
మంచి మనసున్న వాళ్ల ఆశీర్వచనాలు తీసుకుంటే మేలు జరుగుతుందని పెద్దవాళ్లు చెప్తుంటారు. అలాంటి వాళ్ల ఆశీర్వచనాలు ఫలిస్తాయని నమ్ముతారు. అందుకు పురాణాల్లో చాలా సందర్భాలను ఉదహరిస్తారు కూడా. అందుకు సంబంధించిందే ఈ కథ.
ఒకసారి ఒక రాజుగారి ఇంట్లో సంతర్పణ జరుగుతోంది. రాజుగారింట్లో సంతర్పణ అంటే... ఆ రాజ్యంలోని ప్రజలందరికీ పండుగే. కొన్ని వేల మంది అక్కడకు వచ్చి కడుపు నిండా భోజనం చేసి, రాజుని ప్రశంసించి వెళ్తున్నారు. అలా వచ్చిన వారిలో నిజాయితీపరుడైన ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. అతడు హాయిగా భోజనం చేసి చేయి కడుక్కున్నాడు. ఎంతో నిజాయితీగా ఉండే ఆ బ్రాహ్మణుడు ఆ రోజు, ఇంటికి వెళ్లే ముందు వెండితో తయారైన మంచినీళ్ల పాత్రను దొంగిలించాడు. అయితే అతనికి దొంగతనం చేస్తున్నాననే విషయం కూడా తెలియదు.
ఇంటికి వెళ్లిన తరవాత కానీ తను చేసిన తప్పు ఏంటో అర్థం కాలేదు. ‘‘అయ్యో! ఈ రోజు ఇంత పొరపాటు చేశానేమిటి? ఎన్నడూ పరుల సొమ్మును ఆశించలేదే. ఈ రోజు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు వచ్చిందో నాకు’’ అనుకున్నాడు. వెంటనే ఆ పాత్ర తీసుకుని రాజు దగ్గరకు వచ్చి, ‘రాజా! పొరపాటు చేశా. ఇక్కడ నుంచి మంచినీటి పాత్రను తస్కరించా. నాలో ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా మీ కొలువుకి వస్తున్నానే. మీరిచ్చే కానుకలు కూడా తిరస్కరిస్తుండేవాడిని. అటువంటి నేను ఈ రోజు ఈ తప్పు ఎందుకు చేశానో అర్థం కావట్లేదు. ఈ రోజు వంట వండటానికి ఎవరైనా కొత్తవారు వచ్చారా? ఎప్పుడూ చేస్తున్నవారే చేశారా?’’ అని ప్రశ్నించాడు.
రాజుగారు వంట ఎవరు చేశారని విచారించారు. ఆ రోజు వంట చేయటానికి కొత్త వ్యక్తి వచ్చినట్లు తెలిసింది. ఆ వ్యక్తికి వస్తువులను దొంగిలించే లక్షణం ఉన్నట్లు తెలుసుకుని, అదే విషయాన్ని బ్రాహ్మణుడికి వివరించాడు. ‘‘అదే మహారాజా! ఎన్నడూ పరాయి వారి వస్తువులను ఆశించని నా మనసు, ఈ రోజు నా చేత తప్పు ఎందుకు చేయించిందో ఇప్పుడు అర్థమైంది. అందుకే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనసుతో వంట చేయాలని మన పెద్దలు చెప్తారు. దురాలోచన పరుల చేతి వంట తిన్నవారికి దురాలోచనలు, దురాశలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది’’ అంటూ అక్కడ నుంచి ఆ పండితుడు వెళ్లిపోతాడు.
రాజు ఆశ్చర్యపోయాడు. వంట చేసేవారి ఆలోచనలు వండిన వంటలోకి ప్రవేశించి, ఆ భోజనం తిన్నవారి చేత తప్పు చేయిస్తుందా అనుకున్నాడు. తక్షణమే ఆ వంట వాడిని పనిలో నుంచి తీయించి, స్వచ్ఛ మైన మనసుతో ఉన్న వాళ్లను వంట వాళ్లుగా నియమించాడు. ఇదంతా చదివాక మీకో అనుమానం రావచ్చు. ఇలా నిజంగా జరుగుతుందా అనిపించొచ్చు. ఇందుకు రామాయణమే ప్రత్యక్ష ఉదాహరణ. దశరథుని ముద్దుల రాణి అయిన కైకమ్మ మదిలో దురాలోచన బయలుదేరటానికి కారణం మందర. దుష్ట ఆలోచనలతో చేసిన పదార్థాలను కైకకు తినిపించటం వల్లే కైకమ్మలో ఆ ఆలోచన బయలుదేరి ఉంటుందనటానికి ఈ కథే మంచి ఉదాహరణ.
దిలీపుడు, రఘుమహారాజు, దశరథుడు, శ్రీరాముడు... వీరంతా తమ పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో, హాయిగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకోవటం వల్లే, నేటికీ రామరాజ్యం పేరు సుస్థిరంగా నిలిచిపోయింది. ఇక భారత కాలం పరిశీలిస్తే... తన కంటే ముందుగా కుంతీ దేవి సంతానవతి అయిందనే వార్త విన్న గాంధారి మనసు ఈర్ష్య అసూయలతో నిండిపోయింది. అటువంటి మనసుతో తయారుచేసిన ఆవిడ చేతి భోజనం సేవించిన కౌరవులు దురాలోచనాపరులై కుతంత్రాలు చేశారు.
కుంతి విషయానికి వస్తే... సహృదయంతో పదిమందికి భోజనం పెట్టింది. ఆ సహృదయతే పాండవులను సన్మార్గంలోకి నడిపింది. స్వతంత్ర పోరాటంలో భారతీయుల నిబద్ధత కారణంగానే మనకు స్వాతంత్య్రం చేకూరింది. మంచి మనసుతో చేసే పనికి సత్ఫలితాలు వస్తాయని ఇటువంటి సంఘటనలు మనకు తెలియచెప్తున్నాయి. ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి పనినీ త్రికరణశుద్ధిగా చేయాలని, అలా చేసిన పనికి సత్ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. నిర్మలమైన మనసు ఉన్న వాళ్ల ఆశీస్సులు సత్ఫలితాలనిస్తాయని పెద్దలు చెప్తారు. అందువల్లనే .. మనస్సు, వాక్కు, ఆలోచన నిర్మలంగా ఉన్నవారినే ఆశీర్వచనం ఇవ్వమంటారు. అటువంటి వారి వాక్కు ఫలించి తీరుతుందని విశ్వాసం.
డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232
ఎన్నడూ పరాయి వారి వస్తువులను ఆశించని నా మనసు, ఈ రోజు నా చేత తప్పు ఎందుకు చేయించిందో ఇప్పుడు అర్థమైంది. అందుకే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనసుతో వంట చేయాలని మన పెద్దలు చెప్తారు. దురాలోచన పరుల చేతి వంట తిన్నవారికి దురాలోచనలు, దురాశలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది