేకుండా చూసి, సీతను అపహరించి, ఆశ్రమానికి అవమానం కలిగించాడు. ధర్మార్థకామాలకు సంబంధించిన సందేహాలు కలిగితే, ఆ సందేహం శాస్త్రాల ద్వారా నిర్ణయించలేకపోయిన సందర్భాలలో ప్రజలంతా రాజు నిర్ణయాన్నే అనుసరిస్తారు. అందుకే రాజు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలంటారు పెద్దలు. 

రావణాసురుడు చేసిన అధర్మం కారణంగా ఏ తప్పు చేయని రావణుని బంధుజనం,  లంకానగర వాసులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ధర్మకార్యం చేసినా, అధర్మకార్యం చేసినా, దాని ఫలితం కనిపించడానికి ఎక్కువ సమయం పడుతుంది, వెంటనే కనిపించదు. 

రామాయణంలోనే మారీచుడు కూడా రావణాసురుడికి నీతి బోధ చేస్తాడు. రావణుడు వినిపించుకోడు. అధర్మవర్తనానికే కట్టుబడి ఉంటాడు. ఆ కారణంగా మారీచుడు రావణాసురుడి ఆజ్ఞ ప్రకారం బంగారు లేడిగా మారి, రాముడిని కవ్వించాడు. చివరకు రాముడి చేతిలో హతుడయ్యాడు. అధర్మం మీద ధర్మం గెలిచితీరుతుందని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలు పురాణాలలో, ఇతిహాసాలలో ఎక్కువగా కనిపిస్తాయి.తెలిసి చేసినా, తెలియక చేసినా అధర్మం చేసినవారు దాని దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు. 

దశరథుడు వేటకు వెళ్లి, దూరంగా వినిపిస్తున్న శబ్దం ఒక పెద్దపులిది అని భావించి, బాణం వేసి కొట్టాడు. అది శ్రవణ కుమారుడు అనే బాలుడు కుండను నీటిలో ముంచుతుండగా వచ్చిన శబ్దం. దశరథుడు తెలియక వేసిన బాణం ఆ బాలుడి మరణానికి కారణమైంది. ధర్మబద్ధంగా ఉండవలసిన రాజు అధర్మానికి ఒడిగట్టాడు. శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల శాపానికి గురయ్యాడు. రాముడిని అడవులకు పంపాడు. రామునికి దూరమై జీవించలేక, కన్నుమూశాడు. 

కైక కూడా అధర్మం ఆచరించింది. శాస్త్రానుసారం పెద్ద కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. అందుకు విరుద్ధంగా తన కుమారుడికి పట్టాభిషేకం చేయమంది. అక్కడితో ఆగకుండా, రాముడిని పదునాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపమంది. ఈ అధర్మ ప్రవర్తన కారణంగా దశరథుడు మరణించాడు. భరతుడు నారవస్త్రాలు ధరించి, అయోధ్యకు వెలుపల నందిగ్రామ రాజ్యంలో రాముని పాదుకలను సింహాసనం మీద ఉంచి, అన్నగారి పేరు మీదే పరిపాలన కొనసాగించాడు. 

ఇక భారతం పరిశీలిస్తే...

బాల్యం నుంచి కౌరవులు అధర్మంగా ప్రవర్తించారు. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించిన సమయంలో దుర్యోధనుడు, పాండవుల సంపదలు చూసి అసూయ చెందాడు. ఏ విధంగానైనా వాటిని అపహరించాలనుకున్నాడు. అధర్మమార్గంలో వెళితే, ఆ సంపదలను సులువుగా అపహరించవచ్చని తెలుసుకున్నాడు. తన వంటి అధర్మమూర్తులైన శకుని, కర్ణ, దుశ్శాసనులతో కలిసి చేయరానన్ని అధర్మాలు చేశాడు. 

ధర్మరాజు రాజసూయ యాగం చేయటానికి ఎంతో శ్రమించాడు. ధర్మాన్ని అనుసరించి, తన తమ్ములను నాలుగు దిక్కులకూ పంపి, రాజులను జయించి, వారి నుంచి సంపదలు తీసుకొచ్చాడు. ఆ సంపదలతో యా గం నిర్వహించాడు. సకల భూమండల రాజులూ ఆ యాగానికి వచ్చారు. కన్నులు మిరుమిట్లు గొలిపే రత్న రాశులను కానుకలుగా సమర్పించారు. అంత సంపదలను సంపాదించడానికి ధర్మరాజు తన సోదరులతో కలిసి ధర్మమార్గాన ఎంతో శ్రమించాడు. దుర్యోధనుడు ఆ సంపదలను అధర్మమార్గంలో అతి తక్కువ సమయంలో తస్కరించడానికి పన్నాగం పన్నాడు. 

శకుని సలహా మేరకు ధర్మరాజును జూదానికి పిలవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. విదురునితో సంప్రదించిన ధృతరాష్ట్రుడు, జూదం మంచిది కాదని బోధించాడు. అధర్మంతో కళ్లు మూసుకుపోయిన దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు. జూదానికి ఒప్పుకోకుంటే ఆత్మపరిత్యాగం చేస్తానని బెదిరించాడు కూడా ఎట్టకేలకు ధర్మరాజుతో అధర్మంగా జూదం ఆడాడు. దుర్యోధనుడు గెలిచాడు.

పర్యవసానంగా పాండవులు అడవులపాలయ్యారు. పదమూడు సంవత్సరాలు పూర్తికాగానే, తిరిగి వచ్చి, కురుక్షేత్ర యుద్ధంలో నూరుగురు కౌరవులే కాక, దుర్యోధనుని అధర్మానికి తల ఒగ్గి కూర్చున్న భీష్మ, ద్రోణాచార్యులు కూడా మరణించారు. అధర్మవర్తనానికి తీవ్రమైన ఫలితాన్ని అనుభవించక తప్పదని మన ఇతిహాసాలు చెబుతున్నాయి.