ఆరేండ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. చెట్టంత అండ కోల్పోయి నీడ లేని తన కుటుంబాన్ని అంతా తానై చూసుకున్నాడు. చిన్న వయసులోనే కుటుంబ భారం మీదేసుకున్నాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు. కానీ.. చదువుకోవాలనే కోరిక మాత్రం ఉంది. అందుకే ఒక వైపు పనిచేస్తూనే మరోవైపు చదువుకున్నాడు. బిస్కెట్లు అమ్మితే వచ్చిన డబ్బులను ఇంటి ఖర్చుల కోసం ఇచ్చేవాడు. కట్ చేస్తే.. ఆ రంగారావు కోట్లకు అధిపతి అయ్యాడు. ఆ డబ్బంతా ఏదో జాక్‌పాట్ కొట్టి సంపాదించలేదు. గూడు కట్టుకోవడానికి పిచ్చుక ఎలాగైతే ఒక్కొక్కటిగా గడ్డిపోచలను పోగు చేసుకుంటుందో... అచ్చం అలానే కష్టపడి వ్యాపారం చేశాడు. ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఎదిగాడు.
ఎన్. రంగారావు ఈ పేరు ఎవరికీ తెలియకపోయినా.. సైకిల్ ప్యూర్ అగర్‌బత్తి బ్రాండ్ మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం7 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ఈ కంపెనీని స్థాపించింది ఈయనే. రంగారావు1912లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి టీచర్‌గా పనిచేసేవాడు. రంగారావు ఆరేండ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. దాంతో కుటుంబ బాధ్యత రంగారావు మీద పడింది. అంత చిన్న వయసులో కుటుంబాన్ని చూసుకోవడమంటే తలకు మించిన భారమే. అయినా.. కష్టపడి పనిచేసి.. కుటుంబాన్ని నడిపించాడు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు.
బిస్కెట్లు అమ్మి..
చదువుకునేందుకు కావాల్సిన డబ్బు సంపాదనకు స్కూల్లో బిస్కెట్లు అమ్మడం మొదలుపెట్టాడు రంగారావు. దానికోసం టైం కంటే ముందే స్కూల్‌కి వెళ్లేవాడు. స్కూల్ గంట మోగేవరకు గేటు దగ్గర బిస్కెట్లు అమ్మేవాడు. అలా కొన్నాళ్లకు నెమ్మదిగా సంపాదన మొదలైంది. ఆ తర్వాత హోల్‌సేల్ వ్యాపారుల నుంచి మిఠాయిలు కొని, కొంత లాభానికి వాటిని ఊళ్లో అమ్మడం మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బుని పొదుపుగా వాడుకునేవాడు.
వాటితోనే ఇంటి ఖర్చులు, చదువు ఖర్చులు తీర్చుకునేవాడు. ట్యూషన్‌కి వెళ్లడానికి దగ్గర డబ్బుల్లేకపోతే ‘నా ఫీజుకు బదులు ఆరుగురు స్టూడెంట్స్‌ని ట్యూషన్‌లో చేర్చుతా’ అని టీచర్‌ని ఒప్పించాడు. అలా.. ట్యూషన్ మిస్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. ఇదొక్కటేకాదు... అదే టైంలో తన కంటే చిన్నవాళ్లకు ట్యూషన్లు చెప్తూ డబ్బులు సంపాదించాడు. ఆ కాలంలో చదువురాని వాళ్లకు న్యూస్ పేపర్ చదివి వినిపిస్తే.. పేపర్ చదివిన పిల్లలకు కొంత డబ్బు ఇచ్చేవాళ్లు. అలా న్యూస్ పేపర్ చదివి కొంత డబ్బు సంపాదించాడు.
సైకిల్ మీద అమ్ముతూ..
రంగారావు చదువు పూర్తయ్యాక ఫ్యామిలీతో కలిసి కూర్గ్‌కు వెళ్లి సెటిల్ అయ్యాడు. మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు.1947లో స్వాతంత్ర్యం వచ్చాక బిజినెస్ పెట్టాలనే ఉద్దేశంతో తన కుటుంబంతో కలిసి మైసూర్‌కు వెళ్లాడు.
1948లో అతను ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని.. టూత్ పౌడర్, శీకాకాయ్ (నేచురల్ హెయిర్ క్లెన్సర్), అగర్బత్తీ లాంటి ప్రొడక్ట్స్ తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. కుటుంబం అంతా కలిసి తయారుచేసిన ప్రొడక్ట్స్‌ని రంగారావు ఇంటింటికీ వెళ్లి అమ్మేవాడు. అగర్‌బత్తీలకు మంచి గిరాకీ ఉండడంతో వాటినే ఎక్కువగా తయారుచేసి మార్కెట్ చేయడం మొదలుపెట్టాడు.
సొంత ల్యాబ్
అగర్‌బత్తీకి డిమాండ్ పెరగడంతో... క్వాలిటీ ప్రొడక్ట్‌కి ఎక్కడైనా గిరాకీ ఉంటుందని ఆయనకు అర్థమైంది. అందుకే అగర్‌బత్తిని మరింత డెవలప్ చేసేందుకు సొంతంగా ఒక ఫ్రాగ్రెన్స్ క్రియేటివ్ ల్యాబ్ ఏర్పాటు చేసి మరింత క్వాలిటీ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తేగలిగాడు. వాటి ప్రత్యేకమైన సువాసన వల్ల మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ వచ్చింది. అప్పటివరకు ప్యాకేజింగ్, రంగు, అతని పేరు (రావు) ఆధారంగా అగరబత్తీలను జనాలు గుర్తుపట్టేవాళ్లు.
ఇలా లాభం లేదని వాటికి ఒక పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. పేరును ‘సైకిల్’ అని డిసైడ్ చేశాడు. కారణం.. అప్పట్లో చాలామంది దగ్గర సైకిల్ దగ్గర ఉండటమే. అంతెందుకు మొదట్లో ఈ అగర్‌బత్తీలను సైకిల్‌పై మూట కట్టుకుని అమ్మేవాడు. కాబట్టి అందరికీ తెలుసు. వస్తువుల పేర్లు భాష, దేశాన్ని బట్టి మారుతుంటాయి. కానీ.. సైకిల్‌ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ‘సైకిల్’ అనే పిలుస్తారు. అందుకే తన ప్రొడక్ట్‌కి ‘సైకిల్’ అని పేరు పెట్టాడు.
ఆ తర్వాత ఒక చిన్న కంపెనీ పెట్టి ప్రొడక్షన్ పెంచాడు. తక్కువ ధరకే క్వాలిటీ అగర్ బత్తీలు అందించాడు. తక్కువ ధరకు ఇచ్చేందుకు ప్యాకేజింగ్ ఖర్చులను తగ్గించాడు. గ్రీజు ప్రూఫ్ పేపర్‌లో అగర్బత్తీలు చుట్టి 25 అగరుబత్తీల ప్యాకెట్ ఒక అణాకు అమ్మేవాడు. ఇరవై ఏండ్లలో సైకిల్ కూడా టాప్ బ్రాండ్ల లిస్ట్‌లో చేరిపోయింది. చాలామంది దుకాణానికి వెళ్లి సైకిల్ అగర్బత్తీ కోసం అడగడం మొదలైంది. ఇప్పటికీ దాదాపు ఇరవై శాతం మంది కస్టమర్లు ప్రత్యేకంగా సైకిల్ అగర్ బత్తీ కావాలని అడుగుతుంటారు.
ఆడవాళ్లే తయారుచేసేది!
అగరుబత్తీలు చేసే పనిలో ఎక్కువగా ఆడవాళ్ళనే పెట్టాడు రంగారావు. వాళ్లకు ఉపాధి కల్పించడమే ఆయన లక్ష్యం. ‘‘ఎన్‌ఆర్ గ్రూప్” పేరుతో కంపెనీ పెట్టాడు.1978 వరకు కంపెనీని ఆయనే చూసుకున్నాడు. 1980లో ఆయన చనిపోయాక కంపెనీ అతని కొడుకుల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రంగారావు కుటుంబానికి చెందిన మూడో తరం కంపెనీని నడుపుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ 65 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. సైకిల్ ప్యూర్ అగర్ బత్తీ మార్కెట్ విలువ 7,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే! అమితాబ్ బచ్చన్, రమేష్ అరవింద్, సౌరభ్ గంగూలీ లాంటి ప్రముఖులు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి సైకిల్ అగర్‌బత్తీని ప్రమోట్ చేశారు.
నలభై ఏండ్లుగా..
కొన్ని కంపెనీలు టాప్ లిస్ట్‌లోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. కానీ.. సైకిల్ అగర్బత్తీ మాత్రం 40 ఏండ్లుగా టాప్ కంపెనీల లిస్ట్‌లో ఉంది. ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలు వచ్చినా.. సైకిల్‌ని ఢీ కొట్టలేకపోయాయి. ఐటీసీ కంపెనీ ఇప్పటికీ ఈ సెగ్మెంట్‌లో రెండో స్థానంలోనే ఉంది. ఇదే కాదు.. హిందుస్థాన్ లీవర్ (ఇప్పుడు హిందుస్తాన్ యూనిలీవర్), నిర్మా, ఎస్సీ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అగర్బత్తీ బిజినెస్‌లోకి వచ్చినా సైకిల్‌ని దాటి వెళ్లలేకపోయాయి.
రంగారావు మనవడు కిరణ్ రంగా ఎన్‌ఆర్ గ్రూప్ కింద 2005లో మరో కంపెనీ ‘రిప్ప్ల్ ఫ్రాగ్రెన్స్’ని మొదలుపెట్టాడు. ఈ బ్రాండ్స్ సేల్స్ కూడా బాగున్నాయి. ఐరిస్ బ్రాండ్ పేరుతో ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రంగారావు వారసుల్లో ఒక్కొక్కరు ఎన్‌ఆర్ గ్రూప్ కింద ఒక్కో కంపెనీని చూసుకుంటున్నారు. అర్జున్ అగర్బత్తీ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. పవన్ రంగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ కంపెనీ రంగా సన్స్‌ని చూసుకుంటున్నాడు.
60 దేశాలకు
ఎన్‌ఆర్ గ్రూప్ నుంచి ఐదు విభిన్న బ్రాండ్స్ పేర్లతో అగర్బత్తీలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ సైకిల్ ప్యూర్ ఇండియాలో మార్కెట్ లీడర్. ఈ అగర్‌బత్తీలను మరో 60 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా లియా, ఫ్లూట్, రిథమ్ అండ్ వుడ్స్ అగర్‌బత్తీలకు మంచి గిరాకీ ఉంది.
హాని కలగకుండా..
కార్మికుల ఆరోగ్యంపై జాస్ స్టిక్ తయారీ ఎఫెక్ట్ చూపిస్తుందని కంపెనీ వాటి తయారీని ఆపేసింది. అంతేకాదు.. పర్యావరణానికి, కార్మికులకు ఎలాంటి ప్రమాదం కలిగించని ముడిసరుకులతోనే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ముడిసరుకు దగ్గర్నించి ఫైనల్ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తెచ్చేవరకు ఈ కంపెనీ ‘గ్రీన్’ సిస్టమ్‌ని అనుసరిస్తుంది. అంతర్జాతీయ సువాసన సంఘం (ఐఎఫ్‌ఆర్‌ఏ) సర్టిఫై చేసిన ముడిసరుకునే అగర్బత్తీల తయారీలో వాడుతున్నారు.
ప్యాకింగ్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీనే. వీటి ప్రొడక్షన్‌లో ఎక్కడా క్లోరోఫ్లోరో కార్బన్‌లు విడుదల కావు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 20 మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. మెయిన్ ప్లాంట్ మైసూరులో ఉంది. ఈ కంపెనీ కార్మికుల్లో ఎక్కువగా గ్రామీణ మహిళలే ఉంటారు. కంపెనీ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మంది ఉపాధి పొందుతున్నారు.
ధూప్ స్టిక్స్
కంపెనీ వ్యవస్థాపకుడు రంగారావు మొదట ధూప్ స్టిక్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. అంతేకాదు.. కంపెనీకి ఇలాంటి ‘మొదటి రికార్డ్స్’ మరికొన్ని కూడా ఉన్నాయి. ధూప్‌స్టిక్స్ కోసం ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) ఛానెల్‌ని తీసుకున్న మొదటి అగర్బత్తీ కంపెనీ ఇది. త్రీ ఇన్ వన్ పేరుతో మూడు సువాసనలను ఒకే ప్యాక్‌లో అందించిన మొదటి బ్రాండ్.
రంగారావు