మూడడుగులే ఉన్నాడ‌ని హేళన చేసిన వాళ్ల‌తోనే చప్పట్లు కొట్టించుకున్నాడు

మూడడుగులే ఉన్నాడ‌ని హేళన చేసిన వాళ్ల‌తోనే చప్పట్లు కొట్టించుకున్నాడు

హనుమకొండ, వెలుగు: సమాజంలో మరుగుజ్జుల పట్ల చిన్నచూపు అంతా ఇంతా కాదు. చిన్నతనం నుంచే జన్యుపరమైన లోపంతో మూడడుగుల ఎత్తుకే పరిమితమైన ఓ యువకుడు అవహేళనగా చూసిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. కేయూలో పీహెచ్​డీ పూర్తి చేసి.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనే ఖమ్మం జిల్లా కామేపల్లికి చెందిన పూజల శివకృష్ణ.

మూడడుగులే ఉన్నా.. కుంగిపోలే
ఖమ్మం జిల్లా కామేపల్లికి చెందిన విజయ, స్వామి దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో సతీశ్​ పెద్దవాడు కాగా.. శివకృష్ణ రెండో సంతానం. జన్యుపరమైన లోపం కారణంగా శివకృష్ణ మూడడుగుల కంటే ఎత్తు పెరగలేకపోయాడు. దీంతో చిన్నతనం నుంచి తన స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు పొట్టివాడంటూ హేళన చేశారు. కానీ, వాటిని శివకృష్ణ పట్టించుకోలేదు. సొంతూరులో ఇంటర్​ వరకు చదివి.. ఖమ్మంలో డిగ్రీ కంప్లీట్​ చేశాడు. అక్కడా అవమానాలు తప్పలేదు. వాటిని దాటుకుని  కాకతీయ యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్​మెంట్ లో పీజీ పూర్తి చేశాడు. అనంతరం జువాలజీ ప్రొఫెసర్  మామిడాల ఇస్తారి గైడెన్స్​లో శివకృష్ణ ఈ ఏడాది మేలో పీహెచ్​డీ పూర్తి చేశాడు. తనను హేళన చేసిన వాళ్లందరికీ తన పీహెచ్​డీ పట్టాతో సమాధానం చెప్పాడు.

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆయన మంగళవారం యూనివర్సిటీకి రాగా.. ఇంటర్నేషనల్​ డిఫరెంట్లీ ఏబుల్డ్​ దినోత్సవం సందర్భంగా తోటి విద్యార్థులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ ‘చిన్నతనం నుంచి  ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్న. నాలాంటి ఎంతోమంది అవమానాలను తట్టుకోలేక మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. ఎలాగైనా ఉన్నత స్థానంలో నిలిచి అందరికీ సమాధానం చెప్పాలనుకున్న. కష్టపడి చదివి పీజీ పూర్తి చేశా. మా ప్రొఫెసర్  ఇస్తారి సహకారంతో పీహెచ్​డీ కూడా కంప్లీట్​ చేశా. అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా లేదా డిగ్రీ లెక్చరర్​గా ఉద్యోగం సాధించాలన్నదే టార్గెట్’ అని చెబుతున్నాడు. శారీరక లోపంతో ఎంతో మంది కుంగిపోతున్న సమాజంలో కష్టపడి చదివి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్న శివకృష్ణ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.