ఆధ్యాత్మికం : నేనే గెలవాలి.. నీవు ఓడాలి అన్న సూత్రంపై.. మహా భారత యుద్ధంలో గెలిచింది ఎవరు..?

ఆధ్యాత్మికం : నేనే గెలవాలి.. నీవు ఓడాలి అన్న సూత్రంపై.. మహా భారత యుద్ధంలో గెలిచింది ఎవరు..?

కష్టకాలం వచ్చినప్పుడే, విషమ పరిస్థితులేర్పడినప్పుడో నిగ్రహాన్ని కోల్పోకూడదు. బలం, బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటిని సరిదిద్దుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ఖచ్చితమైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే... కాలానుగుణంగా మార్చుకుంటూ పోవాలి. మార్పు రాకపోతే ఎంత నష్టపోతామో తెలుసుకోవాలంటే భారత యుద్ధంలో గెలుపోటములతోపాటు లాభనష్టాలు తెలుసుకోవాల్సిందే. 

మహాభారతంలోని దుర్యోధనుడు మూర్తీభవించిన మూర్ఖత్వానికి గర్వాభిమానాలకు ప్రతీక. యుద్ధం నాశనహేతువని ఎందరు చెప్పినా వినక, తనవారందరినీ పోగొట్టుకొన్నాడు. యుద్ధ ఉపకరణాలు లేవు. బంధుమిత్రుల సహాయం లేదు. యుద్ధంలో అలసిపోయి ఉన్నాడు. 
శత్రు శేషం, ఋణశేషం ఉండకూడదంటారు. పెద్దలు. కౌరవ సైన్యం హతమైపోయిన తర్వాత మడుగులో దాక్కున్న దుర్యోధునుడిని బయటకు రప్పించేందుకు ధర్మరాజు సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తాడు. ప్రాణభీతితో దాక్కున్న దుర్యోధనుడి అహంభావాన్ని తట్టిలేపాలని ధర్మరాజు తెలివిగా ఎత్తిపొడుపు మాటలంటున్నాడు. 

తనవారందరినీ పోగొట్టుకున్న మనోవేదనతో, అలసిపోవడం వల్ల ఈ మడుగులో సేదదీరుతున్నానంటూ (నిస్సహాయ స్థితిలో) తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతాడు. దుర్యోధనుడికి గెలుస్తాననే నమ్మకం సడలిపోయింది. విజ్ఞత మేల్కొన్నది. కానీ, పాండవులపై ద్వేషాగ్ని చల్లారలేదు. ఎత్తిపొడుపు మాటలకు తొక్కినపాములా దుర్యోధనుడు బుసలు కొట్టిండు. "నీవ యుర్వియేలు' 'నీ తలనె కట్టికొనుము' అంటూ ధర్మరాజుపై ఆక్రోశం వెళ్లగక్కుతాడు. 

మాయావి తెలివి:

అప్పుడు.. నిన్ను విడిచి పెట్టడం తప్ప ఏదైనా కోరుకో. కచ్చితంగా ఇస్తాను. మాలో ఒకనితో యుద్ధం చేసి జయించు, ఈ రాజ్యం నీకిస్తాను. లేదంటే యుద్ధంలో మరణించి స్వర్గానికి చేరుకో' అని ధుర్యోధనుడిని ఉద్దేశించి ధర్మరాజు అంటాడు. 

భీముడ్ని గెలవాలనే ఆలోచనతో దుర్యోధనుడు 13 సంవత్సరాలపాటు దివారాత్రులు కష్టపడి గదా యుద్ధం నేర్చుకొన్నాడు. అంతటి నైపుణ్యం సాధించిన దుర్యోధనుడు మరెవరితోనే తలపడి గెలిస్తే మళ్లీ లోకాధిపతి అవుతాడు. కృష్ణుడు ఆ. ప్రమాదాన్ని పసిగట్టి, దుర్యోధనుడితో తలపడేలా భీముడ్ని రెచ్చగొట్టిండు. మాయావిని మాయతోనే ఎదుర్కోవాలని, అధర్మమైనా నాభి దిగువన కొట్టి దుర్యోధనుడ్ని జయించమని, తన తొడలు చూపుతూ శ్రీకృష్ణుడు సైగ చేస్తాడు. ఆ మాయోపాయాన్ని భీముడు గ్రహిస్తాడు. దుర్యోధనుడి తొడలు విరగ్గొడౌతాడు. పడిపోయిన దుర్యోధనుడి తలను తన్ని ప్రతిన నెరవేర్చుకుంటాడు. 

కష్టకాలం ఓ పాఠం

దుర్యోధనుడు పాండవుల పట్ల ఇది వరకు ఎలా ప్రవర్తించినా చివరి సమయంలోనైనా ఆత్మ విమర్శ చేసుకోలేకపోవడం అతని దుర్మార్గపు వ్యక్తిత్వాన్ని చెబుతుంది. తొడలు విరిగి, ఒంటరిగా, చీకటిలో, చలిలో అడవి జంతువుల మధ్య జీవచ్ఛవమై మూర్చలో మునిగి తేలుతూ కూడా అశ్వత్థామను సైన్యాధిపతిని చేసాడు. నిద్రలో ప్రమత్తులై ఉన్న పాండవ సైన్యాన్ని హతం చేసానని అశ్వత్థామ చెప్పిన సమయంలో దుర్యోధనుడు సంతోషిస్తాడు.... 'భీష్మద్రోణులు కూడా చేయని సహాయం చేసావ'ని అశ్వత్థామను పొగుడుతూ చనిపోతాడు. అతని ఆవేశపూరిత, అపరిపక్వ భావనలకు ఇది అద్దం పడుతుంది. 

గెలుపంటే?.. 

'యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?" అన్నది ముఖ్యం కాదు. ఆ ప్రక్రియలో ఎందరు ఆత్మీయులు మరణించారు? ఎందరు అమాయకులు ఐలి అయ్యారు? ఎంత సంపద హరించుకు పోయింది? ఎంత మానవశక్తి వృథా అయింది? ఎందరు స్త్రీలు వితంతువులయ్యారు? ఎంతమందిని అనాథలను చేసింది? యుద్ధరంగంలో జరిగిన నష్టం ఎంత?" అని లెక్కించుకున్న తర్వాత 'ఇంత చేసి తాము సాధించిన నేల ఎంత? ఆ నేలను వారనుభవించిన కాలమెంత?" అని చూసుకుంటే యుద్ధంలో ఓడిపోయారో... గెలిచారో తెలుస్తుంది. 

నిరర్దక విజయం 

పాండవులు, కౌరవులలో ఎవరు మంచివారో? ఎవరు చెడ్డవారో? తెలుసుకోవాలంటే ఎవరు చేసిన పనులు ఎలాంటివో తెలిస్తే అర్థమవుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవులు శక్తియుక్తులతో పోరాడారు. వాళ్లకు ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకున్నారు. ధర్మాధర్మ విచక్షణ కంటే గెలుపే ముఖ్యం అనుకుని యుద్ధరంగంలోకి దిగారు. కౌరవులందరూ మరణించారు. పాండవులు గెలిచారు. కానీ, అందరినీ పోగొట్టుకొని సాధించిన విజయం నిరర్థకంగా పరిణమించింది. 

నేనే గెలవాలి. నీవు ఓడాలి' అన్న సూత్రం ఆధారంగా పోరాడి ఓడిన దుర్యోధనుడు సాధించినది లేదు. అదే సూత్రం ఆధారంగా పోరాడి గెలిచిన పాండవులు బావుకున్నదీ లేదు. రెండు బలాలూ ఒక్కటిగా నిలిచినట్లయితే ఒక బలమైన సామ్రాజ్యం అవిష్కృతమయ్యేది. నిన్నటి మీద ఈ రోజు ఎంత ఎదిగామన్న దానిపైనే ఉండాలి పోటీ. కానీ, ఎదుటి వ్యక్తిపై ఉంటే సాధించే విజయం ఏనాడైనా నిరర్థక విజయమే అవుతుందనేది భారత యుద్ధం చెప్పే నీతి.